చంద్రబాబు గారు.. మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి. ప్రజల కోసం పని చేసే ఏసీబీని స్వేచ్చగా పనిచేసే ఆదేశాలు ఇవ్వండి.
విద్యుత్ కొనుగోళ్లపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా వినూత్న రీతిలో స్పందించారు. లోపల ఏసీపీని పెట్టి బంధించినట్టు ఉన్న పంజరంతో నిరసనలు తెలిపారు. అదానీ జగన్ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏసీబీని పంజరంలో బంధించింది. టీడీపీ బోను నుంచి ఏసీబీని విడుదల చేసి స్వేచ్చగా పనిచేసే ఆదేశాలు ఇవ్వండి. అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే, చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుంది. సోలార్ పవర్ డీల్‌లో జగన్ కి రూ.1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికా ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఆధారాలు కూడా బయట పెట్టింది. ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా ? అంటూ నిలదీశారు. 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ సోలార్ డీల్ పై హైకోర్టు లో పిటీషన్ కూడా వేసింది. ఇదొక కుంభకోణం అని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. అధికారం చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తున్నారు? జగన్ కి నష్టం లేదు..మీకు నష్టం లేదు. నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమే అని ధ్వజమెత్తారు. ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి రూ. 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు యూనిట్ ధర రూ. 1.99 పైసలకు తగ్గింది. సోలార్ పవర్ రేట్లు తగ్గుతుంటే.. మీరు ఎలా 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేశారు? అని నిలదీశారు. రూ.2.49 పైసలకు కొని రాష్ట్ర ప్రజలు నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు భారం మోపారని జగన్‌ను ప్రశ్నించారు.
చంద్రబాబును అడుగుతున్నాం. అదానీ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. అదానీ బీజేపీ మనిషి.. మోడీ మనిషి. బీజేపీతో మీకు అలయెన్స్ ఉంది. అందుకే మీరు అదానీకి, మోడీకి భయపడుతున్నారు. అదానీని కాపాడుతున్నారు. అని సీఎం చంద్రబాబును విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారు. జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా మోడీ నోరు విప్పడం లేదు. మొత్తం దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తే కానీ అవినీతి బయటకు రాలేదు. ఈ అవినీతి బయటపెట్టని సీబీఐ చేతకానిదా? మోడీ చేతకాని వారా? అని నిలదీశారు.
ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఈ ఒప్పందాలపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఏసీబీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ. కానీ రాష్ట్రంలో ఏసీబీని పంజరంలో లాగా టీడీపీ మార్చింది. చంద్రబాబు గారు.. మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి. ప్రజల కోసం పని చేసే ఏసీబీని స్వేచ్చగా పనిచేసే ఆదేశాలు ఇవ్వండి. ప్రజలు మిమల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి అని కోరారు.
Next Story