ఒంటరితనంతో పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడి ఆత్మహత్య
x

ఒంటరితనంతో పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడి ఆత్మహత్య

వేటాడిన ఒంటరితనం, అన్నీ ఉన్నా అనాధననే భావనతో బలవన్మరణం


ఆయనేమీ లేనివాడు కాదు.. సంపన్నుడే.. పేరు దువ్వూరు చంద్రశేఖరరెడ్డి.. నెల్లూరు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, దివంగత పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడు.. అంతటి చంద్రశేఖరరెడ్డి ఊరుగాని ఊర్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరులో ఆయన ఎరిగిన వారిని కలవరపర్చింది. అయ్యో, చంద్రశేఖరరెడ్డి ఇట్లా చనిపోయాడా అని సీపీఎం శ్రేణుల మొదలు ఆయన బంధువులు, స్నేహితులు విస్తుపోయారు.
నెల్లూరుకు చెందిన దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి వయసు 77 ఏళ్లు. పుచ్చలపల్లి సుందరయ్యకి మేనల్లుడు. చంద్రశేఖర్‌రెడ్డికి ఇద్దరు పిల్లలు. వాళ్లు అమెరికాలో ఉన్నారు. ఈయన కూడా కొంతకాలం అక్కడే ఉండి ఇటీవలే వచ్చారు. భార్య కొన్నేళ్ల క్రితం మరణించారు. ఒంటరి జీవితం. హైదరాబాద్‌ వచ్చి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు.
ఈనేపథ్యంలో ఆయన కొంతకాలంగా జీవితంపై విరక్తితో చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట కాశీ యాత్రకు కూడా వెళ్లారు. తిరిగి హైదారాబాద్ వచ్చే సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బుధవారం ఖమ్మంలో రైలు దిగి స్టేషన్‌కు కొద్ది దూరాన ఉన్న మామిళ్లగూడెం ప్రాంతంలో తెల్లవారుజామున గరీబీ రథ్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చంద్రశేఖరరెడ్డి వద్ద లభించిన సెల్‌ఫోన్, ఆధార్‌ కార్డ్‌లోని వివరాల ఆధారంగా అధికారులు బంధువులకు సమాచారం ఇచ్చారు. అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో భౌతికకాయాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి బంధువులు ఖమ్మం చేరుకుని ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు.

ఒంటరితనమే ఆయన ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. చంద్రశేఖర్‌రెడ్డి భార్య 25 ఏళ్ల క్రితం మరణించారు. 15రోజుల కిందట హైదరాబాద్ లో తాను ఉంటున్న ఆశ్రమాన్ని ఖాళీ చేశారని బంధువులు చెప్పారు. కాశీ పర్యటన ముగించుకుని నెల్లూరు వెళుతున్నానని తనకు మనుమడు వరసయ్యే వ్యక్తికి చెప్పిన తర్వాత 24 గంటలకు ఈ సంఘటన జరిగిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
నెల్లూరులో శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి.
Read More
Next Story