వైసీపీ కోటి సంతకాలకు చంద్రబాబు సర్కార్ కదుల్తుందా?
x

వైసీపీ కోటి సంతకాలకు చంద్రబాబు సర్కార్ కదుల్తుందా?

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై 'కాలు దువ్విన' వైసీపీ


ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ ఉద్యమానికి అనూహ్య స్పందన లభించినట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఈ నెల 18న గవర్నర్‌కు సమర్పిస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు.
వైసీపీ అధికారిక ఫేస్ బుక్ గ్రూపులో పెట్టిన పోస్టర్
వైఎస్‌ జగన్ పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రచ్చబండల ద్వారా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. మారుమూల గిరిజన గూడేల నుంచి జిల్లా కేంద్రాల వరకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అభిప్రాయాన్ని సంతకాల రూపంలో వెల్లడించారని పేర్కొన్నారు.
జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు.. తాడేపల్లికి సంతకాల తరలింపు
కోటి సంతకాల ఉద్యమం ముగింపు సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రాల నుంచి వాహనాల ద్వారా సంతకాల ప్రతులను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
జగన్ ట్వీట్‌.. ప్రభుత్వ విధానాలపై ప్రజల తీర్పు
ఈ సందర్భంగా వైఎస్‌ జగన్ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభించిన కోటి సంతకాల ఉద్యమం చారిత్రాత్మకంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీలు, ప్రజల భాగస్వామ్యం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో చాటుతున్నాయని వ్యాఖ్యానించారు.

‘సేవ్‌ మెడికల్‌ కాలేజెస్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన పోస్ట్‌లో, ఈ ఉద్యమానికి అండగా నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
18న గవర్నర్‌కు సమర్పణ
సేకరించిన కోటి సంతకాల ప్రతులు ప్రస్తుతం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయని, అక్కడి నుంచి డిసెంబర్‌ 18న గవర్నర్‌ను కలిసి ప్రజల అభిప్రాయాన్ని వివరించనున్నట్టు వైఎస్‌ జగన్ తెలిపారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయపరమైన చర్యలకు కూడా వెళ్లనున్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ప్రజారోగ్య వ్యవస్థకు, వైద్య విద్యకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేశారు.
Read More
Next Story