ఎన్నికల నిఘా కోసం రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లు
x

ఎన్నికల నిఘా కోసం రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లు

ఎన్నికల అక్రమాలపై సీఎఫ్‌డీ దృష్టి పెట్టింది. ప్రతి జిల్లాకు ఒక రిటైర్డ్‌ అధికారిని నియమించింది.


రాష్ట్రంలోనే మొదటి సారిగా ఎన్నికల అక్రమాలను అరికట్టడం కోసం ఒక సంస్థ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆ సంస్థ నుంచి అధికారలను రంగంలోకి దింపింది. జిల్లాకు ఒక రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులను నియమించింది. 13 ఉమ్మడి జిల్లాల్లో వీరి నిఘా నేత్రం ద్వారా ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడానికి ఎన్నికల కమిషన్‌కు స్వతహాగా తోడ్పాటును అందిస్తారు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ జరిగే అక్రమాలను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.

ప్రతి జిల్లాకు నిఘా సమన్వయ కర్తగా ఏర్పాటు చేయబడిన ఈ అధికారులు గతంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో రిటైర్ట్‌ చీఫ్‌ సెక్రెకటరీలుగాను, కలెక్టర్లుగాను, గవర్నర్లుగాను, జాతీయ స్థాయిలో పలు శాఖలకు డైరెక్టర్‌ జనరల్స్‌గాను, ప్రభుత్వ సలహాదారులుగాను అనుభవం ఉన్న వారు.
జిల్లాల వారీగా నియమించిన రిటైర్డ్‌ అధికారులు వీరే
సిటిజెన్స్‌ ఫర్‌ డెమోక్రెసీ చైర్మన్‌ జస్టిస్‌ జి భవానీప్రసాద్, ఉపాధ్యక్షులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్, సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డిలు ఈ అధికారుల వివరాలను విజయవాడలో వెల్లడించారు.
అనంతపురం జిల్లాకు చీఫ్‌ సెక్రెటరీ, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఎస్పీ టక్కర్, కర్నూలు జిల్లాకు కేరళ క్యేడర్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ గా పని చేసిన డబ్ల్యూఆర్‌ రెడ్డి, కడప జిల్లాకు రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి, జాతీయ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పని చేసిన సంతోష్‌ మెహ్రా, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, చిత్తూరు జిల్లాకు రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి, ఇన్‌కంట్యాక్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పని చేసిన డాక్టర్‌ పి రఘు, నెల్లూరు జిల్లాకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, పూర్వపు కర్నూలు జిల్లా కలెక్టర్‌ రామశంకర్‌ నాయక్, ప్రకాశం జిల్లాకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, మానవ వనరుల సంస్థ పూర్వపు డైరెక్టర్‌ జనరల్‌ డి చక్రపాణి, గుంటూరు జిల్లాకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, పూర్వపు కాఫీ బోర్డు చైర్మన్, మాజీ ప్రభుత్వ సలహాదారు జివి కృష్ణారావు, కృష్ణా జిల్లాకు పూర్వపు చీఫ్‌ సెక్రెటరీ, తెలంగాణకు చెందిన డాక్టర్‌ రాజీవ్‌ శర్మ, పూర్వ మంగోలియా అంబాసిడర్‌ టి సురేష్‌ బాబు, పశ్చిమ గోదావరి జిల్లాకు రిటైర్డ్‌ జిల్లా జడ్జి ఏ లక్ష్మి, తూర్పు గోదావరి జిల్లాకు తమిళనాడు క్యేడర్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, పూర్వపు జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ గవర్నర్‌ సలహాదారు స్కందన్‌కుమార్‌ కృష్ణన్, విశాఖపట్నం జిల్లాకు హర్యానా క్యేడర్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, పూర్వపు భారత ఉక్కు, ఘనుల శాఖ కార్యదర్శి, పూర్వపు హర్యానా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ దిలీప్‌ సింగ్, విజయనగరం జిల్లాకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పూర్వపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రెడ్‌ క్రాస్‌ సంస్థ చైర్మన్‌ అజయ్‌ మిశ్రా, శ్రీకాకుళం జిల్లాకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, భారత ప్రభుత్వ పూర్వపు స్పెషల్‌ సెక్రెటరీ అటానమిక్‌ ఎనర్జీ సీబీఎస్‌ వెంకటరమణలు నియమితులయ్యారు.
వీరు నిరంతరం ఆయా జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలు, శాంతి భద్రతలకు భంగం కలుగుతాయని అనుమానిత ప్రాంతాలను పర్యటిస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల్లో పని చేసిన అధికారులు కావడం వల్ల రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలపై పూర్తి అవగాహన వీరికి ఉంది. వీరు జిల్లాల్లో ఒక సంస్థ తరుపున ప్రత్యేకంగా నిఘా విభాగంలా పని చేస్తున్నారంటే ఆ జిల్లాల్లో అల్లర్లు సృష్టించాలనుకునే వారు కానీ దొంగ ఓట్లు వేయించాలనుకునే వాళ్ల కానీ వెనక్క తగ్గే అవకాశాలు ఉంటాయి.
Read More
Next Story