విభజన హామీలు తెరపైకొచ్చాయి కానీ..

విభజన హామీలు తెరపైకొచ్చినా ఏపీ అభివృద్దికి ఎంత మొత్తం నిధులు ఇస్తున్నారో కేంద్రం చెప్పలేదు. దీనిని పలువురు తప్పు పడుతున్నారు.


విభజన హామీలు తెరపైకొచ్చాయి కానీ..
x

పదేళ్ల తర్వాత ఏపీ విభజన హామీలు తెరపైకొచ్చాయి. ప్రత్యేక హోదాను ప్రస్తావించకుండానే కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటన చేసింది. విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని, అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొనడం పలు విమర్శలకు తావిచ్చింది.

కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు అందించే సాయం మీద కూడా ఆమె స్పష్టమైన ప్రకటన చేయలేదు. ప్రత్యేక ప్యాకేజీ అంశం తెర మీదకు తెచ్చిన కేంద్రం, ఈసారి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు అంటూ కొత్తగా చెబుతున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. గెలిచిన తరువాత కూటమిలో చేరిన బీహార్‌ ప్రభుత్వం మాత్రం భారీగా నిధులు సాధించుకుంది. మొత్తంగా కేంద్రంలో చక్రం తిప్పేలా ఏపీ ప్రజలు చంద్రబాబుకి మెజారిటీ ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో నిధులు సాధించలేదు. లక్ష కోట్లు కావాలని కోరినా కేవలం రూ. 15వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో ప్రకటించారు కేంద్రం పెద్దలు.
ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు రూ.10 లక్షల విద్యారుణాలు ఇస్తామని బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. దేశీయంగా చదువుకునే లక్ష మందికి ఏటా రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. ఇక వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి నోడ్, విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడార్, కర్నూల్‌ జిల్లా ఓర్వకల్లు నోడ్‌ హైదరాబాద్‌–బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లకు బడ్జెట్‌ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. అన్ని ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామన్నారే కాని ఎంత మొత్తం అనేది ఎక్కడా ప్రస్తావించలేదు. బడ్జెట్‌లో కూడా ఎక్కడా సూచించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
రాయలసీమ అంటే నాలుగు పూర్వపు జిల్లాలు, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్ర పూర్వపు మూడు జిల్లాల్లో ప్రత్యేంగా నిధులు వినియోగించి అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. ఏవిధమైన అభివృద్ధి అనేది ఎక్కడా ప్రస్తావించలేదు. గతంలోనే ఈ మూడు ప్రాంతాల అభివృద్ధికి రూ. 350కోట్లు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేసి తిరిగి కేంద్రం తీసుకుంది. అయినా అప్పట్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నోరు మెదపలేదు. అంతకు ముందు పాలించిన చంద్రబాబు కూడా నోరెత్తలేదు. అప్పుడూ, ఇప్పుడూ ఎన్‌డీఏ కూటమిలో చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడే అవకాశం లేదని పలువురు ఆర్థిక వేత్తలు అంటున్నారు.
రాజకీయంగానే నిధులు రాబట్టాలి తప్ప సాగిలపడితే నిధులు రావని వారు అంటున్నారు. రాయలసీమకు చెందిన రిటైర్డ్‌ అర్థశాస్త్ర ఫ్రొఫెసర్‌ గరికముక్కల సవరయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బీహార్‌కు కొంత గ్రాంట్, కొంత రుణం రూపెణా నిధులు కేంద్రం బడ్జెట్‌లో కేటాయించింది. ఏపీకి గ్రాంట్‌ అనే మాటే లేకుండా పోయింది. అమరావతి నిర్మాణానికి సుమారు రెండు లక్షల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం ఇస్తామన్న రూ. 15వేల కోట్లతో ఏమూల ఏమి నిర్మించగలరనేది ఆయన ప్రశ్న. ఆశలు తప్ప బడ్జెట్‌లో అవకాశాలు ఎక్కువగా ఏపీకి కల్పించలేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశ స్థాయిలో బాగానే ఉంది. సంక్షేమం వైపు మొగ్గు చూపారు. యువతో స్కిల్‌ నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం బాగానే ఉన్నా ఏపీకి చెప్పుకోదగినవి ఏమీ ఇవ్వలేదన్నారు. అభివృద్దికి నిధులు అంటే ప్రకాశం జిల్లాలో పొదిలి నుంచి దొనకొండ మీదుగా అద్దంకి వరకు పారిశ్రామిక కారిడార్‌ నిర్మిస్తామని 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ ఆ ఆలోచన అమలుకు నోచుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నారు.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ బివి మురళిధర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర బడ్జెట్‌ దేశ స్థాయిలో బాగానే ఉందన్నారు. అయితే రాష్ట్రానికి చెప్పుకోదగిన విధంగా సాయం అందలేదన్నారు. విభజన హామీలు అమలు చేసేందుకు నిర్థిష్టమైన బడ్జెట్‌ కేటాయింపులు చేసి ఉంటే బాగుండేదన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు అన్నారే కాని ఎంత మొత్తం ఇస్తారు. ఏ విధమైన అభివృద్ది చేస్తారనేది ఎక్కడా చెప్పలేదు. బడ్జెట్‌లో కేటాయింపుల కంటే తర్వాతైనా నిధులు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక కారిడార్‌లు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఎంత ఇస్తున్నారని చెప్పకపోవడం సరైందని కాదన్నారు.
Next Story