ముగిసిన రామోజీ రావు అంత్యక్రియలు.. పాడె మోసిన చంద్రబాబు
x

ముగిసిన రామోజీ రావు అంత్యక్రియలు.. పాడె మోసిన చంద్రబాబు

రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణంపై ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పూర్తి చేశారు. రామోజీ రావు అంతిమయాత్ర ఆయన ముందే నిర్మించుకున్న స్మారక కట్టడం వరకు సాగింది. ఆయనకకు కడసారి వీడ్కోలు పలకడానికి పలు పార్టీల నేతలు, అధినేతలు, రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు, భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రామోజీ పార్దీవ దేహం వద్ద ఆయన కుటుంబీకులు, అభిలాషులు కన్నీరు మున్నీరయ్యారు. అంతిమ యాత్ర వాహనంపై కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరి సహా ఇతర కుటుంబీకులు కూడా ఉన్నారు.

హాజరైన ప్రముఖులు

రామోజీరావు అంతిమ యాత్రకు పార్టీలకు, రాజకీయాలకు, సిద్ధాంతాలకు అతీతంగా అంతా ఏకమైన వచ్చారు. ఆయనకు కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు. ఆయన ఇకలేరన్న విషయాన్ని తాము ఇప్పటికీ జీర్ణించుకోలేకున్నామంటూ కంటతడి పెట్టుకున్నారు. ఆయన అంతిమయాత్రకు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ కూడా హాజరయ్యారు. అంతేకాకుండా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కతో పాటు బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్, రఘురామకృష్ణరాజు, అరిమిల్లి రాధాకృష్ణ, వెనిగండ్ల రాము సహా మరికొందరు కూడా హాజరయ్యారు. వీరితో పాటు నారా వారి కుటుంబమంతా పాల్గొంది. చంద్రబాబు, నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి పాల్గొన్నారు.

పాడే మొసిన చంద్రబాబు

రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. అక్షరయోధుడి పాడెను మోశారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి మొదలైన అంతిమయాత్ర రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయమీదుగా సాగి స్మారక కట్టడం వద్దకు చేరింది. స్మృతి వనం దగ్గర నివాళులు అర్పించిన అనంతరం చంద్రబాబు.. రామోజీ పాడెను మోశారు. కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కుటంబీకులను ఓదార్చారు.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

రామోజీ రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. అందులో భాగంగానే గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ చితికి ఆయన కుమారుడు సీహెచ్ కిరణ్ నిప్పంటించారు. రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది, అభిమానులంతా ‘జోహార్ రామోజీరావు’ అంటూ నినాదాలతో రామోజీ రావుకు కడసారి వీడ్కోలు పలికారు.

Read More
Next Story