ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ల విధానం అమల్లోకి వస్తుండటంతో ప్రజలు ఎగబడ్డారు.


ఆదాయమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం వచ్చిచేరింది. రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జనవరి నెలాఖరులో భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. రెండు రోజుల్లో దాదాపు రూ. 228 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు రిజిస్ట్రేష్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు అమల్లోకి వసాయని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఎన్నడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలన్నీ కిటకిటలాడాయి. ఎక్కడ చూసినా కిక్కిరిసి పోయాయి. దీంతో ఓవర్‌నైట్‌లోనే ప్రభుత్వ ఆదాయం పెరిగి పోయింది. వందల కోట్లల్లో ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చి చేరింది.
జనవరి ఆఖరి వారంలో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. గురు, శుక్రవారాల్లో అయితే ఆ సంఖ్య ఇంకా అధికమైంది. ఎప్పుడు అరాకొరాగా రిజిస్ట్రేషన్లు జరిగే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కూడా గత వారంలో వందల సంఖ్యకు రిజిస్ట్రేషన్‌ల సంఖ్య చేరుకుంది. గురువారం ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 14,250 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. గుంటూరు జిల్లాలో 1184,ఎన్టీఆర్‌ జిల్లాలో 946 రిజిస్ట్రేషన్‌లు జరగ్గా, పల్నాడు జిల్లాలో 944, విశాఖపట్నం జిల్లాలో 658 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కేవలం గురువారం, శుక్రవారం వారాల్లో జరిగిన రిజిస్ట్రేషన్‌ల ద్వారా ఏకంగా రూ. 228 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చి చేరింది.
అయితే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుండంతో జనాలు ఒక్క సారిగా రిజిస్ట్రేషన్‌ల కోసం ఎగబడ్డారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సర్వర్లపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రిజిస్ట్రేషన్లలో జాప్యం నెలకొంది. విజయవాడ నగరంలోని పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అయితే శుక్రవారం అర్థరాత్రి వరకు పని చేసింది. దాదాపు అర్థరాత్రి 11 గంటల వరకు సిబ్బంది రిజిస్ట్రేషన్‌లు చేస్తూనే ఉన్నారు. ఒక్క శుక్రవారం రోజే విజయవాడ పటమట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 217 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. గురువారం 146 రిజిస్ట్రేషన్లు జరిగాయి. జనాల రద్దీ పెరగడంతో ఈ కార్యాలయంలో సర్వర్లు మొరాయించాయి. దీంతో కొంత మేరకు జాప్యం నెలకొంది. అయినా రిజిస్ట్రేషన్‌లు భారీగానే జరిగాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ల చార్జీలు సగటున 20 శాతం పెరిగాయి. విజయవాడలో 3 శాతం నుంచి 9 శాతం చార్జీలు పెరగ్గా, విశాఖపట్నంలో కూడా పెరిగాయి.
Next Story