విశాఖలో  అంతరిస్తున్న మత్స్యాల మణిహారం
x

విశాఖలో అంతరిస్తున్న మత్స్యాల మణిహారం

కాలక్రమంలో అరుదైన మత్స్యజాతులు కనుమరుగతున్నాయి. వాటిని సంరక్షించాల్సిన, భావితరాలకు తెలియాల్సిన ఆవశ్యకతను ఎఫ్ఎస్ఎస్ఐ గుర్తించింది. అందుకోసం ఏం చేసిందంటే..


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

సముద్రంలో పాలిచ్చే ఆవులు.. పట్టుకుంటే ఫట్ మని షాక్ కొట్టే చేపలు.. సముద్రపు గుర్రాలు.. సముద్రపు దోసకాయలు.. పరపరా కోసేసే రంపపు చేపలు! అవును మీరు చదువుతున్నది నిజమే. ఇలాంటివి మన సముద్ర జలాల్లోనే ఉన్నాయంటే ఔరా? అనిపిస్తుంది. కానీ కాలక్రమంలో ఈ తరహా మత్స్యజాతులు కనుమరుగై పోతున్నాయి. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత, భావితరాలకు తెలియాల్సిన ఆవశ్యకతను ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఐ) గుర్తించింది. అంతరించి పోతున్న, అత్యంత అరుదైన విభిన్న రకాల చేపలను సేకరించి వాటిని ఓ మ్యూజియంలో భద్రపరచింది. దేశంలో మరెక్కడా లేని విధంగా విశాఖ సాగరతీరంలోని ఎఫ్ఎస్ఐ కార్యాలయంలో దీనిని ఏర్పాటు చేసింది. అంతేకాదు.. విద్యార్థులకు ఉపయోగపడేలా సరికొత్తగా క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు ఎఫ్ఎస్ఐ శాస్త్రవేత్తలు!

మనం ఎప్పుడూ చూడని, చూడలేని మత్స్యజాతులు ఈ మెరైన్ మ్యూజియంలో దర్శనమిస్తాయి. సుమారు 250కి పైగా విభిన్న జాతుల చేపలు అక్కడ నిక్షిప్తమయ్యాయి. వీటిలో క్షీరద జాతికి చెందిన సముద్రపు ఆవు (సీ కౌ)ది ఓ ప్రత్యేకత. ఇది శాఖాహారి. సముద్రంలో పెరిగే గడ్డిని తిని 70 ఏళ్ల పాటు జీవిస్తుంది. 230 నుంచి 400 కిలోల బరువు, 2.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ సముద్రపు ఆవులు తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్, గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ సముద్రాల్లో దాదాపు 300 వరకు ఉన్నట్టు గుర్తించారు.

400 మిలియన్ల ఏళ్లుగా రూపు మారని పీత..

మరో ప్రత్యేకత ఉన్న మత్స్యజాతి లివింగ్ ఫాసిల్. దీనిని గుర్రపు డెక్క పీతగా పిలుస్తారు. 400 మిలియన్ల ఏళ్ల క్రితం తన ఆకారం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే దీని విశిష్టత. దీని రక్తం నీలిరంగులో ఉండడం మరే ప్రత్యేకత. ఒడిశాలోని పరదీప్, పశ్చిమ బెంగాల్లోని దిఘా సముద్ర జలాల్లో మాత్రమే ఈ పీత ఉనికి ఉంది. ఈ పీత రక్తం క్యాన్సర్ మందుల్లో వినియోగించడం వల్ల దీనికి ఎంతో డిమాండ్ ఉంది. అయితే అంతరించిపోతున్న మత్స్యజాతుల్లో ఇది కూడా ఉంది.

ఔషధ గుణాల దోస చేప..

మరో అంతరించిపోతున్న చేప సీ కుకుంబర్. దీనిని సముద్రపు దోస చేపగా పిలుస్తారు. దీనిలోనూ ఔషధ గుణాలు పుష్కలం. కొంతమంది వీటిని ఇష్టంగా తింటారు కూడా. ఇవి ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో అక్కడక్కడ కనిపిస్తున్నాయి.

ప్రమాదకర రంపపు చేప..

సా ఫిష్ పిలిచే రంపపు చేప కూడా అంతరించి పోతున్న మత్స్య జాతిలో ఉంది. మూతి భాగం రంపాన్ని పోలి ఉంటూ పదునైన పళ్లను కలిగి ఉంటుంది. ఇది శత్రువుల నుంచి రక్షించుకోవడానికి తన రంపాలను వాడుకుంటుంది. వీటి బారిన పడితే ప్రాణాంతకమే. ఈ ఫిష్ బంగాళాఖాతంలో సంచరిస్తుంది.

పట్టుకుంటే కరెంట్ షాకే..

ఇక పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే చేపలు కూడా ఉన్నాయి. వీటిని టార్పెడో (ఎలక్ట్రిక్ రే)లు అంటారు. వీటికి 6-12 వోల్టుల విద్యుత్ ప్రవహిస్తుంది. అందువల్ల ఎవరైనా ముట్టుకుంటే దిమ్మదిరిగేలా షాక్ కొడతాయి. వీటిని ఎవరూ తినరు. ఇవి విశాఖ పరిసరాలతో పాటు బంగాళాఖాతంలోను సంచరిస్తున్నాయి. అయితే వీటిని అత్యంత అరుదైన జాబితాలో చేర్చారు.

సంథింగ్ స్పెషల్ క్రొకడైల్ షార్క్..

మొసలిని పోలిన సొర చేప కూడా అరుదైన జాతిలో చేరింది. ఇది తూర్పు తీరంలో అరుదుగా కనిపిస్తుంది. వీటికుండే ఫిన్స్ (రెక్కలు) లో ఔషధ గుణాలు పుష్కలం. వీటితో శస్త్రచికిత్సలకు వేసే కుట్లు (సూచర్స్) తయారు చేస్తారు. విదేశాల్లో ఈ ఫిన్స్ సూప్నకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక బౌల్ సూప్ ఖరీదు 100 డాలర్ల వరకు ఉంటుంది. ఇంకా ఔషధ గుణాలు మెండుగా ఉండే మత్స్య జాతులను కూడా ఈ మ్యూజియంలో ఉంచారు. వాటిలో వెన్నెముక నొప్పిని తగ్గించే బ్లాక్ ఈల్ ఫిష్తోతో పాటు సాలీడు ఆకారంలో ఉండే స్పైడర్ క్రాబ్ (పీత), సముద్రపు పాము (సీ స్నేక్), పుష్పాన్ని పోలివుండే పఫర్ చేప, యాపిల్ మాదిరిగా ఉండే యాపిల్ ఫిష్, సీ హార్స్ (సముద్రపు గుర్రం), కింగ్ క్రాబ్, బర్రా కుడా వంటి ఎన్నో అరుదైన మత్స్యజాతులున్నాయి. వీటిలో సీ కౌ, సాఫిష్ వంటి వాటిని వేటాడడం 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం షెడ్యూల్ -1 కింద నేరం. 'అరుదైన, అంతరించిపోతున్న సుమారు 250కి పైగా సముద్ర మత్స్య జాతులను భావితరాల కోసం విశాఖ మెరైన్ మ్యూజియంలో ఉంచాం.

అందుబాటులోకి క్యూఆర్ కోడ్..

ఈ మ్యూజియంలో ఉంచిన మత్స్య జాతుల చరిత్రను తెలుసుకునేందుకు వీలుగా ఇటీవల క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సంబంధిత చేపకు అమర్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చేప గురించిన సమస్త సమాచారం డిస్ప్లే అవుతుంది. భావితరాలకు ఇలాంటి అరుదైన, అంతరించిపోతున్న చేపల గురించి తెలుసుకునేందుకు ఈ సదుపాయాన్ని కల్పించారు. 'ఈ మ్యూజియానికి ఈ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్కూలు, కాలేజీ, విశ్వవిద్యాలయాల విద్యార్థినీ విద్యార్థులు వస్తుంటారు. వారికి ఇక్కడ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తాం. ఈ మత్స్య జాతులను ఫార్మాలిన్లో ఉంచి భద్రపరుస్తాం..' అని ఎఫ్ఎస్ఐ జూనియర్ ఫిషరీస్ సైంటిస్ట్ గుమ్మడి వేంకట అంకినీడు ప్రసాద్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు'కు చెప్పారు.

Read More
Next Story