2024 ఎన్నికల నేపథ్యంలో సామాజిక న్యాయం రాజకీయ అజెండాగా మారింది. సామాజిక న్యాయం చుట్టే రాజకీయాలు తిరుగుతుండటం విశేషం.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సామాజిక న్యాయ నినాదం రాజుకుంది. రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చిన అంబేద్కర్‌ అభిమానులు, సాధారణ ప్రజలు విజయవాడ నగరంలో సామాజిక న్యాయ నినాదాన్ని హోరెత్తించారు. ఈ నినాదం కొందరు అగ్రవర్ణాల వారికి రొకకరాని కొయ్యగా మారింది.

విజయవాడలో అంబేద్కర్‌ స్మృతివనం ప్రారంభం సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రూపాల్లోనూ అంటరాని తనం ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగ హక్కుల ద్వారా దీనిని రూపుమాపొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, సామాజిక సంక్షేమ విప్లవాన్ని తీసుకొస్తేనే పూర్తిగా అంటరాని తనం అంతమవుతుందనే అభిప్రాయం వెలుబుచ్చారు. దీనిని రూపు మాపేందుకు నేను చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ప్రకటించారు. సంక్షేమ పథకాలే కాదు, విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు సామాజిక విప్లవాన్ని తెస్తాయన్నారు.

అయితే ముఖ్యమంత్రి ప్రసంగంలో ఎక్కువగా అంబేద్కర్‌ను దళితులకే పరిమితం చేస్తూ మాట్లాడటం చర్చనియాంశమైంది. అంబేద్కర్‌ను అందరి నాయకుడుగా కాకుండా కొందరి నాయకుడుగానే చూపించేందుకు ప్రయత్నించడం దురదృష్ణకరమని సభ వద్దకు వచ్చిన కొందరు మేధావులు మాట్లాడుకోవడం విశేషం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్లుగా ఉన్నాయని, వర్గాల మధ్య చిచ్చుపెట్టేట్టుగా మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సామాజిక న్యాయశిల్పం ఆవిష్కరణకు వచ్చిన జనంలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉండటం విశేషం. జగన్‌ ప్రసంగం కూడా పెత్తదార్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మధ్య జరుగుతున్న సమరంగా వర్ణించారు. పెత్తందార్లంటే ఎవరో మీకు తెలుసని చెప్పడం విశేషం. ‘ఇప్పటి వరకు స్టాట్యూ ఆఫ్‌ లిబర్టి అంటే అమెరికా గుర్తుకు వచ్చినట్లు ఇకపై స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అంటే విజయవాడ నగరం గుర్తుకు వస్తుందని’ జగన పేర్కొన్నప్పుడు జనం నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.




Next Story