అటు వేంటేశ్వరుడి సుప్రభాతం... ఇటు మాస్టారు మార్క్సిస్టు పాఠాలు
x

అటు వేంటేశ్వరుడి సుప్రభాతం... ఇటు మాస్టారు మార్క్సిస్టు పాఠాలు

వేంకటేశ్వరుడి తిరుపతిలో మార్క్సిజం బోధించిన మ‌హోపాధ్యాయుడు త్రిపుర‌నేని మధుసూదన రావు 20 వ వర్ధంతి నేడు.



త్రిపుర‌నేని మ‌ధుసూద‌న‌రావు (జనవరి1,1937-అక్టోబర్ 8,2004) మన కాలానికి ఒక గొప్ప మేధావి. మార్క్సి జానికి ఒక భాష్య కారుడు. ఒక మ‌హావ‌క్త. ఒక పుస్త‌క పిపాసి. స‌మాజాన్ని, సాహిత్యాన్ని గ‌తితార్కిక భౌతిక‌వాద‌ దృష్టితో విశ్లేషించిన ప‌దునైన సాహిత్య విమ‌ర్శ‌కుడు.

ఆయ‌న విమర్శ‌ అయినా, ఉప‌న్యాస‌మైనా ముక్కుకు సూటిగా పోతుంది. ఏ వాద‌మైనా స‌రే, ఎదురుగా వ‌స్తే అడ్డంగా న‌రికేసేట‌ట్టే ఉంటుంది. ప‌క్క‌నొచ్చినా అంతే ! మహా మహా పండితులు అన్న పేరున్న వాళ్ళు కూడా ఆయన విమర్శ ముందు నిలబడ లేక పోయేవారు.

తిరుప‌తిలో అర్ధ శ‌తాబ్దం పైగా నివ‌సించినా, ఒక్క సారి కూడా తిరుమ‌ల ఆల‌యంలోకి వెళ్ళ‌ని అచ్చ‌మైన నాస్తికుడు. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన గ్రాంటు నుంచి జీతం తీసుకుంటున్నా, ఎప్పుడూ ఎన్నికల డ్యూటీ చేయ‌ని సిద్ధాంత నిబ‌ద్ధుడు. అనేక మంది క‌వుల‌ను, ర‌చ‌యిత‌ల‌ను త‌యారు చేసిన వ‌న్‌మాన్ వ‌ర్క్‌షాప్‌. త్రిపుర‌నేని మ‌ధుసూద‌న రావును స‌ర‌దాగా తిరుప‌తి మావో అనేవారు. కానీ అది అతిశయోక్తి. కాలేజీలోను, ఇంట్లోను, వీధుల్లోను నిత్యం జీవిత పాఠాలు చెప్పిన ఆయ‌న్ను తిరుప‌తి సోక్రటీస్ అన‌డ‌మే స‌బ‌బు.

మ‌ధుసూద‌న‌రావును తొలిసారిగా 1979 లో తిరుపతి లో జరిగిన చ‌లం సాహిత్య స‌భ లో చూశాను. ఆ స‌భ‌లో ఆయ‌న చ‌లం సాహిత్యాన్ని తూర్పార‌బ‌ట్టారు. చలం ధోరణి కి మార్క్సిజానికి పొత్తు పొసగదన్నారు. చ‌లం భావ ప్ర‌వాహంలో నేను ఓల‌లాడుతున్న కాలం అది. అందు చేత వెంట‌నే ఆయ‌న‌తో ప‌రిచ‌యం చేసుకోడానికి కాస్త వెన‌కాడాను. ఆయ‌న ఉప‌న్యాసం ఒక ప్ర‌వాహం. ఒక్క సారి ఆయ‌నతో మాట్లాడినా, ఆయ‌న ఉప‌న్యాసం విన్నా ఆ ప్ర‌భావం నుంచి బైట‌ప‌డ‌డం అంత తేలిక కాదు. మార్క్సిస్టు ప్రాపంచిక దృక్ప‌థంతో నిత్యం పాఠాలు చెప్పిన‌ మ‌హోపాధ్యాయుడు ఆయన.



రామ్‌న‌గ‌ర్‌లోని ఆయ‌న ఇంట్లో ఒక విశాల‌మైన చెక్క టేబుల్ ఉండేది. దాని ముందున్న‌ చెక్క కుర్చీని వ‌చ్చిన వారి వైపు తిప్పుకుని, ఆ కూర్చీ చేతిపైన రెండు కాళ్ళూ వేలాడేసుకుని గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడుతుండేవారు.ఆ మాటల్లో పడితే ఇంట్లోంచి ఆయ‌న స‌తీమ‌ణి ఇన్సులిన్ తీసుకున్నారని గుర్తు చేస్తే త‌ప్ప స‌మ‌యానికి భోజనం కూడా ఆయనకు గుర్తుండేది కాదు.ఆయ‌న వెన‌కాల అల‌మార్ల‌లో లెక్క‌నేన‌న్ని పుస్త‌కాలుండేవి. చ‌రిత్ర‌, సాహిత్యం, రాజ‌కీయాలు, ఆర్థిక‌, త‌త్వ‌శాస్త్ర విష‌యాలే చ‌ర్చ‌నీయాంశాలు. ఎప్పుడూ వ్య‌క్తిగ‌త విష‌యాలు ప్ర‌స్తావించేవారు కాదు.


తిరుప‌తి ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కాలేజీలో త్రిపుర‌నేని తెలుగు అధ్యాప‌కుడు. స‌హ‌జంగా డిగ్రీలో తెలుగు క్లాస్ అంటే చాలా మంది ఎగ్గొట్టేవారు. క్లాసులో త్రిపుర‌నేని పాఠం చెబుతున్నారంటే ఒక్క విద్యార్థి కూడా గైర్హాజ‌ర‌య్యేవాడు కాదు. ఇత‌ర క్లాసుల విద్యార్థులు కూడా కిటికీలోంచి, త‌లుపు ప‌క్క నుంచి ఆయ‌న పాఠాలు వినేవారు. సాహిత్యాన్ని ఆధునిక సామాజిక శాస్త్రాల‌తో అనుసంధానం చేసి పాఠాలు చెప్పేవారు.

సాయంత్ర‌మైతే చాలు, కాలేజీ అయిపోగానే కిట‌కిట‌లాడుతున్న గాంధీ రోడ్డులోకి రిక్షా లో వ‌చ్చేసేవారు. చాలా దూరం ఉండేది కనుక. గాంధీ రోడ్లో ని చిన్న డీల‌క్స్ హోటల్ త్రిపుర‌నేని మధుసూదనరావు ఆలోచ‌న‌ల బ‌ట్వాడాకు కార్య‌రంగం. త్రిపుర‌నేని అక్క‌డే రోడ్డులో నిల‌బ‌డి టీ తాగుతూ, జ‌ర్దా కిళ్ళీ న‌ములుతూ యువ‌కుల‌తో విద్యార్థుల‌తో గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడుతూనే ఉండేవారు.(సిగరెట్లు మానేసినా జర్దా కిళ్లీ అలవాటు పడ్డారు) ఏనాడూ వాటిలో ఊసుపోని మాట‌లు ఉండేవి కావు. అన్నీ విజ్ఞాన‌దాయ‌క‌మే. తిరుప‌తిలో ఒక త‌రాన్ని ప్ర‌భావితం చేసిన జ్ఞాని త్రిపుర‌నేని.

కృష్ణా జిల్లా, గుడివాడ‌కు చెందిన త్రిపుర‌నేని మ‌ధుసూద‌న రావు 1963లో తిరుప‌తి వ‌చ్చారు. వ‌స్తూ వ‌స్తూ నాస్తిక‌త్వాన్ని, హేతువాదాన్ని, మార్క్సిస్టు ఆలోచ‌నా విధానాన్ని వెంట‌బెట్టుకుని వ‌చ్చారు. టీటీడీకి చెందిన ఎస్వీ ఆర్ట్స్‌ క‌ళాశాల‌లో తెలుగు లెక్చ‌ర‌ర్‌గా ఆయ‌న‌కు ఇంట‌ర్వ్యూ వ‌చ్చింది. ‘విజిట్ సెవెన్ హిల్స్’ అని కాల్ లెట‌ర్‌లో ఉంది. '’నేను నాస్తికుణ్ణి. తిరుమ‌ల కొండ‌పైన అయితే నేను ఇంటర్వ్యూకు రాను’' అని స‌మాధానం ఇచ్చారు. త్రిపుర‌నేని కోసం తిరుప‌తిలోనే ఇంట‌ర్వ్యూపెట్టి లెక్చ‌ర‌ర్‌గా సెల‌క్ట్ చేశారు.

టీటీడీ క‌ళాశాల‌లో దాదాపు నాలుగు ద‌శాబ్దాల‌పాటు అధ్యాప‌కుడుగా ప‌నిచేశారు. అయినా ఆయన తిరుమ‌ల కొండ ఎక్క‌ద‌లుచుకోలేదు. టీటీడీ ఇచ్చే ప్ర‌సాదాన్నీ ఏనాడూ తీసుకోలేదు. ఆయ‌న కుమార్తె బీనాదేవి పెళ్ళి , పెళ్ళి కొడుకు తరపు వారి ఒత్తిడి మేరకు తిరుమ‌ల కొండ‌పైన ఒక మ‌ఠంలో జ‌రిగింది. జీవితంలో తొలిసారి కొండ ఎక్క‌క త‌ప్ప‌లేదు. న‌చ్చ‌ని విశ్వాసాల ముందు త‌ల వంచ‌క‌త‌ప్ప‌లేదు. ఆ స‌మ‌యంలో త్రిపుర‌నేని ముఖంలో ఏదో అప‌రాధ భావ‌న కొట్ట వ‌చ్చిన‌ట్టు క‌నిపించింది.

మూడు సార్లు ఆయ‌న‌కు ఎన్నిక‌ల డ్యూటీ వేశారు. ఒక్క సారి కూడా చేయ‌లేదు. వేపం జేరిలో ఎన్నిక‌ల డ్యూటీ వేసిన‌ప్పుడు ఎన్నిక‌ల డ్యూటీ ఎందుకు చేయ‌ర‌ని క‌లెక్ట‌ర్ పిలిచి అడిగారు. "ఎన్నిక‌ల‌పైన నాకు న‌మ్మ‌కం లేనందుకే క‌దా ఎమ‌ర్జెన్సీలో న‌న్ను జైల్లో పెట్టింది. ముందు మీ అభిప్రాయం మార్చుకోండి. ఆ త‌రువాత ఎన్నిక‌ల డ్యూటీ గురించి ఆలోచిస్తా" అన్నారు.దాంతో క‌లెక్ట‌ర్ ఏమీ మాట్లాడ‌లేదు.

విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ గుంటూరు ఏ.సీ. కాలేజీలో ప‌నిచేసేట‌ప్పుడు బైబిల్‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్యానించారు. అంతే, ఆ కాలేజీ నుంచి ఆయనను త‌రిమేశారు. త్రిపుర‌నేనిని మ‌ధుసూద‌న‌రావును ఉద్యోగం నుంచి తీసెయ్య‌క‌పోతే ఫండ్స్ ఆపేస్తామ‌ని ప్ర‌భుత్వం నుంచి టీటీడీకి హెచ్చ‌రిక‌ వ‌చ్చింది. ప్ర‌భుత్వ ఉడత బెదిరింపును టీటీడీ లెక్క‌చేయ‌లేదు. ఆనాడు టీటీడీ అంత స్వతంత్రం గా వ్యవహరించేది. టీటీడీ క‌ళాశాల‌లో లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తున్న జ‌వాద్ హుస్సేన్ లాంటి విప్ల‌వ క‌వుల‌ను కూడా ఇబ్బంది పెట్ట‌లేదు. టీటీడీ ఇప్పుడ‌లా లేదు. అన్య‌మ‌త‌స్థులంటూ కొంద‌రిపైన‌ వేట ‌మొద‌లుపెట్టింది.

టీటీడీ పురుష‌సూక్తం అచ్చు వేస్తే అది బూతు సాహిత్యం అని త్రిపుర‌నేని తిట్టిపోశారు. దాన్ని తగల బెట్టారు. అప్ప‌టి ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ పీవీఆర్‌కే ప్ర‌సాద్‌ త్రిపుర‌నేనిని పిలిచి అలా ఎందుకు చేశారని ప్ర‌శ్నించారు. "‘రామానుజాచార్యులు పురుష‌సూక్తాన్ని ఒప్పుకోలేదు. అలాంటి దానిని టీటీడీ ఎలా ప్ర‌చురిస్తుంది’' అని ఎదురు ప్ర‌శ్నించారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ వెంట‌నే పెద జియ‌ర్ స్వామిని వివ‌ర‌ణ అడిగారు. ‘"నిజ‌మే, పురుష‌సూక్తాన్ని రామానుజాచార్యులు అంగీక‌రించ‌లేదు. టీటీడీ అచ్చేయాల్సిన అవ‌స‌రం లేదు’' అని చియ‌ర్ స్వామి స‌మాధానం చెప్పారు. ఈ ఒక్క విష‌యంలో త‌ప్ప త్రిపుర‌నేనిని టీటీడీ ఎప్పుడూ ప్ర‌శ్నించ‌లేదు.అరెస్టైన‌ప్పుడు ఉద్యోగం నుంచి స‌స్పెండ్ చేసింది. బెయిల్ రాగానే మ‌ళ్ళీ ఉద్యోగంలో చేర్చుకుంది.
మ‌ధుసూద‌న‌రావు తొలుత క‌విత్వం రాశారు. తిరుప‌తి మిత్రుల‌తో క‌ల‌సి ‘అభ్యుద‌య సాహితి’ ని ఏర్పాటుచేశారు. జ్యోతి(కోట‌య్య‌) వంటి యువకుల‌తో క‌లిసి 1970లో ‘లే’ క‌వితా సంక‌ల‌నం తెచ్చారు. ప్ర‌భుత్వం ‘ఝంఝ’ తోపాటు ‘లే’ క‌వితా సంక‌ల‌నాన్ని కూడా నిషేధించింది. త్రిపుర‌నేని 1972లో విర‌సం స‌భ్య‌త్వాన్ని తీసుకున్నారు. త్రిపుర‌నేని తో పాటు మరి కొందరి పైన ప్ర‌భుత్వం 1973లో తిరుప‌తి కుట్ర‌కేసు పెట్టింది.అలాగే సికింద్రాబాదు కుట్ర‌కేసు కూడా ఆయ‌న‌పై పెట్టింది.

సికింద్రాబాదు కుట్ర‌కేసు సంద‌ర్భంగా అక్క‌డి మేజిస్ట్రేట్ కోర్టులో, తిరుప‌తి కుట్ర‌కేసు సంద‌ర్భంగా చిత్తూరు సెష‌న్స్ కోర్టులో త్రిపుర‌నేని చ‌దివిన ప్ర‌క‌ట‌న‌లో మ‌ధ్య‌యుగాల‌నుంచి ఈనాటివ‌ర‌కు వ‌చ్చిన సాహిత్యాన్ని స‌మీక్షించారు. ఈ స‌మీక్ష గొప్ప విజ్ఞాన‌దాయ‌క‌మైన‌ది.

మ‌ధుసూద‌న‌రావును ఎమ‌ర్జెన్సీలో అరెస్టు చేశారు. ఆయ‌న అరెస్టు అయిన స‌మ‌యంలోనే ఆయ‌న పెద్ద కుమార్తె విజ‌య‌ ట్రాక్టర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించింది. ఇది ప్రమాద మే కానీ, ఇందులో డ్రైవర్ తప్పు లేదని, ఇందులో అతన్ని శిక్షించవలసిన పని లేదని, డ్రైవర్ కు శిక్ష విధిస్తే అతని కుటుంబం అన్యాయానికి గురి అవుతుందని త్రిపుర నేని కోర్టు ముందు స్పష్టంగా చెప్పారు. దాంతో డ్రైవర్ కు శిక్ష తప్పింది. అంత విషాదంలో కూడా ఆయ‌న‌ సిద్ధాంతం స‌డ‌ల‌లేదు. గుండెనిబ్బ‌రం వదల లేదు. ఎమ‌ర్జెన్సీ కాల‌మంతా జైల్లోనే గ‌డిపారు.

కొడ‌వ‌టిగంటి కుటుంబ‌రావు అంటే మ‌ధుసూద‌న‌రావుకు విప‌రీత‌మైన అభిమానం. కొడ‌వ‌టిగంటి బుద్ధికొల‌త సిద్ధాంతాన్ని ప్ర‌తిపాదిస్తే, ‘ఎందుకీ బుద్ధిలేని ప‌ని చేశారు’ అని ఆ పెద్దాయ‌న‌ను మంద‌లించారు. కొడ‌వ‌టిగంటి ఆ సిద్ధాంతాన్ని త‌రువాత ఉప‌సంహ‌రించుకున్నారు.

త్రిపుర‌నేని గ‌తితార్కిక సాహిత్య భౌతిక వాదం అన్న సిద్ధాంతాన్ని ప్ర‌తిపాదించారు. విర‌సంలో అదొక పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ సిద్ధాంతాన్ని కొండ‌ప‌ల్లి సీతారామ‌య్య‌ తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ 30 పేజీలు రాశారు. చ‌ల‌సాని కూడా తీవ్రంగా వ్య‌తిరే కిస్తే, కేవీయార్ పాక్షికంగా వ్య‌తిరేకించారు. వీరి విమ‌ర్శ‌ల‌ను కూడా అంతే తీవ్రంగా పూర్వ‌ప‌క్షం చేస్తూ త్రిపుర‌నేని స‌మాధానం చెప్పారు. వీరి మ‌ధ్య‌ ప్ర‌త్య‌క్ష వాద‌న జ‌ర‌గ‌లేదు. మ‌ధుసూద‌న‌రావు గొప్ప వాద ప్రియుడు. ఎస్వీ యూనివ‌ర్సిటి సెనెట్ హాలులో తెలుగు క‌విత్వంపైన 1987లో నాలుగు రోజుల సెమినార్ జ‌రిగింది. అప్పుడు నేను అంధ్ర‌జ్యోతి రిపోర్ట‌ర్‌గా ఈ సెమినార్‌ను రిపోర్ట్ చేశాను.

రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి దాదాపు 40 మంది మ‌హామ‌హులైన సాహితీ వేత్త‌లు ఈ సదస్సుకు వ‌చ్చారు. విశ్వ‌విద్యాల‌యాల సెమినార్‌ల‌లో పెద్ద‌గా వాదోప‌వాదాలు ఉండ‌వు. ఏదో ఒక‌టి రెండు ప్ర‌శ్న‌ల‌తో స‌రిపెట్టుకుంటారు. ఒక సెష‌న్‌లో జీ.వి.సుబ్ర‌మ‌ణ్యం మాట్లాడారు.త్రిపుర‌నేని లేచి ఆయ‌నను ప్ర‌శ్నించారు.చాలా సేపు ఇద్ద‌రి మ‌ధ్య వాదోప‌వాదాలు జ‌రిగాయి. ఆ వాదోప‌వాదాలు చాలా అస‌క్తిక‌రంగా సాగాయి. త్రిపుర‌నేని త‌న వాద‌నాప‌టిమ‌తో సుబ్ర‌మ‌ణ్యం వాదాన్ని పూర్తిగా వెన‌క్కి నెట్టేశారు. ఇక త‌న వాద‌న వినిపించ‌డానికి సుబ్ర‌మ‌ణ్యం ద‌గ్గ‌ర ఏమీ లేదు. దాంతో మీ అభిప్రాయాలు మీవి, నా అభిప్రాయాలు నావి అని సుబ్ర‌మ‌ణ్యం కూర్చునేశారు.

సాహిత్యంలో విమ‌ర్శించాల్సి వ‌స్తే త‌న ప‌ర భేదం చూడ‌రు. వ‌ర‌వ‌ర‌రావైనా, కేవీయార్ అయినా, జ్వాలాముఖి అయినా, తాను అభిమానించిన స‌త్య‌మూర్తి అయినా , కొండ‌ప‌ల్లి సీతారామ‌య్య అయినా స‌రే త్రిపుర‌నేని విమ‌ర్శ ఘాటుగానే ఉంటుంది. విమ‌ర్శ ఎంత తీవ్రంగా ఉన్నా త‌న‌కు అభ్యంత‌రం లేదంటారు.

విర‌సం రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా, అరుణ‌తార ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు. విర‌సానికి 1990 నుంచి స‌భ్య‌త్వం రెన్యువ‌ల్ చేయ‌కుండా దానికి దూర‌మ‌య్యారు. సైద్ధాంతికంగా త్రిపుర‌నేనికి విర‌సంతో విభేదాలు లేవు. త్రిపుర‌నేని ప్ర‌తిపాదించిన గ‌తితార్కిక సాహిత్య భౌతిక వాదం అన్న సిద్ధాంతాన్ని కొండ‌ప‌ల్లితోపాటు ఇత‌ర విర‌సం పెద్ద‌లు విమ‌ర్శించ‌డం ఆయ‌న‌లో ఒక నిరుత్సాహాన్ని నింపింది. వీటితో పాటు వ్య‌క్తిగ‌త కార‌ణాలు కూడా తోడై విర‌సానికి దూర‌మ‌య్యారు. మ‌ళ్ళీ 2004 లో విర‌సం స‌భ్య‌త్వాన్ని తీసుకున్నారు. అయినా త్రిపుర‌నేనిలో ఇదివ‌ర‌క‌టి దూకుడు లేదు. ఆరోగ్య స‌మ‌స్య‌లు, ఆర్థిక స‌మ‌స్య‌లు వెన్నాడాయి. బైరాగిప‌ట్టెడ‌లో క‌ట్టుకున్న ఇల్లు కాస్తా అమ్ముకున్నారు. కొంత కాలం మా ఇంటికి ద‌గ్గ‌ర‌లో ఉన్న అమ‌రావ‌తి న‌గ‌ర్‌లో (ముత్యాల‌రెడ్డిప‌ల్లె ప్రాంతంలో) ఇల్లు తీసుకున్నారు.

మ‌ధుసూద‌న రావును గాంధీ రోడ్లో క‌ల‌వ‌డం స‌ర్వ‌సాధార‌ణం. రామ్‌న‌గ‌ర్ లో ఉన్న‌ప్పుడు అనేక మార్లు వాళ్ళింటికి వెళ్ళి క‌లిశాను. మా బాబాయి ఆలూరు భుజంగ‌రావు వ‌చ్చిన‌ప్పుడు ఒక సారి ఆయ‌న‌ను వారింటికి తీసుకెళ్ళాను.బైరాగి ప‌ట్టెడ‌లో సొంత ఇంటిలో ఉన్న‌ప్పుడు ఒక‌టి రెండు సార్లు వెళ్ళి వ‌చ్చాను. అమ‌రావ‌తి న‌గ‌ర్‌లో ఉన్న‌ప్పుడు కూడా మా బాబాయిని తీసుకుని వెళ్ళాను. ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన అనేక విష‌యాలు చ‌ర్చించారు. ముఖ్యంగా వేమ‌న‌, శ్రీ‌నాథుడి చాటువుల గురించి. వాళ్ళు రాయ‌ని ప‌ద్యాలు కూడా వాళ్ళ‌పేరుతో ప్ర‌చారంలోకి వ‌చ్చాయన్నారు.

అవ్వ‌న్నీ చాలా విలువైన‌వి రాయ‌చ్చు క‌దా అని అంటే, ఆరోగ్యం స‌హ‌క‌రించ‌డం లేదు అన్నారు. రాసే మ‌నిషి స‌హ‌కారం ఉంటే ఇంకా అనేక సాహిత్య విష‌యాలు వెలుగులోకి వ‌చ్చేవి. నాకు తెలిసి త్రిపుర‌నేనిని ఎప్పుడు క‌లిసినా, ఎవ‌రు క‌లిసినా మార్క్సిస్టు ప్రాపంచిక దృక్ప‌థంతో అనేక విష‌యాలు చ‌ర్చించ‌డ‌మే త‌ప్ప, వ్య‌క్తిగ‌త విష‌యాల ప్ర‌స్తావ‌న అస్స‌లు తీసుకు వచ్చేవారు కాదు. అమ‌రావ‌తి న‌గ‌ర్‌లో ఉన్న రోజుల్లోనే నా కుటుంబ విష‌యాలు, వ్య‌క్తిగ‌త విష‌యాలు త్రిపుర‌నేని అడ‌గ‌డం ఆశ్చ‌ర్యం వేసింది. చివ‌రి రోజుల్లో కొంత నిస్స‌హాయ‌త‌తో బేల‌గా త‌యార‌య్యారు. నేను, ఏ.ఎన్‌. నాగేశ్వ‌ర‌రావు తరచూ త్రిపుర‌నేనిని క‌లిసే వాళ్ళం. ‘మీరు ఆయుర్వేదం వాడి చూడండి. మ‌న ఆయుర్వేద డాక్ట‌ర్ మోహ‌న్ ఉన్నారు’ అని నాగేశ్వ‌ర‌రావు స‌ల‌హా ఇచ్చారు. ‘ఆయుర్వేదం మందులు బాగానే ప‌నిచేస్తాయి నాగేశ్వ‌ర‌రావు. కానీ, అవి జీవిత కాలం ఆల‌స్య‌మైతే ఎలా!?’ అంటూ న‌వ్వేశారు.

షుగ‌ర్‌, బీపీతోపాటు కిడ్నీలు దెబ్బ‌తిన్నాయి. స్విమ్స్‌లో చేరారు. ఆరోజు అక్టోబ‌ర్ 8 2004 తిరుప‌తిలో మ‌న కాల‌పు ఒక మ‌హా మేధావి స్విమ్స్‌లో చివ‌రి శ్వాస విడిచారు. ఆర్ట్స్ కాలేజీ ప‌క్క‌నున్న స్మ‌శాన వాటిక‌లో ఆరోజు అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి.లెక్క‌లేనంత మంది అభిమానులు వ‌చ్చారు చివ‌రి చూపు కోసం. త్రిపుర‌నేని మ‌ధుసూద‌న రావుతో మాట్లాడ‌డం, ఆయ‌న ఉప‌న్యాసాలు విన‌డం, ఆయ‌న ర‌చ‌న‌లు చ‌ద‌వ‌డం నిజంగా ఒక విజ్ఞానోత్స‌వం.

త్రిపుర‌నేని మ‌ర‌ణించిన నాలుగేళ్ళ‌కు ( 2018 లో ) ఆయ‌న ర‌చ‌న‌ల‌న్నీ క‌లిపి మూడు సంపుటాలుగా విర‌సం అచ్చేసింది. ఆయ‌న సాహిత్య స‌ర్వ‌స్వాన్ని తిరుప‌తిలో ఆవిష్క‌రించారు. ఆ స‌భ‌లో మ‌ళ్ళీ మ‌ధుసూద‌న‌రావు అభిమానుల‌, పరిచ‌య‌స్తుల కోలాహ‌లం పెద్ద ఎత్తున కనిపించింది.

త్రిపురనేని మ‌ధుసూద‌న రావును అమ‌రావ‌తి న‌గ‌ర్‌లో ఉండ‌గానే 2002లో నేను వార్త‌లో చేస్తున్న‌ప్పుడు ఆయన్ని ఇంట‌ర్వ్యూ చేశాను. ‘'ఇంత పెద్ద ఇంట‌ర్వ్యూనేను వెయ్య‌లేను ‘' అని వార్త తిరుప‌తి ఎడిష‌న్ ఇన్‌చార్జి న‌జీర్ అన్నారు.'‘మీరు వేసి తీరాలి. దీనికి చారిత్ర‌క ప్రాధాన్య‌త ఉంది’' అని వివ‌రించాను.'‘బాగుంది కానీ, పై వాళ్ళ‌కు నేను స‌మాధానం చెప్పుకోవాలి’' అన్నారు. '‘నేను చెప్పుకుంటాను’' అన్నాను.

ప్ర‌తి ఆదివారం జిల్లా పేజీలు మెయిన్ పేజీ సైజ్‌లో వ‌చ్చేవి. భ‌య‌ప‌డుతూ భ‌య‌ప‌డుతూనే న‌జీర్‌ జిల్లా పేజీ బ్రాడ్‌షీట్‌లో ఫుల్ పేజీ ఆయన ఇంటర్వ్యూ పెట్టించారు. ఆ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న జీవిత‌రేఖ‌ల‌న్నీ క‌నిపిస్తాయి. త్రిపుర నేని మరణించి అక్టోబరు 8 వ తేదీ మంగళవారం నాటికి రెండు దశాబ్దాలు పూర్తి అవుతున్నా ఆయన జ్ఞాపకాలు తిరుపతిని ఏ మాత్రం వదల లేదు.

త్రిపురనేని పైన‌ ఎన్ని వాద వివాదాలున్నా తిరుప‌తిలో ఒక త‌రానికి జ్ఞానాన్ని పంచిన‌ మేధావి. ఒక సాంస్కృతిక విప్ల‌వ సేనాని.


Read More
Next Story