ఈసీ పనితీరుపై సజ్జల అనుమానాలు..
x

ఈసీ పనితీరుపై సజ్జల అనుమానాలు..

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఈసీ తీరుపై ఆంధ్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు.


మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా దీనిపై ఆంధ్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈసీని పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. తమ పార్టీ నేత పిన్నెల్లిని టార్గెట్ చేసి ఈ వీడియోను విడుదల చేశారని ఆరోపించారు. ఆ విడియోపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, అసలు ఈ వీడియో లీక్ ఎలా అయిందని ప్రశ్నించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం స్పందించాలని, పిన్నెల్లి వీడియోను ఎవరు లీక్ చేశారు? వాళ్లకు ఆ వీడియో ఎలా చేరింది? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు.

వీడియో నిజమైందేనా?

‘‘పిన్నెల్లి.. ఈవీఎంను ధ్వంసం చేసినట్లు విడుదలైన వీడియో నిజమైనేదనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా? అసలు అది ఒరిజినల్ వీడియోనేనా? ఈ విషయాన్ని ఎవరు నిర్దారిస్తారు? ఈ నిర్ధారణ జరగకుండా ఎన్నికల సంఘం ఎలా చర్యలు తీసుకుంటుంది? ఒకవేళ వీడియో నిజమే అయితే అది సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది? పోలింగ్ కేంద్రం వెబ్ క్యాస్టింగ్ వీడియోలను ఈసీ భద్రత పరచాలి కదా? అది ఎలా బయటకొచ్చింది?’’ అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

ఒక్క వీడియోనే ఎందుకు?

పోలింగ్ రోజు పలు పోలింగ్ కేంద్రాల్లో విధ్వంస చర్యలు జరిగాయని ఎన్నికల సంఘం అధికారులే చెప్తున్నారని సజ్జల గుర్తు చేశారు. ‘‘ఏడు ప్రాంతాల్లో ఘటనలు జరిగాయని ఈసీ చెప్తుంది. అలాంటప్పుడు వాటన్నింటికిలోకి పిన్నెల్లి వీడియో మాత్రమే ఎలా లీక్ అయింది? ఈసీకి చిత్తశుద్ది ఉంటే మొత్తం ఏడు వీడియోలను బయటపెట్టాలి. అలా ఎందుకు చేయట్లేదు. ఆ ఆరుచోట్ల జరిగిన ఘటనలను ఎందుకు దాచిపెడుతోంది?’’ అంటూ ఈసీ పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. సజ్జల వ్యాఖ్యలు ఈసీ కావాలనే పిన్నెల్లిని టార్గెట్ చేస్తుందా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి.

ఏం జరిగిందో అప్పుడే తెలుస్తుంది?

పోలింగ్ జరిగిన మొత్తం ఏడు ఘటనలకు జరిగిన వీడియోలు బయటకు వస్తేనే అసలు ఏం జరిగింది అనేది తేటతెల్లం అవుతుందని సజ్జల తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి కానీ వారిని గుర్తించడానికి కానీ ఎన్నికల సంఘం ప్రయత్నించడం లేదు. ఈ విషయంలో ఈసీ పద్దతి అపసక్రమంగా ఉంది. ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు వీడియోలు చూస్తే అందరికీ తేలిపోతుంది. కానీ వారి మీద ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోదు. ఆ ఘటనలు జరిగినట్లుగా కూడా గుర్తించడం లేదు. ఆ దాడుల వెనుకున్న వారిని ఈసీ ఎందుకు పట్టుకోవట్లేదు?’’ అని సజ్జల నిలదీశారు.

అంత ఆలస్యం ఎందుకు?

‘‘ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన ఘటన మే 13న జరిగితే దానికి సంబంధించిన వీడియో 21వ తేదీ వరకు ఎందుకు బయటకు రాలేదు? గుర్తు తెలియని వ్యక్తులు ఎలా ఫిర్యాదు చేశారు? ఈ నెల 20న ఫిర్యాదు నమోదయిందని ఈసీ చెప్తుంది. అంటే ఇంతకాలం పాటు ఆ వీడియోను సీఈఓ చూడలేదా. చూసినా ఫిర్యాదు కోసం ఆగారా. ఫిర్యాదు కోసం ఆగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇంతకాలం ఈ వీడియోపై ఈసీ చర్యలు ఎందుకు తీసుకోలేదు. ఇప్పుడే ఇంత యాక్టివ్ ఎందుకయింది?’’ అంటూ ఈసీపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Read More
Next Story