మునెయ్యా.. మళ్లీ.. పుడతావా..!
x

మునెయ్యా.. మళ్లీ.. పుడతావా..!

కళలకు, కళాకారులకు పుట్టుకే ఉంటుంది.. మరణం ఉండదు. ఆ కోవలోని వ్యక్తి జానపదబ్రహ్మ ప్రొద్దుటూరు మునెయ్య కూడా. ఆయన మళ్లీ పుట్టాలని సహచర కళాకారులు అభిప్రాయపడ్డారు.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: "కళ.. కళ కోసమే కాదు.. కళ ప్రజల కోసం" ఈ మాటలను ప్రజా కళాకారులు అక్షరసత్యం చేస్తారు. జీవనం, పల్లె పదాలు, మాటలను బాణీగా స్వరార్చన చేసిన జానపదబ్రహ్మ కలిమిశెట్టి మునెయ్య కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే. వామపక్షాల్లో పనిచేయలేదు కానీ ఆ భావాలు కలిగిన మునెయ్యకు పల్లె మట్టి వాసన అంటే మహా ఇష్టం. అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా మేడే ఉత్సవంలో పాటలు పాడడానికి వెళుతూ మునెయ్య, ఆయన సహచరులు ఐదుగురు రోడ్డు ప్రమాదంలో అసువులు బాశారు.

‘‘రాయలసీమ యాస, భాష కాస్త మోటుగా ఉంటుంది. ఆ భాషలో బూతులు కూడా ధ్వనిస్తాయి. ఈ ప్రాంత వ్యవహారిక భాషలో అది సర్వసాధారణంగా ఉంటుంది. ఆ మాటలు సంభాషణలను సరళం చేయడంలో మునెయ్య దిట్ట. ఆ పల్లె పదాలను పాటలుగా మార్చి జానపద సాహిత్యాన్ని ఆకాశపు అంచుల వరకు తీసుకువెళ్లిన ఘనత ఆయనకే సొంతం’’ అని ఆయన సమకాలీకులు, జానపద గీతాలు వేదికలను పంచుకున్న సహచర కళాకారులు చెప్పే మాట.

"జానపద బ్రహ్మ రాయలసీమ పల్లె పదాలను విస్తృతం చేసిన ఘనత మునెయ్యది. ఆయన స్ఫూర్తితోనే నేను కూడా పాటలు రాశాను, పాడాను" అని మునెయ్య సహచర పాటగాడు ప్రొద్దుటూరుకు చెందిన కంభం పాములేటి తన భావాలను ఫెడరల్ ప్రతినిధితో పంచుకున్నారు.

"మునెయ్య.. మళ్లీ ప్రొద్దుటూరులోనే పుట్టాలని కోరుకుంటున్నా.. ఇది అత్యాశ కాదు. రాయలసీమ పల్లెల గొప్పదనం మరింత విస్తృతం కావాలనేది నా ఆశ, శ్వాస. కడప ప్రాంత మాండలిక భాషను పదాలను ఆహ్వానంగా మలిచి, పాట రాసి,పాడిన తీరు మునెయ్యకు మాత్రమే సొంతం" అని చెబుతూనే, మునెయ్య పాట రూపంలో జీవించే ఉన్నారని వ్యాఖ్యానించారు కంభం పాములేటి. కళాకారులకు సమాజ హితం తప్ప, మరో ధ్యాస ఉండదనేది కూడా పాములేటి నిజం చేశారు.

వీరి బృందంలోని ఓ మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా తెలిసిన విషయం... పాములేటి కుమారుడు శనివారం తుది శ్వాస విడిచారు. తన సంస్థ ద్వారా కళాకారులను సత్కరించాల్సిన పనిలో ఉన్నారు. కొడుకు చనిపోయాడని సమాచారం అందినా దుఃఖాన్ని గొంతు దాటి రానివ్వకుండా అవార్డుల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సమయంలో మాట్లాడటం, సముచితం కాదేమో అనే సందేహంతో ఫెడరల్ ప్రతినిధి ఫోన్ చేస్తే, నిబ్బరంగా ఆయన మునెయ్యతో ఉన్న సాన్నిహిత్యం వివరిస్తూనే రెండు పాటలు కూడా పాడి వినిపించారు. కళాకారులకు సమాజ హితం మినహా వ్యక్తి స్వార్థం ఉండదు అనడానికి ఇదొక మచ్చుతునక.

అసలు ఎవరు ఈ మునెయ్య...

ఆంధ్రప్రదేశ్‌లో జానపద బ్రహ్మగా పేరుపొందిన కలిమిశెట్టి మునెయ్య 1943లో కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా దొమ్మర నంద్యాలలో జన్మించారు. శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో ఆయన డ్రాయింగ్ టీచర్‌గా పనిచేశారు. మునెయ్యకు చిన్నతనం నుంచి కలిమిశెట్టి చౌడప్ప శిష్యరికంలో యక్షగానం, కోలాటం, పండరి భజన, చెక్కభజన వంటి కళారూపాలను 10వ ఏటనే సాధన చేసినట్లు ఆయనను దగ్గరగా చూసినవారు చెబుతారు.

ఆ స్ఫూర్తితో పల్లెల్లో వ్యవహారికంగా మాట్లాడుకునే మాటలను, సంభాషణలు, వాతావరణాన్ని శరణం చేసి పాడిన పాటలు ఆయన కళా తత్వానికి అద్దం పడతాయి. హాస్యకారి అయిన మునెయ్య తన పల్లె పదాల రచనల్లో దారిద్రం, ఆకలి, వెట్టిచాకిరి, అస్పృశ్యత, అణగారిన వర్గాలను మేలుకొలిపే విధంగా సమాజంలో జరుగుతున్న సంఘటనను తన బాణీ ద్వారా స్వరంలో వినిపించిన పాటలు రాయలసీమ ప్రాంత ప్రజల మనసుల్లో ఇంకా మెదలాడుతూనే ఉన్నాయి.

" నాంచారి నాగుల నాగమ్మ.. నాడెంపు నడుము దాన చిన్నమ్మ.."

"కోడి పిల్లో.. అబ్బో కోడి పిల్ల.."

"కోడి కోయంగానే... కోడి కూత మానేసి.. కైలాసం నేను పోతానంటదే.. " ఇలాంటి పాటలు మైమరిపిస్తాయి..

"చీరలు వచ్చినాయి మామ గట్టు మీదికి.. మంచి చీరలు వచ్చినాయి మామ గట్టు మీదికి..’’

" కోడిబాయే లచ్చమ్మది కోడిపుంజుబాయ్ లచ్చమ్మది..

" ఎల్లోస్తా జానకి నేను కోడి పందెము.. పోయొస్తా నేను జానకి కోడి పందెము..’’

ఇవి మునయ్య కలం నుంచి జాలువారి గొంతు నుంచి వినిపించిన ఆహ్లాదకరమైన జానపద గీతాలు.. 1956లో జమ్మలమడుగును మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సందర్శించినప్పుడు మునెయ్య పాటలను విని పరవశించారు. చారిత్రక సత్యాలు ప్రతిబింబించే బుడ్డా వెంగళరెడ్డి, గురిగింజ గుమ్మడి, కోడి పిల్ల, కోడిబాయ లచ్చమ్మది, యాప మానెక్కినావు, తేలు కుట్టిందే పిన్ని, నాంచారి, ఆ మాట, కోల్ కోల్ వంటి హాస్య గీతాలు మునెయ్య వినిపించినప్పుడు శ్రోతల మదిలో గిలిగింతలు కలిగిస్తాయి. కవులకు, కళాకారులకు, సమాజం కోసం పనిచేసిన వారికి మరణం ఉండదు. శాశ్వత విశ్రాంతి తీసుకున్న వారు ప్రజల మనసుల్లో జీవించే ఉంటారు.

1997లో ఏమైంది..!

అది 1997వ సంవత్సరం మే ఒకటో తేదీ. కార్మిక దినోత్సవం కావడంతో కార్మికులను ఎంచడానికి రావాలంటే ఆహ్వానం అందింది. మంత్రాలయంలోని ఇండియన్ టొబాకో కంపెనీ (ఐ టి సి) ప్రతినిధుల ఆహ్వానం మేరకు 20 మందితో కూడిన బృందం ప్రొద్దుటూరు, కడప నుంచి బయలుదేరింది. కమాండర్ జీపులో మునెయ్యతో పాటు 9 మంది ఉన్నారు. కోడుమూరు సమీపంలో ఆగి ఉన్న లారీని జీపు ఢీకొనడంతో మునెయ్యతోపాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో జానపద బ్రహ్మ మునెయ్య సహచర కళాకారులు సినిమా పాటలు ఆలపించే వారి స్వరాలు శాశ్వతంగా మూగబోయాయి.

"ఈ సంఘటన మమ్మల్ని తీవ్రంగా కలచి వేసింది" అని జానపద బ్రహ్మ ఉప్పులూరి మునయ్య పాటలకు సంగీతాన్ని అందించిన ప్రొద్దుటూరుకు చెందిన సి. ప్రతాప్ బాబు (ఆర్టిస్ట్ బాబు) ఫెడరల్ ప్రతినిధులతో ఆనాటి సంఘటన గురించి చెప్పి ఆవేదన చెందారు. "మునెయ్య బృందం ప్రయాణిస్తున్న జీపు వెనకనే మరో వ్యాన్లో ప్రయాణిస్తున్న మేము అంతా చూస్తూనే ఉన్నాం. ఆ దృశ్యం ఇంకా కళ్ళ ముందు నుంచి చెదిరిపోలేదు’’ ఒకింత జీరబోయిన స్వరంతో వ్యాఖ్యానించారు. " మునయ్య మా బృందంలోనే ఉండేవారు. కడపలోని సాంస్కృతిక సంస్థకు అందే ఆహ్వానాలను మునయ్య కోఆర్డినేట్ చేసేవారు" అని రిటైర్డ్ ఎస్సై సిరాజ్ తెలిపారు. మునయ్య జానపద గీతాలు, మేము సినిమా పాటలు పాడేవాళ్ళమని సిరాజ్ వివరించారు.

కలిమిశెట్టి మునెయ్య ప్రొద్దుటూరు పట్టణం వసంతపేటలో నివాసం ఉండేవారు. డ్రాయింగ్ టీచర్‌‌గా పనిచేస్తున్నప్పుడు ఉద్యోగం కోసం సమీప పల్లెలకు వెళ్లేవారు. అలా వెళ్ళేటప్పుడు కనిపించే సంఘటనలు, వినిపించే మాటలను పోగు చేసుకుని పాటలుగా రూపుదిద్ది వాటికి తన స్వరంతో ప్రాణం పోసేవారు. "జానపద రంజని, జానపద నవరత్నాలు, జానపద శృంగార రత్నాలు, జానపద ఆణిముత్యాలు" అనే పేరిట విడుదలైన క్యాసెట్లలో మునయ్య స్వరం వినిపిస్తుంది. ఆల్ ఇండియా రేడియోలో కూడా ఆయన పాటలు వినడానికి శ్రోతలు ఎక్కువగా ఇష్టపడేవారు.

అవును... మా నాన్న మొదటి శ్రోత

"జానపద గీతాలతో ప్రొద్దుటూరు గొప్ప చరిత్రలో నిలవడమే కాదు. రాయలసీమ ఆణిముత్యాల్లో మునెయ్య కూడా ఒకరు. రాయలసీమ యాస, భాషకు ఆయన పట్టం కట్టారు" అని ఆ ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ షేక్ మహబూబ్ బాషా.. ఫెడరల్ ప్రతినిధితో చెప్పారు.

"మునెయ్య పల్లెలకు వెళ్లి పదాలు సేకరించేవారు. వాటిని పాటగా కూర్చి, మొదట మా నాన్నకు వినిపించిన సంఘటనలు చాలా ఉన్నాయి" అని మహమూద్ బాషా తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. జానపద సాహిత్యంలో మునెయ్య లేని లోటు పూడ్చలేనిది అనడంలో సందేహం లేదని స్వతహాగా కవి, రచయిత అయిన మహమ్మద్ బాషా అంటున్నారు.

ఏమైంది సార్..

మా ఇంటికి సమీపంలోని ఓ రజకుని లాండ్రీ షాప్ వద్ద మునయ్య కోసం వాకపు చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా. లాండ్రీ షాపు అని చెప్పబడే ఓ రేకుల షెడ్డు కింద ఒక వ్యక్తి దుస్తులు ఇస్త్రీ చేస్తున్నారు. "ఓ.. సార్.. మా టీచర్ ముని సార్ గురించి మీరు ఎంక్వైరీ చేస్తా ఉండేది. అబ్బా.. మాది కూడా వీరప్పనాయన పల్లె సార్. కలిమిశెట్టి మునే సారు దగ్గర నేను విద్యార్థిని" అని అడిగిన వెంకటేష్ యాదృచ్ఛికంగా గుర్తుచేసుకున్నారు. ‘‘వీరపనాయనపల్లి మండలం పాలగిరి శ్రీ రామ సుబ్బన్న ప్రైవేట్ స్కూల్లో నేను విద్యార్థిని, మాకు మునయ్య సార్ డ్రాయింగ్ నేర్పించేవాడు. చాలా మంచోడు సార్. బొమ్మలు వేయడమే కాదు పాటలు కూడా సూపర్‌గా పాడతాడు. ఈరోజు ఆయన చనిపోయిన రోజా.. అబ్బా.. మునెయ్య సార్ దేవుడు కదా" అని వెంకటేష్ దండం పెట్టాడు.

అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులు. కళాకారులు తమ పాటలు ఆటలతో సమాజ చైతన్యానికి శ్రమిస్తూ జీవితాలను ధారబోసిన వారందరో ఉన్నారు. ఆ కోవలోనే జానపదాన్ని తన జీవితంగా మలుచుకున్న మునెయ్య కూడా తన పాటలతో చైతన్యం చేశాడని చెప్పవచ్చు. కార్మికుల హక్కులను సాధించుకున్న రోజు జరుపుకునే మేడే నాడే.. ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్తూ ఆయన సహచర బృందంలోని ఆరుగురు ఇదే రోజు ప్రాణాలు కోల్పోయారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కూడా ఆయన సహచరులు ప్రార్థించారు.

Read More
Next Story