రాజధానిలో వచ్చే నెల నుంచి పనులు మొదలు కానున్నాయి. సచివాలయం, హైకోర్టు భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. మిగిలిన పనులకు ఇంతకు ముందే టెండర్లు పూర్తయ్యాయి.


రాజధాని అమరావతిలో పనులు వేగం కానున్నాయి. ఈనెల 20 నాటికి ఇప్పటి వరకు పిలిచిన టెండర్లతో పాటు సచివాలయం, హైకోర్టు నిర్మాణాలకు పిలిచే టెండర్లు కూడా ఖరారు ఖరారు కానున్నాయి. ఇక పనుల ప్రక్రియ ప్రారంభం కావడమే ఆలస్యం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గతంలో మొదలు పెట్టి వదిలేసిన పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే కొత్త పనులకు టెండర్లు పిలిచారు. విదేశీయులతో తయారు చేయించిన డిజైన్ల ప్రకారం నిర్మాణాలు చోటు చేసుకోనున్నాయి. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం చేపడుతున్నందున దేశ దేశాలకు చెందిన వారు ఆకర్షితులు కావాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అంతర్జాతీయ, జాతీయ సంస్థలు అమరావతిలో కార్యాలయాలు నిర్మించుకునేందుకు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించారు. సంస్థలు స్థాపించే వారు దరఖాస్తులు చేసుకుంటే ప్రభుత్వం అడుగులు ముదుగు వేస్తుంది.

హైకోర్టును రూ. 1,048 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అసెంబ్లీకి రూ. 748 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు టెండర్లు ఈనెల 17 సాయంత్రం వరకు స్వీకరిస్తారు. ఏ సంస్థ తక్కువగా కోట్ చేస్తుందో దానికి నిర్మాణ బాధ్యతలను అప్పగించనున్నారు. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్స్ వేరు వేరుగా వేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాల్సి వస్తుండటంతో తుపాన్, వరద నీటికి తట్టుకునేలా భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ భవనాన్ని దేశంలో ఎక్కడా లేని ఆకృతిలో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం గతంలోనే కొన్ని డిజైన్లను సిద్ధం చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగానే నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. ఫోస్టర్స్ సంస్థ ఈ డిజైన్లను రూపొందించింది.

అసెంబ్లీ భవనాన్ని 103 ఎకరాల్లో నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మూడు అంతస్థులు ఉండేలా నిర్మాణ పనులు సాగనున్నాయి. ఇందులోనే మంత్రులకు ఛాంబర్లతో పాటు కౌన్సిల్ కూడా ఉంటుంది. మూడో అంతస్థు నుంచి నగరాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు భవనాన్ని 42.36 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఏడు అంతస్థుల్లో హైకోర్టు భవనాన్ని నిర్మించనున్నారు. లైబ్రరీతో పాటు డైనింగ్ హాలు కూడా ఈ నిర్మాణంలో చోటు చేసుకోనున్నాయి. హైకోర్టు నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 1,048 కోట్లుగా నిర్ణయించారు.

ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల క్వార్టర్లు పూర్తి కావొచ్చాయి. రహదారుల నిర్మాణాలు కూడా వేగంగా సాగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వేయడం ద్వారా విజయవాడ, గుంటూరు, గన్నవరం కలిసిపోతాయి. గన్నవరంలోని విమానాశ్రయం నుంచి గుంటూరు శివారు ప్రాంతాల వరకు సుమారు 60 కిలో మీటర్ల ప్రాంతం పూర్తి స్థాయిలో కలిసి పోతుంది. అంటే హైదరాబాద్ సిటీ కంటే పెద్ద సిటీగా అమరావతి తయారు కానుంది.

అన్ని అవసరాలకు పోను ఐదు వేల ఎకరాలు అదనంగా స్థలం ఉంటుందని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వెయ్యి ఎకరాలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు కేటాయించగా, మిగిలిన నాలుగు వేల ఎకరాల భూమిని విక్రయించి ఆ నిధులు అమరావతి నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం ఆర్-5 జోన్ కిందకు 1,450 ఎకరాలు తీసుకొచ్చి 50 వేల మంది పేదలకు పట్టాలు ఇచ్చింది. ఈ మొత్తం భూమికి బదులుగా ఆ పేదలకు వారి ఊర్లకు సమీపంలోనే ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు నిర్ణయించామని, ఈ భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి చెప్పారు.

Next Story