ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మరో సారి కడప జిల్లా టూర్‌ చేస్తారా? అటవీ భూములపై పర్యటన చేస్తారా?


ఆంధ్రప్రదేశ్‌లో అటవీ భూములను పరిరక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నడుం బిగించారు. ఆక్రమణకు గురైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని, వాటిని పరిరక్షించే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అందులో భాగంగా తొలుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద ఫోకస్‌ పెట్టారు. పల్నాడు జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సరస్వతీ పవర్‌ ప్లాంట్‌కు సంబంధించిన భూముల్లో అటవీ భూములు కూడా ఉన్నాయని పెద్ద ఎత్తున పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు గుప్పించారు. దీనికి సంబందించిన విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించిన పవన్‌ కల్యాణ్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఆరోపణలు చేసిందే తడువుగా ఆయనే స్వయంగా ఆ ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. సరస్వతీ పవర్‌ ప్లాంట్‌ ఉన్న మాచవరం, దాచేపల్లి మండలాల్లోని పలు

ప్రాంతాలను పర్యటించారు. అక్కడ భూములిచ్చిన ప్రజలతో సమావేశం అయ్యారు. బాంబులు, తుపాకులతో జగన్‌ మనుషులు బెదిరించి లాక్కున్నారని పవన్‌ కల్యాణ్‌ స్వయంగా వ్యాఖ్యలు చేశారు. అటవీ భూములను కూడా ఆక్రమించారని విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే చివరకి 28 ఎకరాల అసైన్డ్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో పాటుగా మరో మూడు ఎకరాల వరకు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. అయితే ఇక్కడ అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు నిగ్గు తేల్చలేక పోయారు. ఇక్కడ 3 ఎకరాలు మ్రాతమే ప్రభుత్వ భూమి. తక్కిన 28 ఎకరాలు ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూమి. అయితే వారే సరస్వతీ పవర్‌ ప్లాంట్‌కు విక్రయించారు. ఆ మేరకు రిజిస్ట్రేషన్‌లు కూడా చేసుకున్నారు. అయినా ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
అదేవిధంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపైకి దృష్టి పెట్టారు. సజ్జల కుటుంబం అటవీ భూములను ఆక్రమించారని, ఎంత భూమిని ఆక్రమించారో నిగ్గు తేల్చాలని కడప జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కడప జిల్లాలో సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలో సీకే దిన్నె రెవిన్యూ పరిధిలోని 1599, 1600/1,2, 1601/1,1ఏ, 2తో పాటు అనేక సర్వే నంబర్లలోని భూములు ఉండగా, వాటిల్లో 42 ఎకరాల మరకు అటవీ భూములు కలిపేసుకుని, ఆక్రమించుకున్నారని సమాచారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపి నివేదిక ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ కడప జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఇలా సజ్జల కుటుంబం మొత్తం ఎంత మేకరకు అటవీ భూములను ఆక్రమించుకున్నారు? అవి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయి? వాటి వల్ల వన్యప్రాణులకు, అటవీ జంతువులకు ఏమైనా హాని కలిగిందా? తదితర అంశాలను ప్రాతిపదికగా చేసుకొని సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆక్రమణలకు పాల్పడిన వారిపైన అటవీ భూముల సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేకు సజ్జల భూములపై విచారణకు కడప జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా అటవీ భూములు ఆక్రమించారని, అసైన్డ్‌ భూములు లాక్కున్నారని ఆరోపించి, ఆ ప్రాంతాలకు వెళ్లి పర్యటించిన పవన్‌ కల్యాణ్, ఈ సారి కడప జిల్లాకు వెళ్లి సజ్జల భూముల పర్యటన చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Next Story