![అది బర్డ్ ఫ్లూనే.. కోళ్ల ఫారాలు జాగ్రత్త! అది బర్డ్ ఫ్లూనే.. కోళ్ల ఫారాలు జాగ్రత్త!](https://telangana.thefederal.com/h-upload/2025/02/11/511933-screenshot2025-02-1111242.webp)
poultry Farm at East Godavari district
అది బర్డ్ ఫ్లూనే.. కోళ్ల ఫారాలు జాగ్రత్త!
ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ కోళ్ల ఫారాలను హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ రాష్ట్రంలోని కోళ్ల ఫారాల యజమానులకు హెచ్చరిక జారీ చేసింది. అంతమాత్రాన కోడి మాంసాన్నీ, గుడ్లను తినకుండా ఉండాల్సిన అవసరమేమీ లేదని, బాగా ఉడికించి తినవచ్చునని ఆహార నిపుణులు చెబుతున్నారు.
![](https://telangana.thefederal.com/h-upload/2025/02/11/511937-screenshot2025-02-1111240.webp)
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్5ఎన్1 -బర్డ్ ఫ్లూ) వైరస్ కారణమని తేలింది. వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఐసీఏఆర్-ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపారు. అందులో పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని ఫారాల నుంచి పంపిన రెండు నమూనాలు పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో పశుసంవర్ధకశాఖ అధికారులు ఆ రెండు కోళ్ల ఫారాల్లో కోళ్లను పూడ్చిపెట్టడంతోపాటు.. కిలోమీటరు వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లోనూ వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. రెడ్‌జోన్‌లో 10 బృందాలు, సర్వేలెన్స్ జోన్‌లో 10 బృందాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఫారాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. కోళ్ల వ్యాధులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్లో ఉండే వైరస్.. వాటి రెట్టల ద్వారా జలాశయాల్లోకి చేరుతోంది. అక్కడ నుంచి నీరు, ఇతర మార్గాల్లో కోళ్లకు సంక్రమిస్తోంది. నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో కొన్నిచోట్ల వైరస్ ప్రభావం చూపింది. అక్కడ చనిపోయిన వాటిని పూడ్చిపెట్టకుండా.. బయటపడేయడంతోనే కోళ్లఫారాలకు చేరింది. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే ఈ వైరస్ జీవించలేదని. ప్రస్తుతం రాష్ట్రంలోని అధికశాతం ప్రాంతాల్లో 34 డిగ్రీల పైనే నమోదవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఉడికించిన మాంసం, గుడ్లు తినొచ్చు:
మాంసం, గుడ్లు తీసుకున్నా ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకలేదు. కోడిమాంసం, గుడ్లను మనం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం. అప్పుడు అందులో ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదు.
ఆ రెండు ఫారాల పరిధిలో రెడ్ అలర్ట్
బర్డ్ ఫ్లూగా తేలిన రెండు ఫారాల్లోని కోళ్లు, గుడ్లను పూడ్చిపెట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చాం. పూడ్చిపెట్టే ఒక్కో కోడికి రూ.90 చొప్పున పరిహారం అందిస్తాం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. రెండు ఫారాల చుట్టూ కిలోమీటరు పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించాం. అక్కడ మాత్రమే చికెన్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించాం. చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోనూ నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నాం. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఇబ్బంది లేదు అని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం, మిర్తిపాడులో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఒకేరోజు 8వేలుకు పైగా కోళ్లు చనిపోయాయి. మిర్తిపాడు గ్రామాన్ని అనుకుని ఉన్నా 2కిలోమీటర్లు ప్రాంతమంతా బఫర్ జోన్ గా కలెక్టర్ ప్రశాంతి ప్రకటించారు. సీతానగరం మండలంలో చికెన్ కు నో ఎంట్రీ అంటు అధికారులు ఏనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే కోరుకొండ, గోకవరం మండలాల్లో కోడి మాంసం అమ్మకాలు సజావుగానే సాగుతున్నాయి.
Next Story