జగన్ ‘విజన్ విశాఖ’ మీద మాజీ ఐఎఎస్ అధికారి ఘాటైన లేఖ
x

జగన్ ‘విజన్ విశాఖ’ మీద మాజీ ఐఎఎస్ అధికారి ఘాటైన లేఖ

"విశాఖను ఈ స్థాయికి రావడానికి కారణమేమిటో మీకు తెలియదు, ఆయా రంగాలను, ఆ శక్తులను విస్మరించి, హంగులతో విజన్ డాక్యుమెంట్ తెచ్చారు, ఏం లాభం," అంటున్న డా ఇఎఎస్ శర్మ



ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన విశాఖ విజన్ (Vasakha Vision ) ప్రణాళిక లో ఏవి ఉండాలలో అవిలేవని, విశాఖ అభివృద్ధికి కారణమయిన రంగాలను పూర్తిగా విస్మరించి తయారు చేశారు, మాజీ ఐఎఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్ ఇఎఎస్ శర్మ అన్నారు.

ప్రణాళిక హంగులు చూస్తే, ప్రజల సమస్యల మీద అవగాహన లేని ప్రైవేట్ కన్సల్టెంట్ చేత తయారు చేయించిన పత్రం లాగ కనిపిస్తున్నదని చెబుతూ ఆ ప్రణాళిక తయారు చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


‘విజన్ విశాఖ’ పేరుతో మార్చి 5న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ అభివృద్ధి కోసం ఒక డాక్యుమెంట్ ను విడుదల చేశారు. దీని ప్రకారం వచ్చే పదేళ్లలో లక్ష కోట్ల రుపాయలు ఖర్చు చేసి విశాఖ ను హైదరాబాద్ ను, బెంగుళూరు,చెన్నై నగరాలలాగా అభివృద్ధి చేసి గ్లోబల్ సిటిగా మారుస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఈ విశాఖ విజన్ మీద ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాస్తూ ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో చాలా లోపాలున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఖరీదైన ప్రైవేట్ కన్సల్టెంట్ కు బదులు, విశాఖ ప్రజల అభిప్రాయాలు సేకరించి, వారి సమస్యల పరిష్కారం కోసం ఒక దీర్ఘకాలిక ప్రణాళికను తయారు చేసి ఉంటే తక్కువ ఖర్చు కావడమే కాదు, ఒక సరి అయిన ప్రణాళిక ను ప్రజల ముందు పెట్టగలిగే ఉండేవారని ఆయన అభిప్రాయపడ్డారు.

“విశాఖ నగరం ప్రగతికి కారణం మూడు రంగాలు కారణం. అవి 1. పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం, 2. గ్రామాలలో పాడి పరిశ్రమ, 3. తీరప్రాంతంలో సాంప్రదాయ మత్స్య పరిశ్రమ. ఆ రంగాల్లో అభివృద్ధి సాధించడంతో విశాఖ ఈ స్థాయికి వచ్చింది. మీ విజన్ ప్రణాళిక ఆ మూడు రంగాల అభివృద్ధి గురించి ప్రస్తావించనే లేదంటే, ఆ ప్రణాళిక విలువ ఏమిటో ప్రజలకు అర్థమవుతుంది,:అని ఆయన అన్నారు.

విశాఖ నగరంలో ఇంతవరకు అయిన ప్రగతి గురించి, జనాభా గురించి, మీ ప్రణాళిక సగర్వంగా ప్రస్తావించింది. కాని, నగరంలో పుట్టగొడుగులు లాగ రోజు రోజు నిర్మించబడుతున్న భవనాలను, కష్టపడి, కనీస వేతనం కూడా తీసుకోకుండా కడుతూ, నగర ప్రజల దైనందిక కార్యక్రమాలకు సహాయం కలిగిస్తూ, కనీస సౌకర్యాలు కూడా లేని మురికివాడలలో నివసిస్తున్న డెబ్బై లక్షల మందికి పైగా చిన్న కారు ప్రజల పరిస్థితి గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల సౌకర్యం, ఆరోగ్యం ఇతర కనీస సౌకర్యాలు, పిల్లల కోసం పాఠశాలలు కలిగించక పోతే, విశాఖ నగరంలో అభివృద్ధి సాధ్యమవ్వదు,” అని ఆయన లేఖలో పేర్కొన్నారు.


Dr EAS Sarma IAS (Rtd)


అలాగే, తీరప్రాంతంలో సాంప్రదాయ మత్స్యకారుల పరిస్థితి మెరుగు పరచవలసిన అవసరం ఉందని చెబుతూ రోజు రోజు అతి క్లిష్ట పరిస్థితుల్లో వేటకు వెళ్లి, వారు సేకరించే మత్స్య సంపద, మన రాష్ట్ర ప్రజలే కాకుండా, దేశంలో బెంగాల్, అస్సాం వంటి ఇతర ప్రాంతాల ప్రజలు కూడా అనుభవిస్తున్నారనే విషయం గుర్తించాలని డాక్టర్ ఇఎఎస్ శర్మ సూచించారు

మత్స్య కారులకు తీరప్రాంతంలో హక్కులను కలిగించే చట్టాన్ని ప్రవేశపెట్టి, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (CRZ) నిబంధనల సహాయంతో తీరప్రాంతంలో కట్టడాల మీద, కాలుష్యం మీద నియంత్రణ చేయడం అవసరం. వారి ఉపాధులను మెరుగు చేసి, వారికి కావలసిన సౌకర్యాలను చేకుర్చాలి. పరిశ్రమల కారిడార్ ముసుగులో, వారిని నిర్వాసితులు చేస్తే, నగరానికి ప్రయోజనం ఉండదు,”అని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా, వ్యవసాయరంగంలో, చిన్నకారు రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వారి భూములను పరిరక్షించి, వారికి కావలసిన సౌకర్యాలను చేకూర్చినప్పుడే, నగర ఆహార భద్రత సాధ్యమవుతుందని డాక్టర్ శర్మ అభిప్రాయపడ్డారు.

“విశాఖ చుట్టూ ఉన్న గ్రామాలలో పాడి పరిశ్రమ మీద లక్షలాదిమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. యూరప్ లో డెన్మార్క్ వంటి అత్యంత ధనిక దేశాల ప్రగతికి కారణం, అక్కడి ప్రభుత్వాలు పాడి పరిశ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం. అటువంటి పాడి పరిశ్రమ ఉన్న మన గ్రామాలలో, ప్రజలకు కావలసిన సహాయం అందించడం బదులు, కాలుష్యం, ప్రమాదాలతో కూడిన పరిశ్రమల కారిడార్ కోసం వారిని నిర్వాసితులు చేయడం ఎంతవరకు సబబు?,” అని ఆయన ప్రశ్నించారు.

విశాఖ నగరం చుట్టుపక్కల, ఆలోచనా రహితంగా కాలుష్యం కలిగించే పరిశ్రమలకు అనుమతిస్తున్నారని చెబుతూ ప్రజల కోసం ఉద్దేశించిన నీటిని, వాటికి తరలించడం వల్ల, నీటి సమస్య వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

“పైగా పరిశ్రమల వలన, నగరంలో ప్రతి రోజు వస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసే సౌకర్యాలు లేకపోవడం వలన జలవనరులు కాలుష్యానికి గురి అవుతున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ (CPCB) వారు విశాఖ పారిశ్రామిక ప్రాంతాన్ని దేశంలో అత్యధికంగా కాలుష్యం కలిగిస్తున్న ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించారు. త్రాగే నీటిలో, పీల్చే గాలిలో, తింటున్న కూరగాయలలో, మాంసాహారంలో విస్తృతంగా విష కాలుష్య పదార్థాలు ప్రవేశించడం వలన ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతున్నది. అటువంటి సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు మీ విజన్ (Vision) లేవు. అవి లేనపుడు ప్రణాళిక ఎలా ఉపయోగపడుతుంది?,” అని అన్నారు.

ఎవరికి ప్రయోజనం, ఎవరి నష్టం

విశాఖలో పెద్ద ఎత్తున కార్యాలయాలు నిర్మించడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూకబ్జాదారులకు మాత్రమే లాభం కలుగుతుందని ఆయన నిర్ద్వంద్వంగా చెప్పారు.

“భూముల ధరలు పెరిగి చిన్నకారు కుటుంబాలకు హాని కలుగుతుంది. ఆస్తి పన్నులు పెరిగి సామాన్య ప్రజలకు నష్టం కలుగుతుంది. ప్రభుత్వ విధానాల్లో వికేంద్రీకరణ, ప్రభుత్వంలో జవాబుదారీతనం, ప్రజల దృష్ట్యా కావలసిన సౌకర్యాలు రానంతవరకు ఇటువంటి విజన్ ప్రణాళికల వలన ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు,” అని ఆయన అన్నారు.

విశాఖ ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా, ఎటువంటి ప్రణాళికలను చేసినా ప్రజల నిధులను వ్యర్థం చేయడం అవుతుందని ఆయన జగన్ కు గుర్తు చేశారు.

విశాఖ ప్రజల భూములను కబ్జా చేస్తూ, ఇక్కడి ప్రకృతి వనరులకు, హెరిటేజ్ వనరులకు హాని కలిగిస్తున్న నేతల పన్నాగాలను ఆపాల్సిన అవసరం ఉందని చెబుతూ ప్రజల సమస్యలను, వారి అవసరాలను విస్మరించే ప్రభుత్వాలు ముందుకు పోవడం సాధ్యం కాదని గుర్తించాలి ఆయన పేర్కొన్నారు.


Read More
Next Story