యువర్ అటెన్షన్ ప్లీజ్.. అమరావతికి చుక్ చుక్ రైలు వస్తోంది!
x

యువర్ అటెన్షన్ ప్లీజ్.. అమరావతికి చుక్ చుక్ రైలు వస్తోంది!

ప్రభుత్వాలు మారినా అమరావతే రాజధానిగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఖరారు చేయడంతో పాటు చకచకా భవంతులు, రయ్ రయ్ మంటూ రైళ్లు, బస్సులు దూసుకువస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇకపై భ్రమరావతి కాదంటున్నారు పాలకులు. ప్రభుత్వాలు మారినా అమరావతే రాజధానిగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఖరారు చేయడంతో చకచకా భవంతులు, రయ్ రయ్ మంటూ రైళ్లు, బస్సులు దూసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో వరాన్ని ప్రకటించింది. అమరావతి ప్రాంతాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి రూ.2,245 కోట్లతో 57 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ గుడ్ న్యూస్ ను ప్రకటించారు. 160 కి.మీ. వేగంతో డబుల్ లైన్ లో రైళ్లు రాకపోకలు సాగించేలా సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ నిర్మిస్తామని కేంద్రమంత్రి చెప్పారు. అది కూడా కోటిపల్లి రైల్వే లైను మాదిరి ఏ పాతికేళ్లకో ముప్పై ఏళ్లకో కాకుండా సరిగ్గా మూడేళ్లలో నిర్మించి తీరుతామని చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా శుభవార్తే.


‘అమరావతి నగరానికి రైల్వే లింక్ కల్పించడానికి రూ.2,245 కోట్లతో 57 కి.మీ. కొత్త లైన్‌ నిర్మించాలని నిర్ణయించాం. అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాల ప్రయోజనాలతో ఈ ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశాం. ఇందుకోసం కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల సుదీర్ఘ వంతెన చేపట్టబోతున్నాం. భారతీయ రైల్వేలో ఇదో ప్రధాన వంతెనగా నిలుస్తుంది. ఈ లైన్‌తో అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, నాగ్‌పుర్, బెంగళూరులకు నేరుగా, ముంబయి, ఢిల్లీలకు హైదరాబాద్, నాగ్‌పుర్‌ల మీదుగా అనుసంధానం ఏర్పడుతుంది' అని సాక్షాత్తు కేంద్ర మంత్రే చెప్పడం ముదావహం.

వైసీపీ హయాంలో నిలిచిన అమరావతి నగర నిర్మాణానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే మళ్లీ రాళ్లెత్తడం ప్రారంభించారు. ఈ నగర నిర్మాణంతో పాటు రైల్వే లైను పనులు కూడా చకచకా సాగుతాయంటున్నారు. ఈ లైన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాంస్కృతిక, చారిత్రక ప్రాంతాలైన అమరలింగేశ్వరస్వామి ఆలయం, అమరావతి స్తూపం, ధ్యానబుద్ధ విగ్రహం, ఉండవల్లి గుహలను, మచిలీపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, వైజాగ్‌ పోర్టులను అనుసంధానం చేస్తారని సమాచారం.

ప్రాజెక్ట్ స్వరూపం ఇలా..

ప్రస్తుత నమూనా ప్రకారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం వద్ద రైల్వే లైను చీలుతుంది. అక్కడి నుంచి పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం మీదుగా నంబూరు వరకు సాగుతుంది. పరిటాల దాటిన తర్వాత కృష్ణానదిపై వంతెన కడతారు. నంబూరు పెద్ద జంక్షన్ కాబోతోంది. అక్కడి నుంచి మెయిన్ లైన్ కి కలుపుతారు. పరిటాలలో రైలు, రోడ్డు, జల రవాణాకు సంబంధించిన కార్గో టెర్మినల్‌ వస్తుంది. రూ.2,245 కోట్ల ఖర్చు, 57 కి.మీ. దూరం, 19 లక్షల పనిదినాలు.. వెరసి ఈ ప్రాజెక్టు. దీనివల్ల 6 కోట్ల కిలోగ్రాముల కర్బన ఉద్ఘారాలు తగ్గుతాయి. 25 లక్షల చెట్లు నాటిన దాంతో సమానం ఇది.

ఇదివరకటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించలేదని, భవిష్యత్తులో ప్రభుత్వాలు మారితే అమరావతి రాజధానిగా ఉంటుందా లేదా? అన్న ప్రశ్నకు కేంద్రమంత్రి అశ్వినీ బదులిస్తూ ‘అమరావతి ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఉంటుంది. ఈ రైల్వే ప్రాజెక్టు, రాజధాని నగర నిర్మాణం ఏకకాలంలో జరుగుతాయి’ అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం సింగిల్‌లైన్‌గా నిర్మిస్తున్నప్పటికీ డబుల్‌ లైన్‌ కోసం భూసేకరణ చేపడతామని, వంతెన పునాదులు కూడా డబుల్‌లైన్‌ను దృష్టిలో ఉంచుకొని వేస్తామన్నారు. ఏ రైల్వే ప్రాజెక్టు అయినా తొలుత సింగిల్‌లైన్‌గా నిర్మించి, తర్వాత ట్రాఫిక్‌ చూసుకొని విస్తరిస్తారని చెప్పారు. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వెళ్లే మార్గాలను కూడా సెమీ హైస్పీడ్‌ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు.

ఈ ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చరిత్రాత్మకమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ప్రయోజనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దుగ్గుబాటి పురందేశ్వరీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలంటూ చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద వరమని పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తంచేశారు. అయితే ప్రజలు మాత్రం- కోటిపల్లి రైల్వే లైను మాదిరి ఓ పాతిక, ముప్పై ఏళ్లు కాకుంటే చాలని వ్యాఖ్యానిస్తున్నారు.

Read More
Next Story