పులివెందులలో కాయ్ రాజా కాయ్!
x

పులివెందులలో కాయ్ రాజా కాయ్!

పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక రేపే: ఉత్కంఠ భరిత పోరు


మరికొద్ది గంటల్లో జరగబోయే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 12 ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ హైప్రొఫెల్ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పులివెందులలో, ఇది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య పరోక్ష యుద్ధంలా మారింది. పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక ఫలితాలపై జోరుగా పందాలు కూడా సాగుతున్నాయి.

చంద్రబాబు vs జగన్...
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఈ సీటు కోల్పోతే, ఆయన రాజకీయ పట్టు కదిలిందని ప్రతిపక్షం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో చంద్రబాబు సొంత నియోజకవర్గమైన “కుప్పం”లో జగన్ సృష్టించిన ఒత్తిడికి ప్రతిస్పందనగా, ఆయన గడ్డలోనే దెబ్బకొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1978 నుంచి వైఎస్ కుటుంబం ఆధిపత్యం కొనసాగుతున్న ఈ కోటను కూల్చటం టీడీపీకి ప్రతిష్టా విషయం.
పులివెందుల జెడ్పీటీసీకి ఇప్పటి వరకు ఐదు సార్లు ఏకగ్రీవ ఎన్నికలు జరగ్గా ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక, ఒంటిమిట్ట 30 ఏళ్లుగా కాంగ్రెస్–వైఎస్సార్‌సీపీ పట్టు ఉన్న ఈ స్థానం. రెడ్డి సామాజిక ఓటర్లతో కూడిన కీలక కేంద్రం.
పులివెందులలో టీడీపీ వ్యూహం...
పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో మొత్తం 11 మంది పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున పులివెందులలో మారెడ్డి లతా రెడ్డి బరిలో ఉన్నారు. ఆమె భర్త బీటెక్ రవి. గతంలో వైఎస్సార్ కుటుంబ సభ్యుడిని ఎమ్మెల్సీగా ఓడించిన అనుభవం ఉంది. ఈసారి వైఎస్సార్‌సీపీ ద్వితీయ శ్రేణి నేతలను తమవైపు తిప్పుకోవడంపై దృష్టి పెట్టారు. వైఎస్ జగన్ సొంత బాబాయి వివేకానందరెడ్డి కూతురు సునీతను కూడా ప్రచార రంగంలోకి తెచ్చి, జగన్‌కు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు.
టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డిలు భుజాన వేసుకున్నారు. వీరికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవిత, మంత్రి కొలుసు పార్థసారథి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు ఆర్.మాధవి, పుత్తా చైతన్యరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, బండారు శ్రావణి, భూపేశ్‌రెడ్డి, ఎంఎస్ రాజు, ఇతర టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక మాజీ సీఎం జగన్ ఆదేశాలతో వ్యూహరచనతో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం పాటుపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కడప మేయర్ సురేశ్ బాబు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఈ రెండు ఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో కలకలం రేపాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా రోజుల తర్వాత మొదటిసారిగా జనం ఓటు వేయబోతున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్లాన్
వైసీపీకి ఇది డూ ఆర్ డై అనేలా మారింది. ఈ జెడ్పీటీసీ అధ్యక్షునిగా పని చేస్తూ మరణించిన సి. మహేశ్వర రెడ్డి కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపారు. సానుభూతి ఓట్లు, కుటుంబ వారసత్వం, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధి ప్రాజెక్టులను హైలైట్ చేస్తూ ప్రచారం సాగింది. ప్రచారాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పి. రవీంద్రనాథ్ రెడ్డి సమన్వయ పరిచారు.

పోలింగ్ ముందుగా ఇరు పార్టీల మధ్య ఘర్షణలు, పరస్పర ఆరోపణలు ఉధృతమయ్యాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీపై హింసాత్మక చర్యలు, తప్పుడు కేసులు, ఓటర్ల భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శిస్తోంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీని హింసా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని ప్రతిగా ఆరోపిస్తోంది.
ఒంటిమిట్ట పోటీ..
ఒంటిమిట్టలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి, టీడీపీ అభ్యర్థి అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పూల విజయభాస్కర్ మధ్య ప్రధాన పోటీ ఉంది. రెడ్డి సమాజం ఓటు బలం ఈ పోటీలో కీలకం కానుంది.
ఓటుకు రేటు...
జెడ్పీటీసీ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఆదేస్థాయిలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాయి. పులివెందులలో గెలుపును వైసీసీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఓటుకు రూ.5 వేలు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. టీడీపీ కూడా అదే స్థాయిలో ఓటుకు నోటు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక్కడ 10,600 ఓట్లు ఉన్నాయి. అంటే ఒక్కో ఓటుకు ఇరుపార్టీలు కలిసి రూ.10వేలు ఇస్తున్నారు. ఆదివారం రాత్రికే మొత్తం పంపిణీ పూర్తయినట్లు చెబుతున్నారు. ఇక ఒంటిమిట్టలో రూ.3వేలు వంతున పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో వైసీపీ రూ.4వేలు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి పులివెందుల, ఒంటిమిట్టలో సుమారు రూ.25 కోట్లకు పైగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు చర్చ సాగుతుంది.
భారీ బందోబస్తు...
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ తర్వాత పులివెందులలో కొన్ని చెదురు ముదురు సంఘటనలు జరిగాయి. దీంతో ఇక్కడ 700 మందితో భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇక్కడ 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే పోలింగ్ రూటులో సీఐ స్థాయి అధికారి, పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐని ఏర్పాటు చేస్తున్నారు. పులివెందులలో మొత్తం సమస్యాత్మక కేంద్రాలు కావడంతో స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు డీఐజీ కోయప్రవీణ్ వెల్లడించారు. ఒంటిమిట్టలో సోమశిల అటవీ సమీప పరిధిలో ఉండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా కడప ఎస్సీ ఆధ్వర్యంలో 6 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా సరిహద్దులో అద్దాలమర్రి బాట చెక్ పోస్టు, అనుగంపల్లె, పార్నపల్లె వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అలాగే కనంపల్లె, నల్లగొండుగారిపల్లె, రాయలాపురం, చందమామ దాబా, అలవలపాడు రోడ్డుసర్కిల్, ఎర్రపల్లి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
పోలింగ్, ఓటర్ల వివరాలు
పులివెందుల: 15 పోలింగ్ స్టేషన్లు, 10,601 ఓటర్లు.
ఒంటిమిట్ట: 30 పోలింగ్ స్టేషన్లు, 24,606 ఓటర్లు.
పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతుంది. భద్రత కోసం అదనపు బలగాలు, డ్రోన్ పర్యవేక్షణ, సీసీ కెమెరా మానిటరింగ్ ఏర్పాటు చేశారు.


Read More
Next Story