ఇది వరకు కొన్ని మండలాల్లో సంచరించిన పులి ఆ ప్రాంతపు వాసులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.
కాకినాడ జిల్లాలో పులి భయం మళ్లీ మొదలైంది. కాకినాడ జిల్లాకు మళ్లీ పులి వచ్చిందన్న ఆందోళనలు నెలకొన్నాయి. పులి సంచరిస్తోందని ఆ ప్రాంతపు వాసులు హడలి పోతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సమీప ప్రాంతాల్లో అది సంచరించినట్లు ఆ ప్రాంతపు వాసుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల బాపన్నధార పరిసర ప్రాంతాల్లో ఓ పశువు మృతి చెందడం ఈ అనుమానాలకు బలం చేకూర్చినట్టైంది. అయితే పశువు మృతి చెందడంపైన అప్రమత్తమైన స్థానికులు ఇది వరకే అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు బాపన్నధార, దారపల్లి, బురదకోట తదితర పరిసర ప్రాంతాల్లో గాలింపులు కూడా చేపట్టారు. పులి సంచరిస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత రావలసి ఉంది. మరో వైపు ఇది వరకు ఈ ప్రాంతాల్లో ఓ పులి సంచరించింది. 2022 మే నెలలో చాలా రోజుల పాటు పులి ఈ ప్రాంతాల్లో సంచారం చేసింది. ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి, శంఖవరం, తుని వంటి మండలాల్లో పులి సంచరించింది. దీంతో పాటుగా ఇటీవల సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కూడా రాజమండ్రి, కడియం, ఆలమూరు, రావులపాలెం వంటి ప్రాంతాల పరిసరాల్లో కూడా పులి సంచారం చేసింది. అయితే తాజగా ప్రత్తిపాడు మండలంలోను కూడా పులి సంచరించిందనే అనుమానాలతో ఆ ప్రాంతపు వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే స్థానికుల్లో భయాందోళనలను తొలగించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.