తిరుపతి ‘సంచారి’కి ఈ చిన్న సాయం చేయండి…
x

తిరుపతి ‘సంచారి’కి ఈ చిన్న సాయం చేయండి…

తిరుపతి కేంద్రంగా ఉన్న సంచారి స్వచ్చంద సంస్థ ఒక సాయం కోరుతోంది. అది డబ్బు, విరాళాలు కాదు. మరేంటంటే..


‘‘తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న సంచారి స్వచ్ఛంద సంస్థ మిమ్నలందరిని ఒక సాయంకోరుతోంది. మీరెవరూ ఈ సంస్థకు నగదు విరాళం గాని, వస్తు రూపదానం గాని చేయాల్సిన పనిలేదు. మన చుట్టూ చాలా సంచార జాతులున్నాయి. వీళ్లని డినోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు. వీళ్లెవరైనా మీ కంటపడ్డప్పుడు వాళ్ల ఆడపిల్లలను గుర్తించండి. ఈ పాపలకు చదువు చెప్పేందుకు సంచారి ముందుకు వస్తున్నది. చదువుకోసం ఎక్కడికో వారిని పంపనవసరం లేదు. వాళ్లకి స్థానికంగా అక్షరాభ్యాసం చేయించే పనిని ‘సంచారి’ చేస్తుంది. అయితే, బాలికలు అయిదు నుంచి ఏడు సంవత్సరాలోపు వారై ఉండాలి. వాళ్లకి ప్రాథమిక విద్య నేర్పించి, ఏడో సంవత్సరం చివరన మండల విద్యాధికారి నుంచి ఒక సర్టిఫికెట్ ఇప్పిస్తారు. దీని ఉపయోగించి తల్లిదండ్రులు ఈ పిల్లలను ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతిలో చేర్పించవచ్చు. ఆ తర్వాత వాళ్ల విద్యాభ్యాసం బాధ్యతని ప్రభుత్వం స్వీకరిస్తుంది’’ అని ‘సంచారి’ వ్యవస్థాపకుడు మాజీ ఐఎఎస్ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలలో యానాదులు, నక్కలోళ్లు, గంగిరెద్దుల వాళ్లు, హరిదాసులు, బుడబుక్కలవాళ్లు, ఎరుకల, పూసలోళ్లు, సోది చెపే వాళ్ల వంటి 64 గిరిజన, సంచారా తెగులు ఉన్నట్లు అంచనా. ఇవన్నీ కూడా గిరిజన ఉపజాతులు, ఒకరకంగా ఆశ్రిత కులాలు. ఎరుకల, యానాది కులాల ఇపుడిపుడే కొంత నాగరిక సమాజానికి దగ్గరగా వస్తున్నాయి. దీనికోసం కొన్ని గిరిజన కుల సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ జాతుల్లో కొన్నింటికి ప్రత్యేక మయిన భాషలున్నాయి. వీటిలో చాలా వాటికి లిపి లేదు. గోండి భాషకు జయధీర్ తిరుమలరావు వంటి వారు లిపిని రుపొందించే పని చేస్తున్నారు. ఈ జాతలకు స్థిరాస్థులు ఉండవు. ప్రతిభ ఉన్నా దానిని వ్యాపారంగా మార్చుకోవడమనేది తెలియదు. కొందరు కడుపు నింపుకునేందుకు భిక్షాటన చేస్తుంటారు. చదువు అందని కారణంగానే వీరు అభివృద్ధిలో వెనకబడ్డారని అనిపిస్తుంది. పాత తరాన్ని మనం మార్చలేకపోవచ్చు. ఈ తరం పిల్లలనైనా చదివించే విధంగా వారి తల్లితండ్రులను చైతన్య పరచాలి. ఈ కార్యక్రమాన్ని ‘సంచారి’ చాలా కాలంగా విజయవంతంగా నిర్వహిస్తూ ఉంది. ఇపుడు ప్రజలనుంచి నైతిక సాయం కోరుతూ ఉంది.

“కొందరు బడి ఈడు పిల్లలను గుర్తించి వారి తల్లితండ్రుల అనుమతితో సమీప పాఠశాలల్లో చేర్పించాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబు నగర్ జిల్లా జడ్చర్ల, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, మెదక్ జిల్లా సిద్ధి పేట, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, తిరుపతి, పుత్తూరు, నెల్లూరు జిల్లా నాయుడు పేట, పెంచలకోన వంటి ప్రాంతాలలో గిరిజనులు ఉంటున్నారు. ఈ ప్రాంతాలలో ఇప్పటికే ఈ రంగంలో కృషి చేస్తున్నవారితో కలసి పనిచేస్తున్నాం,” అని డాక్టర్ శ్రీనివాసులు ఫెడరల్- ఆంధ్ర ప్రదేశ్ కు తెలిపారు.

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సంచార జాతుల కోసం తిరుపతి కేంద్రంగా సంచారి సభ్యలు కార్యక్రమాలను ప్రారంభించారు. గిరిజనుల్లో నైతిక బలాన్ని పెంచడం, జన్ ధన్ యోజన అకౌంట్లు వీరికి తెరిపించడం, ఎన్నికల గుర్తింపు కార్డులు ఇప్పించడం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు పొందేలా చూడటం, సొంత ఇల్లు పొందే అవకాశాలు చూపడం, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం, వృత్తి నైపుణ్యాలు పెంచడం, వ్యాపారాల్లో రాణించేలా తీర్చిదిద్దడం ఇవి సంచారి సంస్థ పనులు.

సంచారి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనుకుంటున్నవాళ్లు, ఇతర సాయం అందించాలనుకుంటున్నవాళ్లు సంచారి మొబైల్ నెంబర్ 9948309777 ను సంప్రదించవచ్చని ‘సంచారి’ గుత్తా సురేష్ కోరారు.

Read More
Next Story