సీమ గొంతు నొక్కేందుకే బొజ్జా అరెస్ట్ : నంద్యాలలో పెల్లుబికిన నిరసన
బొజ్జా అరెస్టుకు నిరసనగా నంద్యాల శ్రీనివాససెంటర్ లో రైతుల రాస్తారోకో, న్యాయం కావాలంటే అరెస్టు చేయడం అన్యాయం అంటున్న రైతులు
రాయలసీమ ఉద్యమనేత బొజ్జా దశరథరామిరెడ్డిని అరెస్టుకు నిరసనగా నంద్యాల జిల్లా కేంద్రంలో నిరసన లేచింది.
రాయలసీమ కరువు, వలసలకు శాశ్వత పరిస్కారానికి కోసం కృషి చేయకుండా, ఈ ప్రాంతానికి సాగు, త్రాగునీటి హక్కుల కోసం పోరాడుతున్న రైతు నేతను అరెస్టు చేయడం అన్యాయమని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అన్నారు.
బొజ్జా దశరథరామిరెడ్డి అరెస్టుకు నిరసనగా బుధవారం నంద్యాల శ్రీనివాససెంటర్ లో రాయలసీమ సాగునీటి సాధన సమితి మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులు మానవహారంగా నిలిచి నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై. ఎన్. రెడ్డి, సీనియర్ న్యాయవాది బి. శంకరయ్య, వై ఎస్ ఆర్ సి పి రైతు నాయకులు బెక్కెం రామసుబ్బారెడ్డి, ఇప్పల చిన్న తిరుపతి రెడ్డి,టి డి పి రైతు నాయకులు బాలీశ్వర్ రెడ్డి, రవిబాబు, గడివేముల మండల రైతు నాయకులు సంజీవరెడ్డి, పాణ్యం రైతు నాయకులు మురళీధర్ రెడ్డి, బండి ఆత్మకూరు మండల నాయకులు లాయర్ కృష్ణా రెడ్డి, మహానంది మండల నాయకులు, మున్సిపల్ కార్మికసంఘ నాయకులు షణ్ముఖరావు, జిల్లెల్ల శ్రీరాములు తదితరులు మాట్లాడారు.
వారేమన్నారంటే...
"నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వర పుణ్య క్షేత్రం సమీపంలోని సిద్దేశ్వరం గ్రామం వద్ద కృష్ణానదిపై అలుగు నిర్మిస్తే సుమారు 60 TMC నీరు నిలిచి రాయలసీమ ప్రాంతానికి సాగు, త్రాగు నీరు అందుతాయి.
"రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు బొజ్జా దశరథరామిరెడ్డి నాయకత్వంలో 2016 మే 31 వ తేదీన రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి సుమారు 35 వేల మంది ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం కోసం ప్రజా శంకుస్థాపన చేశారు. ఇది ప్రభుత్వాల అలసత్వానికి గుర్తుగా తీసుకున్న చర్య. కొన్ని వేల మంది నిర్బంధాన్ని అదిగమించి నాటి సిద్దేశ్వరం యాత్రకు వచ్చారు. పోలీసులు దారికి అడ్గంగా గుంతలు తవ్వి ఉద్యమకారులు అలుగు నిర్మాణ ప్రదేశం చేరకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ప్రజలు ఆగోతులను పూడ్చుకుంటూ ముందుకెళ్లారు. ప్రజా శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా ముగిశాక పోలీసులు కొందరి మీద కేసులు పెట్టారు. ఇది 2016 లో జరిగిన సంఘటన. అప్పటి నుంచి ఇప్పటిదాకా పట్టించుకోొకుండా ఇపుడు అరెస్టు చేయడం ఆశ్చర్యం. ఆనాటి కేసులో ఇప్పుడు బొజ్జా దశరథరామిరెడ్డిని అరెస్టు చేశామని ప్రభుత్వం ఇప్పుడు చెప్పడం సరికాదు.
"గత ఏడాది కర్ణాటక, ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ లబ్దికోసం కేంద్రంలోని బి జె పి ప్రభుత్వం కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి రాయలసీమకు నీరు రాకుండా చేస్తోందని దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం లేదని బొజ్జా దశరథరామిరెడ్డి రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమం చేస్తునందుకు అరెస్టు చేస్తున్నారా?
కృష్ణానది యాజమాన్య బోర్డు ( KRMB ) ని కృష్ణానది పరివాహక ప్రాంతంలో గాక విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బొజ్జా వ్యతిరేకించారు, తెలంగాణకు కృష్ణా నది జలాలు తరలించి రాయలసీమను ఎడారిగా మార్చే కేంద్ర నల్ల చట్టాన్ని రద్దు చేయాలని బొజ్జా రాజీలేని ఉద్యమం చేస్తున్నాడు. వామపక్ష పార్టీలతో కలిసి ఉద్యమం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధతను నిలదిస్తున్నందుకే ప్రభుత్వం బొజ్జా పై అక్రమ కేసులు పెట్టి, పాత కేసులు అంటూ అరెస్టు చేస్తున్నది.
రాయలసీమ ప్రాంత సాగునీటి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న దశరథరామిరెడ్డిని అరెస్ట్ చేయడం రాయలసీమ గొంతును అణిచివేయడమే అవుతుంది.
రాయలసీమ నేతల డిమాండ్లు
అరెస్టులతో రాయలసీమ ఉద్యమకారుల గొంతు నొక్కలేరు, బొజ్జా దశరథరామిరెడ్డిని భేషరతుగా విడుదల చేసి కేసులు రద్దు చేయాలి, జగన్ ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి పెంచి కర్ణాటకలో అక్రమంగా నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టును ఆపాలి. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం చేసే కృష్ణా నది నీటి తరలింపు నల్ల చట్టాలు రద్దు చేయించాలి. కర్నూలులో KRMB ని ఏర్పాటు చేయాలి, రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.