రామోజీ రావు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
x

రామోజీ రావు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో..


ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మూడు రోజుల క్రితమే వైద్యులు ఆయనకు స్టంట్స్ వేశారు. అప్పటి నుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది.వెంటనే ఆయనకు ఆయనకు వెంటిలేటర్ అమర్చిన వైద్యులు ఆయన ఆరోగ్యంపై 24 గంటలు పర్యవేక్షణ ఉంచారు. కానీ లాభం లేకుండా పోయింది. శనివారం తెల్లవారుజాము 4:50 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు.

ప్రముఖుల సంతాపం

ఆయన మరణంపై పట్ల దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. రామోజీరావు మరణం పట్ల ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘‘మీడియా, వినోద రంగంలో రామోజీ నిష్ణాతులు. జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారు. జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలందించినందుకు గాను శ్రీరామోజీరావును పద్మవిభూషణ్‌తో సత్కరించింది భారతదేశ ప్రభుత్వం. ఆయన కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని అబ్దుల్ నజీర్ సంతాపం తెలిపారు.

‘‘రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారు’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సంతాపం తెలిపారు.

ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు..హైదరాబాద్‌కు ప్రయాణం కావడానికి సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 12:30 గంటల కల్లా ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. ఫిల్మ్‌సిటీలో రామోజీ భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులు అర్పించనున్నారు. రామోజీ మరణంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశఆరు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన వ్యక్తి రామోజీరావు అని ఆయన విజయాలను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. ఆయన మరణం తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెప్పుకొచ్చారు.

‘‘రామోజీ అస్మయం మీడియా రంగానికి తీరని లోటు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు ఎంతో అమూల్యమైనవి. రామోజీ రావు మరణ వార్త ఎంతగానో కలచివేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషణ్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

‘‘రామోజీరావు వంటి దర్శకులు నూటికో కోటికో ఒకరు ఉంటారు. రామోజీ రావు భారతీయ సినీ దిగ్గజం, రామోజీరావు లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. ‘నిన్ను చూడాలని’తో నన్ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తి రామోజీరావు. అటువంటి మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. రామోజీరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్(ట్వీట్) చేశారు.

రామోజీరావు మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ‘‘వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా రామోజీరావు అందించిన సేవలు అమూల్యమైనవి. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని కేసీఆర్ ట్వీట్ చేశారు.

అసలెవరీ రామోజీ రావు..

1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈనాడుతో పాటు ‘సితార’ సినీ పత్రిక నడిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీని పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

Read More
Next Story