
నటి జెత్వానీ కేసులో పీఎస్సార్ ఆంజనేయులు అరెస్ట్
ముంబై నటి జెత్వానీకి వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu) అరెస్ట్ అయ్యారు.
ముంబై నటి జెత్వానీకి వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu) అరెస్ట్ అయ్యారు. సీఐడీ పోలీసులు ఆయన్ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఇటీవలి కాలంలో అరెస్ట్ అయిన రెండో పోలీసు అధికారి ఈయన. ఈమధ్యనే పోలీసుల్ని విధుల నుంచి అడ్డుకున్నారనే ఆరోపణపై మాజీ ఎంపీ అయిన ఓనాటి పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేశారు.
వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. మాజీ సీఎం జగన్‌కు ఆయన అత్యంత సన్నిహితునిగా ఉన్నారు. ప్రస్తుతం పీఎస్‌ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయన్ను తరలిస్తున్నారు. జెత్వానీ కేసులో పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు విచారించనున్నారు.
ముంబై నటి కాదంబరి జెత్వాని ఆరోపణలపై పిఎస్సార్ ఆంజనేయులుతో పాటు విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసింది. పిఎస్సార్ మినహా మిగిలిన పోలీస్ అధికారులు ముందస్తు బెయిల్ పొందారు. ఈ కేసులో తన ప్రమేయం లేదన్న పిఎస్సార్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేదు.
ముంబై నటి వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఇంటెలిజెన్స్ డీజీని మంగళవారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైకు చెందిన పారిశ్రామికవేత్తపై నమోదైన కేసు వ్యవహారంలో పక్కా వ్యూహంతో నటిపై కేసులు నమోదు చేసి ఆమె పెట్టిన ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేశారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.
వైసీపీ ప్రభుత్వ హయంలో పిఎస్సార్ ఆంజనేయులు కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేయడంతో పాటు ప్రతిపక్షాలను వేధించారని, కేసుల దర్యాప్తులో ప్రతిపక్షాలను టార్గెట్ చేసేలా నేరుగా ఆదేశాలు జారీ చేశారని టీడీపీ గతంలో పలుమార్లు ఆరోపించింది.
ముంబై నటి వ్యవహారంలో కుక్కల విద్యా సాగర్ ఫిర్యాదుతో జరిగిన పరిణామాల వెనుక పిఎస్సార్ ఉన్నాడని సీఐడీ భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు కొద్ది నెలలుగా సస్పెన్షన్‌లో ఉన్నారు. విజయవాడ విడిచి వెళ్లకూడదని ఉత్తర్వులు ఉన్నా ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు.
ఆంజనేయులును అరెస్ట్ చేసేందుకు బేగంపేటలోని ఆయన నివాసంతో పాటు మొయినాబాద్‌కు ఏపీ సీఐడీ బృందాలు వెళ్లాయి. మొయినాబాద్ లో ఉన్న పిఎస్సార్ ఆంజనేయులు ఫార్మ్ హౌస్ కి వచ్చిన ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు సమాచారం అందించారు. పిఎస్సార్ ఆంజనేయులుపై రఘు రామకృష్ణం రాజు కస్డోడియల్ టార్చర్ కేసులో హత్యాయత్నం అభియోాలు కూడా గతంలో నమోదు చేశారు. పీఎస్సార్ ఆంజనేయులు గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో ముగ్గుర్ని ఎన్ కౌంటర్ చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి.
Next Story