ఎలాన్ మస్క్‌కు బీజేపీ ఎంపీ సవాల్
x

ఎలాన్ మస్క్‌కు బీజేపీ ఎంపీ సవాల్

భారత్‌లో తయారైన ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయలేరని, మస్క్‌కు దమ్ముంటే భారత ఈవీఎంను హ్యాక్ చేసి చూపించాలని బీజేపీ ఎంపీ పురందేశ్వరి సవాల్ చేశారు.


ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా భారత్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్, హాక్ జరిగిందన్న వివాదాలకు మూలంగా మారాయి. ఇప్పుడు దేశమంతా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌లో దాదాపు 20 లక్షల ఈవీఎంలు మాయమయ్యాయని, వీటి గురించి ప్రశ్నిస్తే ఎన్నికల సంఘం కూడా తమకు అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదని సమాధానం ఇచ్చిందంటూ అనేక కథనాలు ప్రచారం జరుగుతున్నాయి. వాటిలో ఎటువంటి వాస్తవం లేదని, ఒక్క ఈవీఎం కూడా గల్లంతు కాలేదని జాతీయ ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చినా.. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. తన తప్పును కప్పి పుచ్చుకోవడానికే ఈసీ ఇలా చెప్తున్నవారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై బీజేపీ ఎంపీ పురందేశ్వరి ఘాటుగా స్పందించారు.

మస్క్‌కు పురందేశ్వరి ఛాలెంజ్

ఈ వివాదం నేపథ్యంలోనే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ పురందేశ్వరి.. ప్రపంచ కుబేరుడికి సవాల్ విసిరారు. భారత్‌లో తయారైన ఈవీఎంను హ్యాక్ చేసి చూపించాలని ఛాలెంజ్ చేశారు. ‘‘ఎలాన్ మస్క్ ప్రకారం ఏ ఈవీఎంను అయినా హ్యాక్ చేయవచ్చు. ఈ సందర్భంగానే ఎలాన్ మస్క్‌ను భారత్‌కు పిలవాలని, మన ఈవీఎంను హ్యాక్ చేయడానికి ప్రయత్నించడానికి అనుమతించాలి. ఇప్పటికు ఈవీఎం హ్యాక్ చేయడానికి ఎంతో మంది ప్రయత్నించినా ఎవరూ సక్సెస్ కాలేకపోయారు’’ అని ఆమె ఎక్స్(ట్వీట్) చేశారు. ఆమె ట్వీట్ ప్రస్తుతం సంచలన సృష్టిస్తోంది.

అసలు మాస్క్ చేసిన ట్వీట్ ఏంటి..

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ఈవీఎంలపై చేసిన ట్వీట్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంలోనే మస్క్, భారత కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతోంది. ఏ ఈవీఎంను అయినా హ్యాచ్ చేయొచ్చని మస్క్ అనగా.. భారత్‌లో తయారైన ఈవీఎంలను హ్యాక్ చేయలేరని చంద్రశేఖర్ బదులిచ్చారు. ఇంతకీ మస్క్ చేసిన ట్వీట్ ఏంటంటే.. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మస్క్ స్పందిస్తూ.. ‘‘ఈవీఎంలను తొలగించాలి. వాటిని వ్యక్తుల సహాయంతో లేదా ఏఐ సహాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది’’ అని మస్క్ ట్వీట్ చేశారు. ఆయన భారత్‌లోని ఎన్నికల ఉద్దేశించి ట్వీట్ చేయకపోయినా.. ఆయన ట్వీట్ వల్ల అత్యధికంగా భారత్‌లోనే దుమారం రేగుతోంది. ఈ విషయంలపై తీవ్రస్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి పురందేశ్వరి ఛాలెంజ్‌ను మస్క్ స్వీకరిస్తారో లేదో చూడాలి.

Read More
Next Story