
Source: Twitter
మా ఓట్లు.. మా సీట్లు.. మాకే కావాలంటున్న బలిజ నేతలు
రాయలసీమలో మా ఓటర్లు ఎక్కువగా ఉన్న సీట్లు తమ వర్గానికి కేటాయించాలని బలిజ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మా ఓట్లు.. మా సీట్లు.. మాకే కావాలంటున్నారు.
ఎస్. ఎస్.వి. భాస్కర్ రావ్ - తిరుపతి
ప్రతి సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాలని, పదవులు అనుభవించాలని కలలు కంటుంది. అందుకు ఐక్యత, చొరవ తో పాటు ఆర్థిక వనరులు అవసరం. ఈ మూడు అంశాలను అలుసుగా తీసుకుని ప్రభుత్వాలు పార్టీలు తాత్కాలిక పథకాలతో సాంత్వన కలిగిస్తున్నాయి. ఈ తీరును ఇక ఎంత మాత్రం సహించబోమని బలిజ సామాజిక వర్గం ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టిలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఉన్నాయి. రాజకీయంగా కూడా వారికి వారి సీట్లు కేటాయిస్తున్నారు. మమ్మల్ని ఓటర్లగానే చూస్తారా? ప్రజా ప్రతినిధులుగా పనికిరామా? అని బలిజ సామాజిక వర్గం నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
త్వరలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్నది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ సిపి, తెలుగుదేశం పార్టీలు విడుదల చేసిన మొదటి జాబితాలో ఒక్క సీటు కూడా బలిజల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయం పాటించడంలో అధికార, విపక్ష పార్టీలు తమను నిర్లక్ష్యం చేస్తున్నాయని బలిజ సామాజిక వర్గం నేతలు రుసరసలాడుతున్నారు.
" గెలవని సీట్లను మాత్రమే కొన్ని రాజకీయ పార్టీలు బలిజలకు కేటాయిస్తున్నాయి. గతాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది" అని మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ ఉదహరించారు. రాయలసీమలో 10 నుంచి 12 శాతం ఉండే కాపు సామాజికవర్గానికి ఐదు నుంచి ఆరు సీట్లు కచ్చితంగా ఇవ్వాలి. జనసేన పార్టీ వచ్చాక కాపులను వైఎస్ఆర్సిపి, టిడిపి నిర్లక్ష్యం చేస్తున్నాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో గెలవలేమనే సీట్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. 1985లో నగరిలో రాధాకృష్ణ, అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు స్థానంలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గంలో కొందరు సరిగా సహకరించక బలిజ సామాజిక వర్గం నేతలు ఓడిన తీరును ఆయన గుర్తు చేశారు.
ఓట్లు మావి... సీట్లు మీవా..
ఆంధ్రప్రదేశ్ లో కోటికి పైగా ఓట్లు ఉన్న కాపులకు ఉమ్మడి గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు,ప్రకాశం జిల్లాలలో 74 అసెంబ్లీ సీట్లు,11 పార్లమెంట్ సీట్లలో కాపు కులస్తులకు ఒక్క సీటు ఉంటే ఒక్క సీటు కూడా కూడా కేటాయించకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాయలసీమ నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కలిపి 74 అసెంబ్లీ స్థానాలు ఉంటే, చిత్తూరులో ఆరని శ్రీనివాసులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ , చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ గెలిచారు. 2024 లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలిజ సామాజిక వర్గానికి వైఎస్ఆర్సిపి, టిడిపి తమ మొదటి జాబితాలో ఒక సీటు కూడా కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 74 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారుగా 25 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓట్లు చూస్తే నియోజకవర్గానికి సుమారుగా 2.25 లక్షల నుంచి 2.50 లక్షల మంది ఓటర్లు ఉంటే... 20వేల నుంచి 40 వేల కాపు సామాజిక వర్గం ఉంటారనే విషయాన్ని విశ్లేషణతో గుర్తు చేస్తున్నారు.
దీనిపై బలిజ సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి నాగరాజు ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. " బలిజ సామాజిక వర్గంలో అనైక్యత ఆర్థిక బలాన్ని ఆసరాగా తీసుకొని తాత్కాలిక పథకాలతో ఉపశమనం కల్పిస్తున్నారు" . రాష్ట్రంలో బలిజ సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తామని టిడిపి అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పడంతో పాటు చేసేందుకు ప్రయత్నించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో.. "బలిజలకు రిజర్వేషన్ తన పరిధిలో లేదని అంటూ పంగనామాలు పీకారు" అని గోపిశెట్టి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. "ముస్లింలు అడగకుండానే ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారు. అందుకు మేము వ్యతిరేకం కాదు. మా పరిస్థితి ఏంటో తేల్చమని అడుగుతున్నాం" అని కూడా నాగరాజు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో 270 సంఘాలు
బలిజల అభ్యుదయం, సంక్షేమం కోసం పనిచేసే సంఘాలు రాష్ట్రంలో 2007 వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో మినహా గట్టిగా స్వరం వినిపించడంలో సఫలం కాలేకపోతున్నారు. ఆత్మీయ సమావేశాలు, వనభోజనాలకే పరిమితమైతే ఆర్థికంగా సామాజికంగా, రాజకీయంగా స్థిరత్వం సాధించలేరని ఓ నాయకుడు అన్నారు. 130 బీసీ ఉప కులాలు కలిపితే 30- 35 శాతం ఉన్నారు. 50 ఉపకులాలను కలిపితే ఎస్సీలు 17% ఉన్నారు. కేవలం కాపు బలిజకురాలు 17% ఉన్నారని విషయాన్ని ఆ నాయకుడు గుర్తు చేశారు. రాజ్యాధికారంలో వెనుకబడ్డానికి కారణం ఏంటో విశ్లేషించవలసిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
పార్టీల సహకారం అవసరం
రాయలసీమలోనే కాదు. రాష్ట్రంలో కూడా "కాపు బలిజ సామాజిక వర్గం బలంగానే ఉంది. ఆర్థిక స్థిరత్వం సాధించాల్సిన అవసరం ఉంది" కాపుల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీలు ప్రభుత్వాలు ఆ వర్గాలను రాజకీయంగా కూడా ఆదుకోవడానికి స్నేహస్తం అందించాలి" అని నెల్లూరు నగరానికి చెందిన కాపు సామాజిక వర్గం నేత కరణం భాస్కర్ కోరారు. ఓట్ల శాతం ఉంది. సమాజంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రజలతో మరింత మమేకం కావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. లేకుంటే ఎన్ని దశాబ్దాలు అయినా ఈ పరిస్థితి మారదు అనే అభిప్రాయం. ఇదిలా ఉండగా...
ఎన్నికల నోటిఫికేషన్ వెలవడానికి రోజులు సమీపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మరింత వేడెక్కింది. పొత్తులు, ఎత్తులు, వ్యూహాలతో సాగుతున్న నేతలు గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది తేలితేనే ఆ పార్టీల భవిష్యత్తు కూడా నిర్ధారణ అవుతుందని భావిస్తున్నారు.
Next Story