'సాక్షి' నుంచి రాణి రెడ్డి డిస్మిస్! అదే దారిలో మరికొందరు?
వైసీపీలోని గందరగోళం సాక్షి మీడియానూ తాకినట్టు కనిపిస్తోంది. టాప్ ఎగ్జిక్యూటివ్ లను తప్పించి మీడియాను దారిన పెట్టేందుకు భారతీరెడ్డి చర్యలు ప్రారంభించారంటున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన మీడియాలోనూ లుకలుకలు ప్రారంభమయ్యాయి. నిన్నటి వరకు మహారాణిగా వెలుగొందిన రాణి రెడ్డిని జగతి పబ్లికేషన్స్ నుంచి తొలగించారు. ఇవాళో రేపో హెచ్.ఆర్. జనరల్ మేనేజర్ గా ఉన్న మరో వ్యక్తికి కూడా ఉద్వాసన పలుకుతారని వినపడుతోంది. ఒకప్పుడు సాక్షి గ్రూపుకి ఫైనాన్షియల్ మేనేజర్ గా వ్యవహరించి రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి ఇప్పటికే రిటైర్‌మెంట్ ప్రకటించి వైసీపీలో గందరగోళం సృష్టించారు. ఇప్పుడు సాక్షి మీడియా గ్రూపులోనూ ఆధిపత్య పోరు, ముఠాల కుమ్ములాటలు తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది.
ఆమధ్య సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి తప్పుకున్నప్పుడు సైతం కరపత్రాల యుద్ధం నడిచింది. కొత్తగా ఎడిటర్ గా వచ్చిన ఆర్.ధనుంజయ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దఎత్తున కరపత్రాలు పంచిన వ్యవహారంలో స్టేట్ బ్యూరోలోని ఓ సీనియర్ రిపోర్టర్ తల ఎగిరిపోయింది. దీనిపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కావడం, దానిపై సుదీర్ఘ విచారణ జరగడం, ఈ కరపత్రం ఎవరు సృష్టించారు, ఎవరు వేయమంటే వేశారు అనే ప్రశ్నలకు సమాధానం రాకుండానే ఆ రిపోర్టర్ రాజీనామా చేసినట్టు సమాచారం. ఆ వ్యవహారంలో దోషులెవరో తేలకముందే సాక్షి మీడియాలో మరో పెద్దతలకాయ (రాణిరెడ్డి) ఎగిరింది. తాజాగా జగతి గ్రూపు ఛైర్మన్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డి తరపున ప్రతినిధిగా వ్యవహరించిన రాణి రెడ్డి అనే టాప్ ఎగ్జిక్యూటివ్ ను తొలగించారు. చాలా కాలంగా ఆమెను తొలగిస్తారని ప్రచారం నడుస్తున్నా ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఆమెను ఇంటికి పంపినట్టు సాక్షి వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి రాణిరెడ్డికి జర్నలిజంతో ఏమాత్రం సంబంధం లేదు. సాక్షి టీవీని లాంచ్ చేసినపుడు ఆమె ఓ ఈవెంట్ మేనేజర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత సాక్షి అడ్వర్టైజ్మెంట్ విభాగం వారితో ఆమెకున్న పరిచయాలతో జగతి పబ్లికేషన్స్ లో ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత ఆమెను ఆపడం ఎవరి తరమూ కాలేదు. భారతి రెడ్డితో పెరిగిన సాన్నిహిత్యం కాస్తా ఆ తర్వాత బంధువుని, ఫ్రెండ్ అనేదాకా వెళ్లింది. ఆమె హవాను చూసి చాలా మంది అది నిజమే కాబోలనుకున్నారు. రాణి రెడ్డి ఓ రేంజ్ లో సాక్షి మీడియాపై పెత్తనం చేశారు. టీవీలో కాకుండా సాక్షి పేపర్లోనూ ఆమెకు ఎదురులేకుండా పోయింది. ఆమె చెప్పిందే వేదంగా నడిచింది. కార్పొరేట్ వ్యవహారాలలో దిట్ట అయిన రాణిరెడ్డి ఇదే అదునుగా సాక్షిలో తనకంటూ ఓ వర్గాన్ని క్రియేట్ చేసుకుని అటు యాజమాన్యాన్నీ ఇటు సిబ్బందిని ఓ ఆటాడించించారు. ఇష్టం లేని వారిని సాగనంపడంలో ఆమెకు ప్రత్యేకమైన వ్యూహాలు ఉండేవి. అలాగే ఉద్యోగాలు ఇచ్చేటపుడు కూడా వాటిని పాటించేవారు. ఎవరైనా పార్టీ పెద్దలు ఉద్యోగాల కోసం సిఫార్సు చేస్తే ఆమె అనుసరించే వ్యూహం భలే గమ్మత్తుగా ఉంటుందని ఓ ఉద్యోగి చెప్పారు. అదెలాగంటే.. సదరు క్యాండిడేట్ కి ఈమే నేరుగా ఫోన్ చేసి పలానా వ్యక్తి మిమ్మల్ని సిఫార్సు చేశారు, మీరొకసారి ఆఫీసుకు రండని చెబుతారు. ఇలా తొలిసారి కలిశాక ఆమె మరెప్పుడూ ఫోన్ ఎత్తదు, ఉద్యోగం ఇవ్వదు, అది వస్తుందన్న ఆశతో సదరు అభ్యర్థి ఎదురుచూస్తూ మర్చిపోవాల్సిందేనని నెల్లూరు కు చెందిన ఓ క్యాండిడేట్ చెప్పడం గమనార్హం. ఈమె బారిన పడిన వాళ్లలో ఎక్కువ మంది ఎస్సీ, బీసీల ఉద్యోగులేనని కూడా ఆయన ముక్తాయించారు. ఓ పథకం ప్రకారం మాట వినని వాళ్లని బయటకు పంపిస్తుందట. అందుకే అంతా ఆమె చెప్పినట్లుగా వినేవారు. ఆమెపై ఎవరైనా ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకునేది కాదు.
అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత భారతీరెడ్డి సాక్షిని సంస్కరించే పనికి పూనుకున్నా అది ఆమె చేతుల్లో లేకుండా పోయింది. రాణి రెడ్డిని తొలగిస్తారని ఏడాదిగా సాగుతున్న ప్రచారానికి ఇప్పుడు ముగింపు పలికారు.
జర్నలిజంతో సంబంధం లేని రాణిరెడ్డి లాంటి వ్యక్తులు అసలు ఇంతకాలం ఆ సంస్థలో కొనసాగడమే గ్రేట్. లక్షల్లో జీతాలు తీసుకుంటా సరదాగా ఎంజాయ్ చేసిన బ్యాచీలో రాణిరెడ్డి ఒక్కరు. అలాంటి వాళ్లు అనేకమంది పేడపురుగుల్లాగా ఆ సంస్థను అంటిపెట్టుకున్న వాళ్లు ఉన్నారని సాక్షి సిబ్బంది వాపోతోంది. రాణిరెడ్డిని ఇప్పటికిప్పుడు పక్కన బెట్టడానికి ఏదో కారణం చెబుతున్నారు గాని అది నిజం కాకపోవచ్చు. చంపాలనుకున్నప్పుడు పిచ్చికుక్కని ముద్రవేయడం ఎంత సహజమో- ఇటీవల పేపర్లో వచ్చిన టీడీపీ కోటి సభ్యత్వాల ప్రకటన కూడా- అంతే కారణం. టీడీపీకి ఆమె అమ్ముడు పోయి ఈ ప్రకటనను అనుమతించారని మాట వరసకు అనుకున్నా ఆ ప్రకటన ముద్రణ అయ్యే వరకు వివిధ దశలు ఉంటాయి. చాలా దశలు దాటి ఆ యాడ్ రావాల్సి ఉంటుంది. నిజమేంటో వారికే తెలియాలి. ఏదైతేనేం సాక్షిలో సంస్కరణలు జరిగితే అదే పది వేలని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story