కోర్టులో తన వాదనలు తానే వినిపించిన పిఎస్సార్ ఆంజనేయులు
x

కోర్టులో తన వాదనలు తానే వినిపించిన పిఎస్సార్ ఆంజనేయులు

నటి జెత్వానీ కేసులో పీఎస్సార్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కిందిస్థాయి అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆమెపై కేసు పెట్టారు అని సీఐడీ పేర్కొంది


ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు (PSR Anjaneyulu) రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసులో అరెస్టై ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు తప్పుడు పత్రాలు సృష్టించినట్టు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. పీఎస్‌ఆర్‌ ఆదేశాలతో ఫోర్జరీ డాక్యుమెంట్లతో నకిలీ ఆధారాలు సృష్టించారని పోలీసులు చెబుతున్నారు. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులే కేసు నమోదు చేయాలని కాంతిరాణా, విశాల్‌ గున్నికి చెప్పినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.

ముంబై నటి జెత్వానీకి వేధింపుల కేసులో ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు (PSR Anjaneyulu) అరెస్ట్‌ అయ్యారు. జెత్వానీ కేసును సీఐడీ అధికారులు విచారించనున్నారు.
ముంబై నటి కాదంబరి జెత్వాని ఆరోపణలపై పిఎస్సార్‌ ఆంజనేయులుతో పాటు విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసింది. పిఎస్సార్ మినహా మిగిలిన పోలీస్ అధికారులు ముందస్తు బెయిల్‌ పొందారు. ఈ కేసులో తన ప్రమేయం లేదన్న పిఎస్సార్‌ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేదు.
ముంబై నటి వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఇంటెలిజెన్స్‌ డీజీని మంగళవారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ముంబైకు చెందిన పారిశ్రామికవేత్తపై నమోదైన కేసు వ్యవహారంలో పక్కా వ్యూహంతో నటిపై కేసులు నమోదు చేసి ఆమె పెట్టిన ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేశారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.
ముంబై నటి వ్యవహారంలో కుక్కల విద్యా సాగర్‌ ఫిర్యాదుతో జరిగిన పరిణామాల వెనుక పిఎస్సార్‌ ఉన్నాడని సీఐడీ భావిస్తోంది. ‘‘పీఎస్‌ఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అలాంటి అధికారి సాక్ష్యాలు తారుమారు చేసే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మహిళపై అక్రమ కేసు నమోదుకు అధికారులను ప్రభావితం చేశారు. కిందిస్థాయి అధికారులకు తప్పుడు దిశానిర్దేశం చేశారు’’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
రిమాండ్ సందర్భంగా కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టులో పీఎస్ఆర్ స్వ‌యంగా త‌నే వాద‌న‌లు వినిపించారు. ముంబ‌య్ నటి కేసుతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ త‌న‌పై కేసు పెట్టార‌ని న్యాయ‌మూర్తి దృష్టికి తీసుకెళ్లారు. మాజీ డీసీపీ విశాల్ గున్నీని ర‌క్షిస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం హామీ ఇవ్వ‌డంతో అప్రూవ‌ర్‌గా మారాడ‌న్నారు. 164 స్టేట్‌మెంట్ ఇవ్వాల‌ని విశాల్ గున్నీని అడిగినా ఇవ్వ‌లేద‌ని కోర్టులో పీఎస్ఆర్ వాదించారు.
విశాల్ గున్నీతో త‌న‌కు సంబంధం లేక‌పోయినా, ఉన్న‌ట్టు చెప్పించారని ఆయ‌న వాపోయారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న సీఐడీ కోర్టు వ‌చ్చే నెల 7వ తేదీ వ‌ర‌కూ రిమాండ్ విధించింది. అనంత‌రం ఆయ‌న్ను విజ‌య‌వాడ స‌బ్‌జైలుకు త‌ర‌లించారు.
Read More
Next Story