
15 ఏళ్ల తర్వాత శ్యామలాంబ అమ్మవారి పండగ
నవ వసంతాలకోసారి సాలూరు శ్యామలాంబ జాతర
సాలూరు.. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న పట్టణం. ఈ పట్టణంలో ఐదు శతాబ్దాల క్రితం వెలసిన శ్రీశ్యామలాంబ అమ్మవారు.. ఉత్తరాంధ్రకే కాదు.. పొరుగున ఉన్న ఒడిశా వాసులు కొంగుబంగారంగా వెలుగొందుతున్నారు. ఏ ఊళ్లోనైనా, పట్టణం/నగరంలోనైనా దేవుళ్లు, దేవతలకు ఏటా ఉత్సవాలు జరపడం రివాజు. కానీ ఈ శ్యామలాంబ అమ్మవారికి తొమ్మిదేళ్లకోసారి మాత్రమే అరుదుగా పండగ జరుగుతుంది. అందుకే ఈ గ్రామదేవత ఉత్సవానికి భక్తులు తొమ్మిదేళ్ల పాటు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఏడాది ముందు నుంచే అమ్మవారి జాతర గురించే చర్చించుకుంటారు. తమ బంధుగణాన్ని ఆహ్వానిస్తారు. ఆ పండగ రాగానే పరవశించి పోతారు.
సాలూరు శ్యామలాంబ అమ్మవారు
ఉద్దేశంతో అప్పట్లో
గతంలో 2010 మే నెలలో సాలూరు శ్యామలాంబ పండగ జరిగింది. ఆనవాయితీ ప్రకారం 2019 మేలో ఈ ఉత్సవం జరగాల్సి ఉంది. అయితే ఆ ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికలుంటాయన్న (కానీ ఏప్రిల్లోనే జరిగాయి జాతర నిర్వహించలేదు. ఆ తదుపరి రెండేళ్లు కోవిడ్ ఉత్సవం జరపలేదు. 2024లో ఉత్సవ నిర్వహణకు సిద్ధమైనా మళ్లీ ఎన్నికలొచ్చాయి. దీంతో ఈ ఏడాది మే 18, 19, 20, 21 తేదీల్లో శ్యామలాంబ ఉత్సవాలు జరపాలని గత ఏడాదే నిర్ణయించారు. అంటే పదిహేనేళ్ల తర్వాత జరగుతున్న అమ్మవారి పండగను అంగరంగ వైభవంగా నిర్వహించాలని గ్రామస్తులు, అధికార యంత్రాంగం నిశ్చయించారు. అందుకనుగుణంగా 18న ఉయ్యాల కంబాల, 19న తొలేళ్లు, 20న ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం, 21న అనుపోత్సవాలను నిర్వహిస్తున్నారు.
జాతరలో 75 అడుగుల వీరభద్రుని ప్రభ శ్యామలాంబ
అంతేకాదు.. 18న వీరద్రుని ప్రభ (75 అడుగులు), 19న పులివేషాలు, అఘోనా నృత్యాలు, తొలేళ్ల ఉత్సవం, 20న ఉదయం పాలంగి, గోవింద, కాళికామాత నృత్యాలు, కేరళ వాయిద్యాలతో పాటు సాయంత్రం నాలుగ్గంటలకు ప్రతిష్టాత్మక సిరిమానోత్సవాలు నిర్వహించారు. సిరిమానోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు హాజరై పరవశులయ్యారు. ఇసుకేస్తే రాలనంతగా భక్తులతో పట్టణ వీధులు పోటెత్తాయి. ఈ మూడు రోజులు 15 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు అంచనా.
అమ్మవారి సిరిమానోత్సవం
పిండివంటలు, కొత్త దుస్తులు..
ఇక తమ ఆరాధ్య గ్రామదేవత శ్యామలాంబ పండగకు సాలూరులోని ప్రతి ఇంటా పండగ సందడే. కూతుళ్లు, అల్లుళ్లు, కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో పాటు ఎక్కడెక్కడో ఉన్న చుట్టాలు, బంధువులు తరలి వస్తారు. ఈ పండగకు కొత్త దుస్తులు తాము ధరించడమే కాక, అల్లుళ్లు, కూతుళ్లకు, పిల్లలకు కొత్త బట్టలు పెడతారు. అంతేకాదు.. నోరూరించే రకరకాల పిండివంటలను వండుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి వీటిని ఆరగిస్తారు.
సిరిమానోత్సవాలు ఎక్కడంటే?
ఉత్తరాంధ్రలో అమ్మవార్లకు సిరిమానోత్సవాలు జరుగుతుంటాయి ప్రధానమైంది విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం. ఇంకా పార్వతీపురం మన్యం జిల్లా శంబర పోలమాంబ, సాలూరు శ్యామలాంబ అమ్మవార్లకు సిరిమానోత్సవాలు జరుగుతుంటాయి. ఇదీ సాలూరు శ్యామలాంబ చరిత్ర..
సాలూరు శ్యామలాంబ చరిత్రను పరిశీలిస్తే..
ప్రస్తుత సాలూరు పట్టణం పూర్వం సరేవలస అనే పేరుతో పిలిచేవారు. 500 ఏళ్లకు ముందు ఈ గ్రామంలో అల్లు వారి కుటుంబీకులు ఎడ్ల బండ్లపై ఉప్పు తీసుకొచ్చి వర్తకులకు అమ్మేవారు. వీరు ఒకరోజు ఉప్పు తీసుకుని రావడం కోసం ఎడ్ల బండిపై రాజమండ్రి వెళ్లారు. బండిపై ఉప్పు నింపుకుని తెల్లవారుజామున బయల్దేరే సమయంలో ఒక ఎద్దు కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా కనిపించలేదు. ఆ సమయంలో ఓ బాలిక స్వరంతో 'నేనున్నాను. మీకేం భయం లేదు.. ఒంటెద్దుతోనే సాలూరు వెళ్లండి.. ఏ ఇబ్బందులొచ్చినా నేను చూసుకుంటాను' అని చెప్పింది. మాకు కనిపించకుండా మాట్లాడుతున్నారు? మీరెవరమ్మా? అని అడగ్గా నేనెవరో తర్వాత చెబుతాను.. త్వరగా బయల్దేరండి.. అని చెప్పింది. ఆమె మాట ప్రకారం ఒంటెద్దుతోనే సాలూరు చేరుకున్నారు షికారుగంజి గ్రామంలో కొందరు గాజుల వ్యాపారం నిమిత్తం ఊరూరా తిరగేవారు. అందులో ఒక వ్యాపారి సాలూరు వచ్చారు. ఒకనాడు సాలూరు నాయుడువీధి, అల్లు వీధుల్లో గాజులు గాజులు అంటూ నడుస్తుండగా ఒక ఇంట్లో నుంచి ఓ అమ్మాయి 'ఏయ్.. గాజులాయనా? మా ఇంటికి రా.. నాకు గాజులు వెయ్యి.. నేను చిన్న పిల్లను కాబట్టి మా తల్లిదండ్రులు నన్ను ఇంట్లో ఉంచి తలుపులకు
తాళాలేసుకుని బయటకు వెళ్లిపోయారు' అంటూ కిటికలోంచి రెండు చేతులూ బయట పెట్టింది. గాజులాయన ఆమెకు గాజులు వేయడం మొదలుపెట్టాడు. ఇలా తనవద్ద ఉన్న గాజులన్నీ ఆమెకు వేశాడు. అనంతరం ఆమెను డబ్బులు అడగ్గా.. 'నేను చిన్నపిల్లను కావడం వల్ల మా అమ్మానాన్నలు నా దగ్గర డబ్బులుంచ లేదు. సాయంత్రం రా' అని చెప్పడంతో వెళ్లిపోయి సాయంత్రం వచ్చాడు. ఆ ఇంట్లో వారితో బాలికకు గాజులు వేసిన విషయాన్ని చెప్పాడు. ఆ వ్యాపారి మాటలకు ఆ తల్లిదండ్రులు పగలబడి నవ్వుతూ మాకు ఆడపల్లలే లేరు.. మీరు ఏ ఇంటిని చూసి పొరబడినట్టున్నారు.. అని చెప్పారు. కాదు కాదు.. ఇదిగో ఈ కటికీ నుంచే పాపకు గాజులేశాను.. నన్ను నమ్మండి.. అంటుండగా ఇంట్లోని మిద్దెపై నుంచి గట్టి శబ్ధంతో గాజులు కిందపడ్డాయి. దీంతో వారు భయంతో వణికిపోయారు. ఎవరు తల్లీ నువ్వు అంటూ గాజులనుద్దేశించి ప్రశ్నించగా.. 'నేను మీ ఇంటి ఆడపిల్లగా వచ్చాను. నన్ను కూతురిలా చూసుకోండి' అని అదృశ్య రూపంలో చెప్పింది.
పురవీధుల్లో భక్తజన జాతర
ఈ విషయాన్ని గ్రామ పరిపాలన చేస్తున్న రాజు, మునసబు, గ్రామ పెద్దలతో చెప్పడంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం జరుగుతుండగా 'నేను అల్లు వారింట ఆడపిల్లగా ఉంటాను. సాలూరులో పడమర దిశలో గుడి కట్టించి పండగ చేయండి. ఈ గ్రామాలకు ఎలాంటి ఈతిబాధలు, కరువు కాటకాలు, విపత్తులు రాకుండా చూసుకుంటాను. నాతో పాటు నా అక్కచెల్లెలకు కూడా పండగలు చేయండి. నా సేవ కోసం షరాబులు, మంగళ్లు సిరిమాను తయారీ అంజలి రథం నిమిత్తం కొలువుకు జన్ని వారిని ప్రతి పనికి ఏర్పాటు చేయండి' అని చెప్పి అంతర్థానమైంది. అమ్మవారి కోరిక మేరకు పడమర దిశలో చిన్న గుడి కట్టించి జన్ని వారితో నిత్య దీపారాధన చేయిస్తున్నారు. శ్యామలాంబ అమ్మవారితో పాటు జాతరకు ముందు దేశమ్మ తల్లి, బంగారమ్మ తల్లి, కుండల పోలమ్మ, పరదేశమ్మ, ముత్యాలమ్మలకు ముడుపులు, మొక్కుబడులు చెల్లిస్తూ తదుపరి కొత్తమ్మ తల్లి పండగ చేస్తారు. ఇలా ఎనిమిదేళ్ల తర్వాత తొమ్మిదేళ్లకోసారి శ్యామలాంబ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్యామలాంబ..
ఉపాధ్యాయిని శ్యామల
ఈ ‘మాది సాలూరు. సాలూరులోనే చదువుకుని ఇక్కడే కొన్నాళ్లు టీచరుగా ఉద్యోగం చేశాను. ఐదు శతాబ్దాలుగా శ్యామలాంబ అమ్మవారు విశేష పూజలందుకుంటున్నారు. భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. ఊరికి కాదు ఈ ప్రాంతానికే ఎలాంటి విపత్తులు రాకుండా కాపాడుతున్నారు. ఇతర దేవతలు, దేవుళు మాదిరిగా కాకుండా ఈ అమ్మవారికి తొమ్మిదేళ్లకోసారి ఉత్సవం జరుగుతుంది. గతసారి 2010లో పండగ జరిగింది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఏడాదే జరుగుతోంది. 2010కంటే ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ మూడు రోజులు సాలూరు పట్టణమంతా సందడే సందడి. విద్యుత్ కాంతులతో వీధులన్నీ ధగధగలాడుతున్నాయి. మళ్లీ ఈ అమ్మవారి పండగ కోసం తొమ్మదేళ్లు ఎదురు చూడాల్సిందే'నని విశాఖపట్నంలో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయిని దుంప శ్యామల 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.