రోజాకు ఈ సారి నగరి నల్లేరుపై నడక కాదు

ఆంధ్రప్రదేశ్ లోని నగరి నియోజకవర్గం ఈ సారి ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెండు సార్లు గెలిచిన ఆర్కె రోజా మూడోసారి పోటీలోకి దిగింది.


రోజాకు ఈ సారి నగరి నల్లేరుపై నడక కాదు
x
ఆర్ కె రోజా, మంత్రి

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ప్రముఖ రాజకీయ నాయకురాలుగా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా గెలుపై పలువురు రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. నగరి నియోజకవర్గం నుంచి రోజా మొదటిసారిగా 2004లో అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసింది. అప్పట్లో కాంగ్రెస్ ఐ తరపున పోటీ చేసిన రెడ్డివారి చెంగారెడ్డి 5,694 ఓట్ల మెజారిటీతో రోజాపై గెలుపొందారు. ఆ తరువాత 2009లో టీడీపీ ఆమెకు సీటు ఇవ్వలేదు. టీడీపీలో సీనియర్ నాయకుడైన గాలి ముద్దుకృష్ణమనాయుడుకు సీటు కేటాయించింది. ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ ఐ అభ్యర్థి రెడ్డివారి చెంగారెడ్డి 1,633 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

టీడీపీకి గుడ్బై చెప్పిన రోజా

రోజా తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరింది. 2014లో రోజాకు వైఎస్ జగన్ నగరి అసెంబ్లీ సీటు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు 858 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రోజా తిరిగి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసింది. ఈ ఎన్నికల్లోనూ ఆమె విజయం సాధించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు గాలి భానుప్రకాష్ టీడీపీ తరపున పోటీ చేసి 2,708 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైఎస్సార్సీపీలో రెండు సార్లు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు.

భాను ప్రకాష్ తమ్ముడు సపోర్టుతో..

గత ఎన్నికల్లో భాను ప్రకాష్ తమ్ముడు జగదీష్ కుటుంబ కలహాల నేపథ్యంలో రోజాకు సహకరించారనే ఆరోపణలు వచ్చాయి అన్నను ఓడించేందుకు లోపాయికారీగా పనిచేశాడని రెండు పార్టీల వారు చెబుతున్నాడు. తన తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి రావాలనుకున్న తమ్ముడు జగదీష్ కు కాకుండా అన్న భానుప్రకాష్ కు టీడీపీ సీటు కేటాయించింది. దీంతో జగదీష్ అన్నను కాదని రోజాకు సపోర్టు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆకృతజ్ఞత జగదీష్ కు చిన్నచిన్న పనులు రోజా చేసిపెట్టినట్లు పార్టీల్లోని నాయకులు చెప్పడం విశేషం.

తీవ్ర వ్యతిరేకత

ప్రస్తుతం నగరి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీలో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. మంత్రి రోజా నమ్ముకున్న పార్టీ వారిని కాదని తెలుగుదేశం పార్టీ వారికి కొమ్ముకాస్తూ వచ్చారని, ఆమెకు రానున్న ఎన్నికల్లో సపోర్టు చేసేది లేదని వైఎస్సార్సీపీలోని స్థానిక నాయకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో ఐదు మండలాలు వుండగా అన్ని మండలాల నుంచి వ్యతిరేకత ఉంది. నిండ్ర మండలానికి చెందిన రెడ్డివారి చక్రపాణి రెడ్డి రోజాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. తమ్ముడు భాస్కర్ రెడ్డి మండలంలో ఎంపీటీసీ సభ్యుడు. మండల అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలం కాకుండా రోజా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 8 ఎంపీటీసీ సీట్లు ఉండగా అందులో 7 సీట్లు వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఒక సీటు మాత్రమే టీడీపీ దక్కించుకుంది. ఆ ఒక్కరిని కూడా వైఎస్సార్సీపీ వారు కొనుగోలు చేశారనే వాదన వుంది. ఆ ఒక్కరిని కూడా వైఎస్సార్సీపీలో చేర్చుకుని రోజాకు అనుకూలమైన క్షత్రియ సామాజికవర్గానికి చెందిన దీపను ఎంపీపీని చేశారు. దీంతో చక్రపాణికి రోజాపై కోపం పెరిగింది. వడమాలపేట నుంచి జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పుత్తూరు నుంచి మునిసిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ డీఎన్ ఏలుములై (అమ్ములు), నగరి నుంచి మునిసిపల్ మాజీ చైర్మన్లు కెజె కుమార్, ఆయన భార్య కెజె శాంతి, విజయపురం నుంచి జి లక్ష్మీపతిరాజు వంటి వారు గత ఎన్నికల్లో రోజాను సీఎం ఆదేశం మేరకు బలపరిచారు. అయితే గెలిచిన తరువాత తెలుగుదేశం పార్టీలోని వారికి రోజా సహకరిస్తూ వచ్చారనే ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీంతో వీరంతా సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. గతంలో రోజాపై అనేక సార్లు వీరు ఫిర్యాదులు చేయడంతో సీఎం ఆఫీసు వారు పిలిపించారని సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయించి సాయంత్రం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడి పంపించారు. తప్పకుండా రోజాను గెలిపించాలని చెప్పినట్లు సమాచారం. మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రోజాను మేమెందుకు గెలిపించాలని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి పార్టీ నాయకుల వద్ద సమాచారం లేదు.

టీడీపీని రెండు సార్లు ఓడించిన రోజా

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా రోజాపై గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఆయన కొడుకు భానుప్రకాష్ లు పోటీచేసి ఓటమి చవిచూశారు. అయితే ఈ సారి ఎలాగైనా గెలవాలనే ఆలోచనలో భాను ప్రకాష్ ఉన్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. రోజాను వ్యతిరేకిస్తున్న వారంతా మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి చెంగారెడ్డి వర్గానికి చెందిన వారు. రోజాను వ్యతిరేకిస్తున్నారే కాని వారు పార్టీ మారే అవకాశాలు లేవు. అయితే రోజాను వ్యతిరేకిస్తున్నారంటే ఓట్లు వేసేందుకు సుముఖంగా లేరని చెప్పొచ్చు.

తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ గట్టి పోటీని ఇస్తున్నది. 2014లో కేవలం 858 ఓట్లు, 2019లో కేవలం 2708ఓట్లతో మాత్రమే వైఎస్సార్సీపీ గెలిచింది. అంటే తక్కువ ఓట్లతోనే రోజా గెలిచారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ వైఎస్సార్సీపీ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడాన్ని బట్టి చూస్తుంటే గెలుపు వైఎస్సార్సీపీకి నల్లేరుపై నడక ఏమాత్రం కాదని అర్థమవుతోంది.

నియోజకవర్గంలో మొదలియార్స్ ఓట్లు సుమారు 30వేలు, ఎస్సీల ఓట్లు 30వేలు, నాయుడ్ల ఓట్లు సుమారు 20వేల వరకు వుంటాయని అక్కడి పార్టీల వర్గాలు చెబుతున్నాయి. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల ఓట్లు తక్కువగానే ఉన్నాయి. మిగిలిన ఓటర్లంతా అనేక సామాజిక వర్గాలకు చెందిన బీసీలు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే వారు 2,01,587 మంది ఉన్నారు. అయితే వీరిలో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటారో ఎన్నికల సమయంలోనే తెలుస్తుంది.

తగ్గిన సినిమా క్రేజ్

ఆర్కే రోజా అంటే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు సినీ క్రేజ్ ఎక్కువగా వుండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే రాజకీయాల్లో దాదాపు ఫుల్ టైం లీడర్ గా మారిపోయారు. ఏపీఐఐసీ చైర్మన్ గా మొదటి రెండున్నర సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రి అయిన తరువాత నియోజకవర్గంలో ప్రజలకు చేరువ కాలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. సొంతపార్టీలో ఉన్న శత్రువర్గాన్ని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.

Next Story