రాయలసీమ రైతు కోసం ‘వేమన’ను సృష్టించిన శాస్త్రవేత్త మృతి
x

రాయలసీమ రైతు కోసం ‘వేమన’ను సృష్టించిన శాస్త్రవేత్త మృతి

భౌతిక కాయం మట్టిలో కలసిపోవడం,కాలిబూడిదై పోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఆయన కోరిక మేరకు భౌతిక కాయాన్ని వైద్య కళాశాలకు అప్పగించారున.


ఆంధ్రప్రదేశ్, కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో పనిచేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పూడూరు నరసింహారెడ్డి(86) ఆదివారం (22-9-2024 ) తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రొద్దుటూరు లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు.

కరువుల బారిన పడే రాయలసీమ రైతులకోసం మేలురకం వేరుశనగ రకాలను సృష్టించిన శాస్త్రవేత్తగా ఆయనకు పేరుంది. ఆయన పరిశధన రైతుబాగోగుల చుట్టూ తిరిగింది. పరిశోధన ఫలాలను కళ్లెదుట కనిపించేందుకు ఆయన నిరంతరం కృషి చేశారు. పరిశోధనకు, ప్రజలకు అంకితమయిన అరుదైన మేధావి డాక్టర పూడూరు. చనిపోయాక కూడా మనిషి శరీరం మట్టిలో కలవడమో,కాలిబూడిదై పోవడంమో ఆయన ఇష్టం లేదు. అందుకే తన శరీరం కూడా శాస్త్ర అధ్యయానికి ఉపయోగపడాలనుకున్నారు.వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం తన పార్థివ దేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించాలని కోరారు. నిన్న ఆయన కోరిక నెరవేరుస్తూ ఆయన భౌతిక కాయాన్ని కడప ప్రభుత్వ వైద్యకళాాశాల (రిమ్స్ )కు అప్పగించారు.




కడప జిల్లా రాజుపాలెం మండలం వెంగలాయపల్లెలో 15-1-1939 లో డాక్టర్ రెడ్డి జన్మించారు.ఎరికలరెడ్డి, ఓబుళమ్మ వీరి తల్లిదండ్రులు. ప్రాథమిక విద్య స్వగ్రామం లోను 6వతరగతి నుంచి 11వతరగతి వరకు కర్నూలు జిల్లా చాగలమర్రి లో ఇంటర్ ఆర్ట్స్ కాలేజి కడపలో బియస్సీ అగ్రికల్చర్ బాపట్లలో చదివారు.1961లో బియస్సీ పూర్తికాగానే లీలావతి ని వివాహం చేసుకొన్నారు.28-7-1961లో ఆయిల్ సీడ్స్ అసిస్టెంట్ గా ప్రొద్దుటూరు లో మెట్టమొదట ఉద్యోగం లో చేరారు. జమ్మలమడుగు లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా , తిరుపతి అగ్రికల్చరల్ యూనివర్సిటీ లోబాటనీ టెక్నికల్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేశారు. 1970లో హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పట్టా పొందారు.1983 లో అదే యూనివర్సిటీ నుంచి పిహెచ్డి డాక్టరేట్ పొందారు. 1983లో డాక్టరేట్ పొందిన తర్వాత తిరుపతి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యారు.

1987 లో కదిరి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నందు బ్రీడర్ గా జాయిన్ అయ్యారు. వీరి ఆధ్వర్యంలో 1993 లో కదిరి అగ్రికల్చర్ స్టేషన్ నందు 3xమరియు JL24 రకాలను సంకరపరచి వేమన అనే కొత్త రకం వేరుశనగ వంగడం రూపొందించి విడుదల చేశారు. 1995లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు రీసెర్చ్ స్టేషన్ హెడ్ గా పదవొన్నతి పొందారు . వీరి ఆధ్వర్యంలో కదిరి 4 అనే మరో కొత్త రకం వేరుశనగ వంగడాన్ని రూపొందించి విడుదల చేశారు. 31-1-1999 లో కదిరి అగ్రికల్చర్ రిసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా పదవీ విరమణ చేశారు.

కదిరి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అభివృద్ధి కోసం వీరు విశేషంగా కృషి చేశారు. నీతి నిజాయితీగా నిబద్ధతతో తన ఉద్యోగ జీవితాన్ని గడిపారు. పదవి విరమణ అనంతరం మీరు ప్రొద్దుటూరులో నివసిస్తుండేవారు.ఆయన బ్రతికుండగానే మరణానంతరం తన శరీరాన్ని వైద్య కళాశాలకు దానం చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. 2024 సెప్టెంబర్ 22 న సాయంత్రం ఐదు గంటలకు నరసింహారెడ్డి పార్ధీవ దేహాన్ని రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల కడపకు ఆయన భార్య లీలావతి అనుమతితో అప్పగించారు.

-చందమూరు నరసింహారెడ్డి


Read More
Next Story