
పవన కల్యాణ్.. నిన్నొదలా అంటున్న రామ్ గోపాల్ వర్మ
సంచలనాలకు మారుపేరైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచల ప్రకటన చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోటీ చేస్తానంటున్నారు
సంచలనాలకు మారుపేరైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచల ప్రకటన చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోటీ చేస్తానంటున్నారు రామ్ గోపాల్ వర్మ. వ్యూహం సినిమా తీసి వైఎస్ జగన్ కు మద్దతు పలికిన రామ్ గోపాల్ వర్మ.. తనది ఆకస్మిక నిర్ణయం.. అంటూ ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను మాటలతో పొడిచి చంపేసే వర్మ ఈసారి తన కసంత పిఠాపురంలో తీర్చుకోబోతున్నారు.
తూర్పు గోదావరి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ఈ ప్రకటన చేశారు. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడో చెప్పలేదు కాని పిఠాపురం నుంచి పోటీ చేస్తా, ఇది ఆకస్మిక నిర్ణయం అన్నారు రామ్ గోపాల్ వర్మ. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ వేషభాషల మొదలు, ప్రతి మాటను ఖండఖండాలుగా చీల్చిచెండాడే రామ్ గోపాల్ వర్మ ఈసారీ ఆయన్ను వదిలిపెట్టలేదు. “ఆకస్మిక నిర్ణయం.. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను అని తెలియజేయడానికి సంతోషిస్తున్నా” అని ట్వీట్ చేశారు. అంతకుముందే పవన్ కల్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ సీటు నుంచి వైసీపీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబాబునే పోటీకి నిలబెడుతున్నారు. వైసీపీ ఒంటరిపోరు చేస్తుండగా ప్రత్యర్థి టీడీపీ.. జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది. 2014లో ప్రారంభమైన జనసేన ఈవేళ పదో వార్షికోత్సవాన్ని జరుపుకుంది. సరిగ్గా ఈ సమయంలోనే వర్మ ప్రకటన కూడా వచ్చింది. రాష్ట్ర అసెంబ్లీకి ఉన్న 175 సీట్లలో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండింటా ఓడిపోయారు. ఇప్పుడు ఒక్క సీటు నుంచే పోటీకి తయారయ్యారు. ఈసారి ఏమవుతుందో చూడాలి మరి.