ఎపిలో రేషన్‌ కార్డుల రంగు మారనుంది. త్వరలో అందరికీ పాత కార్డులు మార్చి కొత్త కార్డులు ఇస్తారు. కొత్తగా పెళ్లైన జంటలు దరఖాస్తు చేసుకుంటే కొత్త కార్డులు ఇస్తారు.


ఏపీలో రేషన్‌ కార్డుల రంగు మారనుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ కొత్త కార్డుల ప్రింటింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు రకాల డిజైన్లు తయారయ్యాయి. ప్రభుత్వం వాటిని పరిశీలించి ఒక డిజైన్‌ను ఎంపిక చేసి ప్రింటింగ్‌కు ఇచ్చినట్లు సివిల్‌ సప్లైస్‌ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ కార్డు రంగు, రూపు ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే కార్డు నమూనాను కూడా ఇంతవరకు ప్రభుత్వం బయట పెట్టలేదు. అందువల్ల దీనిలో ఏదో ఒక మతలబు ఉంటుందనే చర్చ రేషన్‌ కార్డు దారుల్లో ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,48,43,671 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో 89 లక్షల రేషన్‌ కార్డులకు ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందిస్తోంది. మిగిలిన 59,43,671 కార్డులకు రేషన్‌ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ కార్డులకు కూడా కేంద్రం రేషన్‌ ఇవ్వాలని రాష్ట్రం కోరింది. అయితే కేంద్రం స్పందించలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రేషన్‌ బియ్యం కిలో మూడు రూపాయలకు అందిస్తుంటే ఏపీలో మాత్రం ఒక్క రూపాయికే కిలో బియ్యం ప్రభుత్వం అందిస్తోంది. అంటే కేంద్రం ఇచ్చే బియ్యానికి కిలోకు రూ. 2లు రాష్ట్రమే భరించాల్సి వస్తోంది. ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి ఏపీ సివిల్‌ సప్లైస్‌లో ఉండటం విశేషం. ప్రస్తుతం కేంద్రం నుంచి రాష్ట్రానికి సివిల్‌ సప్లైస్‌ కింద వస్తున్న బియ్య 1.34 కోట్ల టన్నులు ఉన్నాయి.
కొత్తగా పెళ్లైన జంటలకు ప్రత్యేకంగా కార్డు
కొత్తగా పెళ్లైన జంటలు కార్డుకోసం దరఖాస్తు చేసుకుంటే వారికి కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పెళ్లయి తల్లిదండ్రుల కార్డులో పేర్లు ఉన్న వారు కూడా కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పెళ్లి అయిందని నిర్థారించేందుకు సర్టిఫికెట్‌ కావాలని ప్రభుత్వం కోరింది. ఈ ఆదేశాల వల్ల రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి తమ పెళ్లి కార్డును, నోటరీ సర్టిఫికెట్‌ను సమర్పించి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్‌ కోసం ప్రభుత్వానికి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియని చాలా మంది కొత్త జంటలు రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. వారు ఒక్కొక్కరి వద్ద నుంచి ఆరు నుంచి ఏడు వేలు తీసుకుంటున్నారు. దీనిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
గతంలో ఇచ్చిన పింక్‌ కార్డును పునరుద్దరించాలి
గతంలో ప్రభుత్వం రెండు రకాల రేషన్‌ కార్డులు పేద, మధ్య తరగతి వారికి ఇచ్చింది. ఆదాయాన్ని విభజించి రెండు రకాల కార్డులు ఇచ్చింది. పింక్‌ కార్డు ఉన్న వారికి ఫైన్‌ క్వాలిటీ బియ్యం, కందిపప్పు, చక్కర, గోదుమలు వంటి సరుకులు మార్కెట్‌ ధరకంటే తక్కువ ధరకు మధ్య తరగతి వారికి ఇచ్చేంది. ఈ కార్డును అబౌవ్‌ పావర్టీలైన్‌ (ఎపిఎల్‌) కార్డు అనే వారు. వైట్‌ కార్డు బిలో పావర్టీలైన్‌ (బిపిఎల్‌) వారికి ఇచ్చారు. ప్రస్తుతం సంక్షేమ పథకాల కోసం చాలా మందికి సివిల్‌ సప్లైస్‌ సరుకులు అవసరం లేకపోయినా కార్డును ఎలాగోలా సంపాదిస్తున్నారు. దీని వల్ల కూడా ప్రభుత్వంపై అధిక భారం పడిందని చెప్పొచ్చు. కార్డుల విభజన జరిగితే సుమారు 40 లక్షల కార్డులు ఏపీఎల్‌ కిందకు మారే అవకాశం ఉంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫొటోలతో రైస్‌ కార్డు పేరు పెట్టి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రంగుతో ముద్రించారు. ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌ కార్డుల స్థానంలో కొత్త కార్డులు జారీ చేయనున్నారు. ఈ కార్డుల్లో లైట్‌ ఎల్లో రంగు వేసి కార్డుపై ప్రభుత్వ రాజముద్రను వేసి కార్డు దారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు డిజైన్‌ కూడా పూర్తయి ప్రింటింగ్‌కు వెళ్లినందున మరో విధమైన మార్పుకు ఎవ్వరూ సూచనలు చేసే అవకాశం కూడా లేదు.
సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డును ప్రమాణికంగా తీసుకోవడాన్ని ఆపాలి
సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డు ఉంటే దానిని ఇన్‌కం సర్టిఫికెట్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం చెప్పడంతో కోటిన్నర మంది సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు తహశీల్దార్‌ నుంచి ఇన్‌కం సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే సరిపోతుందని చెబితే రేషన్‌ కార్డుల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని సివిల్‌ సప్లైస్‌ రంగంలో నిపుణులైన వ్యక్తులు చెబుతున్నారు. ఈ విషయమై రేషన్‌ డీలర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు లీలా మాధవరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంపై ఏదైనా ఆధారపడి ఉంటుందన్నారు.
రేషన్‌ వాహనాలకు స్వస్తి
ప్రస్తుతం ఇంటింటికి తిరిగి రేషన్‌ పంపిణీ చేస్తున్న వాహనాలను రద్దు చేస్తున్నట్లు మంత్రి మనోహర్‌ చెప్పారు. ఈ విషయం పలు సార్లు ముఖ్యమంత్రి కూడా చెప్పడం విశేషం. ఈ వాహనం దారులు 15 రోజులు రేషన్‌ ఇచ్చి, మిగిలిన 15 రోజులు ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌కు వాహనాలను వాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వాహనాలను రద్దు చేసి రేషన్‌ షాపుల్లోనే కార్డు దారులు రేషన్‌ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
Next Story