విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మండలిలో ప్రతిపక్షానికి, అధికార పక్షానికి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. మీ వల్లే ప్రైవేట పరం అవుతుందని అధికార పక్షం, కాదు ప్రైవేటు పరం కావడానికీ మీరే కారకులు అని విపఓం అనడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశం తెరపైకొచ్చింది. వైఎస్‌ర్‌సీపీ ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్ ఈ అంశంపై ప్రశ్నను లేవనెత్తారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్న విషయం వాస్తవమేనా? అయినచో ప్రైవేటీకరణ ప్రక్రియ ఆపేందుకు ప్రభుత్వం ఎమైనా చర్యలు చేపట్టిందా? ఒక అలాంటి చర్యలు చేపట్టి ఉంటే వాటి వివరాలు చెప్పాలని ప్రశ్నించారు.
దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో దీనిపై త్రికరణ శుద్ధిగా పని చేసి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఆ రోజే దీనిపై అన్ని పార్టీలతో అఖిల పక్షం ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉండి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనల నుంచి కేంద్రం విరమించుకునేదని అన్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై అఖిల పక్షం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని, అన్ని పార్టీలతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. శాసనమండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ప్రైవేటీకరణ ఆపే శక్తి నాటి జగన్ ప్రభుత్వానికి ఉందని, అందువల్లే నాడు అఖిలపక్షం ఏర్పాటు చేయలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ జరగనివ్వలేదని అన్నారు. అలా బొత్స మాట్లాడుతున్న సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే కారణమని కూటమి సభ్యులు గోల చేయగా, కూటమి ప్రభుత్వం తీరు వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు దారి తీసిందని వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ప్రతిస్పందించారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య గందరగోళం, స్వల్ప వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.
బొత్స సత్యనారాయణ తన మాటలను కొనసాగిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్‌తో కూడికున్న అంశమని, 32 మంది త్యాగాల ఫలితంగా దీనిని సాధించుకున్నామని, దీని ప్రాముఖ్యతను గుర్తించి ప్రైవేటు పరం కాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని, దీనికి కట్టుబడి ఉన్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్లేందుకు తామకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
Next Story