ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులను జీతాలుగా తీసుకుంటూ కొందరు ప్రభుత్వ సలహాదారులు రాజకీయ సభలు, సమావేశాలకు హాజరు కావడమే కాకుండా ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడడాన్ని సవాల్ చేస్తూ ప్రతిపక్ష కూటమి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిబంధలన మేరకు ప్రభుత్వ సొమ్మును జీతాలుగా తీసుకొంటూ సలహాదారులుగా వ్యహరిస్తున్న వారు రాజకీయాలను మాట్లాడేందుకు వీల్లేదని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న సలహాదారులు కానీ, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నాయకులు కానీ మాట్లాడేందుకు వీల్లేకుండా పోయింది.
సీఎం గొంతుకగా సజ్జల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా వాటిని తిప్పి కొట్టేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. సీఎం సూచన, సలహా మేరకు ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడం పనిగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన సందర్భాలు లేవు. ముఖ్యమంత్రి ఏమి చెప్పాలనుకుంటున్నారో, ఏ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నారో ఆ విషయాలను మీడియా ద్వారా నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి వివరించే వారు. అవసరమనుకున్నప్పుడు మరి కొందరు మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో వివరించే వారు. ప్రధానంగా రాజకీయ విమర్శలను తిప్పి కొట్టేటప్పుడు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర మంత్రులతో కలిసి ప్రతిపక్షాలపై విమర్శలు చేసేవారు.
ఎన్నికల కమిషన్ నిబంధనలతో ప్రతిపక్షాలను విమర్శించే అవకాశం సజ్జల రామకృష్ణారెడ్డికి లేకుండా పోయింది. దీంతో ముఖ్యమంత్రి సూచన మేరకు తన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసి ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అదే బాటలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పయనించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వైఎస్‌ఆర్‌కు అత్యంత సన్నిహితుడు
ఈయన సీనియర్ పాత్రికేయుడు. మొదటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు. ఇద్దరూ ఒక ప్రాంతపు వాసులు కావడంతో వీరిద్దరికీ మంచి అనుబంధం ఉంది. ఆయన సీఎం అయ్యాక సాక్షి దిన పత్రికను ఏర్పాటు చేయడంలో సజ్జల కీలక పాత్ర పోషించారు. అన్నీ తానై ముందుండి నడిపించారు. పత్రిక ఎక్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చాలా కాలం పని చేశారు. అంతకు ముందు ఉదయం, ఈనాడు పత్రికల్లో కూడా ఆయన జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వహించారు. సాక్షి మీడియా గ్రూపులో సాక్షి టీవీ చానల్ ప్రారంభానికి సంబంధించి కూడా పూర్తి బాధ్యతలు తనపై వేసుకున్నారు. సాక్షికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడూ సాక్షి చైర్మన్‌గా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరిస్తూ వచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి స్థాయిలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ పగ్గాలు చేపట్టి చైర్మన్ బాధ్యతలను ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డికి అప్పగించారు.
జగన్‌కు రాజకీయ సలహాదారుగా
ఈ నేపథ్యంలో అప్పటి వరకు సాక్షి బాధ్యతలు చూస్తూ వచ్చిన సజ్జల వాటి నుంచి తప్పుకొని వైఎస్‌ఆర్‌సీపీ బాధ్యతలను స్వీకరించారు. ఆ పార్టీ పొలిటికల్ సలహాదారుగా ఉంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తగిన సూచలను, సలహాలు ఇస్తూ వచ్చారు.
తర్వాత 2019లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆయన ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుగా ఉన్నారు. ముఖ్యమంత్రి తరఫున ప్రతిపక్షాలను ఎదుర్కొనే బాధ్యతలను సజ్జల తీసుకున్నారు. ఇప్పటి వరకు «ధీటుగానే ప్రతిపక్షాలకు సమాధానం చెబుతూ వచ్చారు. ఎప్పుడైతే సలహాదారులపై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించిందో అప్పుడే సలహాదారు పదవికి రాజీనామా చేయాలని నిర్ణాయనికి వచ్చినట్లు సమాచారం. అయితే సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, ఇక ప్రతిపక్ష పార్టీలపై ఎదురు దాడికి సిద్ధమయ్యారని సమాచారం. ఇదే విషయంపై క్లారిటీ తీసుకునందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని ఫోన్ ద్వారా ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి సంప్రదించగా ఆయన నుంచి స్పందన లభించ లేదు.
Next Story