అప్పటి వరకు ఒడి బియ్యం వేడుకలో సంతోషంగా గడిపి, అంతలోనే ప్రమాదంలో మరణించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు, మూడు నెలల వయసున్న పసిపాపతో కలిపి నలుగురు ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తగారింటికి వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఎమర్జెన్సీ వైద్య సేవల కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లా రాయంపల్లికి చెందిన సరస్వతి తన అక్కా చెల్లెళ్లు నీలమ్మ, యోగేశ్వరిలు తమ సొంతూరు అయిన గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలోని తమ పుట్టింటిలో ఒడి బియ్యం పెట్టుకున్నారు. తర్వాత తమ అత్తగారింటికి వెళ్లేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. సరస్వతి, సీలమ్మ, యోగేశ్వరితో పాటు సరస్వతి మూడు నెలల కుమార్తె విద్య శ్రీ, ఇతర బంధువులతో కలిసి ఆటోలో బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటోను బళ్లారి నుంచి అనంతపురం వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో సరస్వతితో పాటు ఆమె మూడు నెలల కుమార్తె విద్య శ్రీ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన నీలమ్మ, యోగేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు, మూడు నెలల వయసున్న పసిపాప మృత్యువాత పడటంతో వారి స్వగ్రామమైన మర్తాడులో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు పట్టింట్లో ఒడి బియ్యం వేడుకను జరుపుకుని అంతలోనే ప్రమాదం బారిన పడటంతో కన్నీరుమున్నీరయ్యారు. అటు సరస్వతి అత్తగారింటిలో ఆమె భర్త, ఇతర బంధువులు తీవ్ర దుఃఖ సముద్రంలో మునిగి పోయారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసులు రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించారు.
Next Story