దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సాక్షి మీడియాలో గౌరవం తగ్గనుందా.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇది వాస్తవమేననిపిస్తుంది.


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆలోచనలతో వచ్చింది సాక్షి మీడియా. కాంగ్రెస్‌ పార్టీకి ఒక మీడియా కావాలనే ఆలోచనతో వైఎస్‌ఆర్‌ సాక్షి మీడియా గ్రూపును అప్పట్లో ఏర్పాటు చేశారు. అప్పటికే ఉన్న మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి గ్రూపులు తనకు, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చాలా చోట్ల చెప్పారు. 2004లో అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రామోజీరావు, రాధాకృష్ణలను ఆహ్వానించి తాను చేస్తున్న మంచి పనులు కూడా రాయాలని కోరారు. అందుకు వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆయన మీడియా సంస్థను స్థాపించాలనే ఆలోచన చేశారు. ఆలోచన వచ్చిందే తడవుగా సాక్షి మీడియా గ్రూపును 2007లో స్థాపించారు. అప్పటి వరకు ఉన్న మీడియా గ్రూపుల్లో ఉద్యోగులకు ఇచ్చే జీతాల కంటే రెట్టింపు జీతాలు ఇచ్చి ఉద్యోగులను తీసుకోవడం సంచలనంగా మారింది.

జగన్‌కు సాక్షి గ్రూపు బాధ్యతలు
సాక్షి మీడియా గ్రూపును నడిపించే బాధ్యతలు తన కుమారుడు వైఎస్‌ జగన్‌ను తీసుకోవాల్సిందిగా పురమాయించి ముందుకు సాగారు. అప్పట్లో రెండు రూపాయలకు సాక్షి పత్రిక అందించారు. అన్ని పత్రికల కంటే ఎక్కువ పేజీలు, పీచర్లు ఇచ్చి పాఠకులను అలరించారు.
వైఎస్‌ఆర్‌ గుర్తుగా ఫొటో..
వైఎస్‌ఆర్‌ 2009 ఎన్నికల తరువాత రెండోసారి సీఎం అయ్యారు. మూడు నెలలు కూడా గడవకుండానే హెలికాఫ్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రాష్ట్ర ప్రజలంతా ఎంతో బాధ పడ్డారు. వేల మంది ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయారు. సాక్షి మీడియా గ్రూపుకు పునాది వేసిన వైఎస్సార్‌ను గుర్తు చేసుకకుంటూ సాక్షి యాజమాన్యం వైఎస్సార్‌ ఫొటోలను టీవీ తెరపై, సాక్షి పత్రికపై నిత్యం కినిపించే విధంగా చేసి గౌరవించారు. ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ ఆయన ఫొటోను ఇకపై సాక్షి మీడియాలో చూసే అవకాశాన్ని సాక్షి మీడియా దూరం చేసింది. సాక్షి టీవీ లోగోపై ఉన్న వైఎస్సార్‌ ఫొటోను శుక్రవారం నుంచి తొలగించారు. ట్రైల్‌గా కొత్త లోగోను ఆవిష్కరించారు. టీవీ ప్రేక్షకులు, వైఎస్సార్‌ అభిమానులు, సాక్షి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కి పడకుండా అప్పుడప్పుడు అలా లోగోలో వైఎస్సార్‌ ఫొటో కనిపించి వెనక్కి వెళ్లే విధంగా పెట్టారు. ఇక రేపటి నుంచి వైఎస్సార్‌ ఫొటో సాక్షి టీవీలో కనిపించదు.
పత్రికలో కూడా తొలగించాలనే నిర్ణయం
ప్రస్తుతం పత్రికలో సాక్షి హెడ్‌కు ఎడమవైపు వైఎస్సార్‌ ఫొటో, ఆ ఫొటో కింద ఆయన మాట్లాడిన మాటల్లోని ఆణిముత్యాల లాంటి వాక్యాలు వస్తున్నాయి. ఇకపై ఆ ఫొటో కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ సాక్షిలో ఉండవని, మేనేజ్‌ మెంట్‌ ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్‌ మరణించి 14 ఏళ్లు పూర్తయ్యాయి. వచ్చే సెప్టెంబరు 2 నాటికి 15 సంవత్సరాలు పూర్తవుతాయి. ఇన్నేళ్లు వైఎస్సార్‌ను గుర్తు పెట్టుకుని గౌరవించిన మేనేజ్‌మెంట్‌కు బోరు కొట్టిందేమో ఆయన ఫొటోను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇదే సాక్షి సిబ్బంది, వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, ప్రజల్లో పెద్ద చర్చగా మారింది.
Next Story