ఏపీలో సంక్రాంతి సందర్భంగా జరిగిన కోడి పందేలు జోరుగా సాగాయి. మద్యం ఏరులై పారింది. జూదం ఎప్పుడూ లేని విధంగా జరిగింది.


సంక్రాంతి అనగానే కోడి పందేలు, వివిధ రకాల జూదం ఆటలు, క్యాషినో డ్యాన్స్ లు, రికార్డింగ్ డ్యాన్స్ లు, ఎద్దుల పోటీలు, ఇళ్ల ముందు ముగ్గులు, ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మలు, ఇళ్లలోకి ధాన్యపు రాసులు, కొత్త అల్లుళ్లతో ఇళ్లు కళకళలు, బంధువులతో సందడి... ఒకటేమిటి ప్రతి ఇంట్లోనూ కొత్త కాంతులు. ఆనందాల పరవళ్లు. సంతోషాలు పంచుకోవడాలు, పిండి వంటలు ఒక పక్క చేస్తుంటే మరో పక్క తినటాలు, మూడో రోజైన కనుమ రోజు మాంసంతో చేసిన వంటలు ఇలా మూడు రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి సోభ వెల్లు విరిచింది. ప్రతి ఇంటిలోనూ రంగుల హరివిల్లు వెల్లు విరవడంతో పాటు బావా మరదళ్ల తమాషా సరదాలు కూడా ఎంతో సందడిగా అనిపించింది. ప్రధానంగా ఈ సందడి ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో కనిపించింది. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మిగిలిన రెండు జిల్లాల్లోనూ సంక్రాంతి సందడి కనిపించినా కోడి పందేల జోరు మాత్రం అంతగా లేదు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రతి మండలంలోనూ ఐ నుంచి పది కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు.

కోడి పందేళ్లో ఈ సారి మహిళలు కూడా ఎక్కవే..

ఈ సంవత్సరం జరిగిన సంక్రాంతి సందడిలో మహిళలు ఎక్కువగా సందడి చేశారు. ఎక్కువ మంది యువతులు లంగా ఓణీలు ధరించగా, మహిళలు పట్టు చీరలు కట్టి కోడి పందేల బరుల వద్దకు వచ్చారు. కృష్ణా జిల్లాలో మహిళలే కోడి పందేలు నిర్వహించడంలో ముందున్నారు. ఈ సారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందేలతో పాటు కోతముక్క, మట్కా జూదం జోరుగా సాగింది. సూరంపల్లెలో కోత ముక్క ఆటను మహిళలే నిర్వహించడం చర్చ నియాంశమైంది. పెనుగంచిప్రోలు మామిడి తోటల్లో రాత్రి, పగలు క్యాషినో ఆడించారు. క్యాషినో వద్ద, సూరంపల్లిలోనూ చీర్ గరల్స్ తో సరదాగా డ్యాన్స్ లు వేశారు. డ్యాన్స్ లు వేసేందుకు వచ్చిన యువకుల వద్ద నిర్వాహకులు డబ్బులు దండిగా గుంజారు. ఈ స్థాయిలో మహిళలు బయటకు వచ్చి కోత ముక్క ఆటలు కూడా ఆడించడం చూస్తుంటే ఇప్పటి వరకు వీళ్లు ఎక్కడున్నారని పలువురు ముక్కున వేలేసుకున్నారు. మహిళలు ఎక్కువగా ఉన్న చోట్ల ఫొటోలు తీసే వారి నుంచి సెల్ ఫోన్స్, కెమెరాలు లాక్కుని వారిని సరదాగా ఏడిపించారు. ఆ తరువాత ఎప్పుడో సాయంత్రానికి వారికి తిరిగి ఇచ్చేశారు.

తెలంగాణ నుంచి పది లక్షల మంది...

ఏపీలో సంక్రాంతి సంబరాలు చూసేందుకు తెలంగాణలోని బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కలిపి సుమారు పది లక్షలు పైగానే ఏపీకి వచ్చినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. తెలంగాణ నుంచి వచ్చిన బస్ లు, కార్లు వంటి వాహనాలను లెక్కించి ఈ లెక్క తేల్చారు. అదే విధంగా బెంగుళూరు, చెన్నై, ముంబై ల నుంచి కూడా లక్షల సంఖ్యలో ఏపీలోని సంక్రాంతి సంబరాలు చూసేందుకు వచ్చినట్లు ప్రభుత్వం భావిస్తోంది. అలాగే విదేశాల నుంచి కూడా చాలా మంది గోదావరి జిల్లాల బంధువుల ఇళ్లకు వచ్చారు. కొందరు మహిళలు ప్యాంట్లు వేసుకోగా, మరికొందరు సాంప్రదాయ దుస్తులైన చీరలు, దోవతులు, లంగా ఓణీలు ధరించి సందడి చేశారు. కాలువ గట్లు, సినిమా షూటింగ్ స్పాట్స్ వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున ఫొటోలకు ఫోజు లిచ్చారు. తెలంగాణ నుంచి వచ్చిన వారిలో ఎక్కవ మంది కోడి పందేల జూదంలో పాల్గొని కోట్లు పోగొట్టుకున్న వారు ఉండగా గెలుపొందిన వారు కూడా ఉన్నారు.

ప్రజా ప్రతినిధుల్లో సందడే సందడి

ఏపీలోని ప్రజా ప్రతినిధులు, ప్రధానంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు బాగా సందడి చేశారు. ఇక స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గొదావరి జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల సందడికి హద్దులు లేకుండా పోయాయి. వీరు కూడా కోడి పందేల బరుల వద్దకు రావడంతో అభిమానులు కేరింతలు కొడుతూ తాగి ఊగుతూ కనిపించారు. కొందరు ఎమ్మెల్యేలు బైకులపై వచ్చి సందడి చేశారు. కొన్ని వేల కార్లు కోడి పందేల బరుల వద్దకు వచ్చాయి. పొలాలు, రహదారుల వద్ద జనం తండోప తండాలుగా కనిపించారు.

తాడేపల్లిగూడెంలో సంబరాలు అంబరాన్నంటాయి. కోడి పందేలు జోరందుకున్నాయి. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మురమాళ్లలో జరిగిన కోడి పందేల్లో పాల్గొన్నారు. అమలాపురం కాకినాడ ఎంపీలు హరీష్ మాథుర్, ఉదయ్ శ్రానివాస్ లు కోడి పందేల వద్దకు వచ్చి సందడి చేశారు. కైకలూరు నియోజకవర్గంలోని భుజభలపట్నంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ మహేష్ యాదవ్, ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ లు పాల్గొని కోడి పందేల నిర్వాహకులను ఉత్సాహ పరిచారు. బాపట్ల వద్ద జరిగిన కోడి పందేల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, సినీ నిర్మాత నాగవంశీ మరికొందరు స్థానికులు కలిసి చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కోడి పందేల వద్దకు వచ్చి స్థానికుల్లో ఉత్సాహం నింపారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాతకుంట్ల, తిరువూరుల్లో, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విస్సన్నపేటలో బైకులు నడుపుతూ సందడి చేశారు.

తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా కోడి పందెపు పుంజులు చంకలో పెట్టుకుని పందేలు ప్రారంభించారు. ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాల వద్ద జాతీయ రహదారి పక్కన సుమారు కోటి రూపాయలతో కోడి పందేల బరిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏర్పాటు చేయించారు. అక్కడ ఆయనే కోడి పందేలు ప్రారంభించారు. సమీపంలో కోడి పందేలకు వచ్చే వారికి ప్రత్యేకించి రెస్ట్ రూములు కూడా ఎమ్మెల్యే ఏర్పాటు చేయించారు. ఉండి నియోజకవర్గంలోని పెద్దమీరం గ్రామం వద్ద శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు కోడి పందేల బరులు ఏర్పాటు చేయించారు. ఆకివీడులో కూడా రఘురామ కోడి పందేల బరిని ఏర్పాటు చేయించారు. ఇవే కాకుండా ఇంకా పలు చోట్ల రఘురామ అనుచరులు కోడి పందేల బరులను ఏర్పాటు చేయించారు. రఘురామ దగ్గరుండి కోడి పందేలు ప్రారంభించారు.

మురమళ్లలో 75 పందేలు

కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కోడి పందేల బరిలో వరుసగా మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు 75 ఆటలు జరిగాయి. ఈ కోడి పెందేల్లో కోట్లు గెలిచిన వారు, పోగొట్టుకున్న వారు ఉన్నారు. రాష్ట్రంలోని మురుమళ్ల బరిలోనే ఎక్కవ పందేలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడి పెందేలు, జూదం, మద్యం ఖర్చు సుమారు రూ. 1800 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు అంచనా వేశారు. ఇలా మొత్తం ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కేవలం కోడి పందేలపైనే రూ. 6వేల కోట్ల వరకు చేతులు మారినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఎంతో మంది లక్షల్లో పోగొట్టుకోగా చాలా మంది లక్షల్లో సంపాదించుకున్నారు. నిర్వాహకుల కంటే పై పందేలు కాసిన వారే ఎక్కవ పోగొట్టుకున్న వారిలో ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

నిండిన లాడ్జ్ లు

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, భీమవరం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాలు, నగరాల్లోని హోటళ్లు పూర్తిగా బుక్ అయ్యాయి. ఈ హోటల్స్ లో కూడా కోట్లల్లో పేకాట జరిగినట్లు తెలిసింది. రాయలసీమ జిల్లాల నుంచి కూడా కోడి పందేలపై పై పందేలు కాసేందుకు తరలి వచ్చారు. వీరిలో ఎక్కువ మంది విజయవాడ భీమవరం లలో రూములు బుక్ చేసుకున్నారు. భీమవరం పట్టణంలో సంక్రాంతికి నాలుగు రోజుల ముందుగానే హోటళ్లు, లాడ్జ్ లు బుక్ అయ్యాయి. అక్కడ రూములు దొరకని వారు విజయవాడలో రూములు బుక్ చేసుకున్నారు. విజయవాడ నుంచి మచిలీటపట్నం వరకు రోడ్డు వెంట చాలా గ్రామాల్లోనూ కోడి పందేలు జరిగాయి. పోరంకి, కంకిపాడు వంటి ఏరియాల్లో జరిగిన కోడి పందేల్లో మహిళలు ఎక్కువ మంది పాల్డొని ఎంజాయ్ చేశారు. కాయ్ రాజా కాయ్ అంటూ జూదపు ఆటలు కూడా పలువురిని ఆకర్షించాయి.

కోట్లు చేతులు మారాయి

కోడి పందేల్లో చాలా మంది కోట్లలో పందేలు కట్టి పోగొట్టుకున్నారు. కొందరు నిర్వాహకులు బాగు పడగా, మరికొందరు పై పందేలు కట్టే వారు బాగు పడ్డారు. తాడేపల్లిగూడెంలో పైబోయిన వెంకట్రామయ్య ఏర్పాటు చేసిన బరి వద్ద గుడివాడ ప్రభాకర్, రంగాపురం రత్తయ్య వర్గాల మధ్య కోడి పందెం జరిగింది. మొత్తం రూ. 1.25 కోట్లు పందెం కట్టారు. గుడివాడ ప్రాభాకర్ వర్గం గెలుపొందింది. ఈ బరి వద్ద తోపులాల ఎక్కువగా ఉండటంతో యువకులను బౌన్సర్లుగా పెడితే గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయని లేడీ బౌన్సర్లను పెట్టారు. లేడీ బౌన్సర్లు కొందరిని తోసుకుంటూ వెళ్లటంతో చాలా మంది వారు తగిలితే చాలనుకుని వెనక్కి తగ్గారు. ఇక్కడ లేడీ బౌన్సర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణకు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి మూడు రోజుల పాటు ఆడిన కోడి పందేల ఆటలో 50లక్షలు పోగొట్టుకున్నారు. ఒక వ్యక్తి కారు తాకట్టు పెట్టి పందెంలో ఓడిపోవడంతో కారును వదులుకున్నాడు. ఆ తరువాత వేరే వారి వద్ద అప్పు తీసుకుని రూ. 25 లక్షలకు పందెం కట్టి గెలవడంతో కారు విడిపించుకుని పత్తా లేకుండా వెళ్లిపోయాడు. చెన్నై నుంచి వచ్చిన ఒక వ్యపార వేత్త (తూర్పు గోదావరి జిల్లా వాసి) డేగాపురంలో పందెం కట్టి రూ. 50 లక్షలు పోగొట్టుకున్నారు. ఆ తరువాత ఆయన పేకాట, గుండాటల్లో రూ. 5లక్షలు గెలుచుకుని, దేవుడి ఉండీలో కొంత వేసి తిరుగు ప్రయాణమయ్యాడు. విజయవాడలోని రామవరప్పాడు వద్ద ఏర్పాటు చేసిన కోడి పందేల బరిలో నిర్వాహకులు నన్ను మోసం చేసి రూ. 7 లక్షలు గుంజారని తెలంగాణకు చెందిన ఒక అధికారి వాపోయాడు.

కొద్దిపాటి ఘర్షణలు, కేసులు..

బరులతో పాటు చాలా గ్రామాల్లో రాత్రిపూట రికార్డింగ్ డ్యాన్స్ లు కూడా ఏర్పాటు చేయించారు. పగలు, రాత్రి కోడి పందేలు ఆడే వారు ఆడుతుంటే.. రాత్రి రికార్డింగ్ డ్యాన్స్ లతో హోరెత్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేరు గ్రామంలో వేయించిన రికార్డింగ్ డ్యాన్స్ సంక్రాంతి రోజు రాత్రి వివాదానికి దారితీసింది. భీమవరం పమీపంలోని తాడేరులో జరిగిన రికార్డింగ్ డ్యాన్స్ లో పాడే పాటలు భీమవరం యువకులకు నచ్చలేదు. దీంతో వారు వేరే పాటలతో డ్యాన్స్ లు వేయాలని పట్టుబట్టారు. మా ఊరికి వచ్చి మీ పట్టుదల ఏమిటంటూ ఇరు వర్గాలకు మధ్య గొడవ జరిగింది. పొట్టు రేగేలా కొట్టుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండపల్లిలో గుండాట జూదంలో డబ్బులు పోగొట్టుకున్న ఒక యువకుడు కిరోసిన్ పోసుకుని అక్కడే కాల్చుకున్నాడు. దీంతో వళ్లంతా కాలిపోయింది. వెంటనే ఆ యువకుడిని తణుకు వైద్యశాలకు తరలించారు. అక్కడక్కడా మద్యం తాగి గొడవలకు పాల్పడ్డారు. జూదం జరిగే చోట ఎక్కువగా గొడవలు జరిగాయి. క్యాషినో ఆడిన చోట కూడా గొడవలు చోటు చేసుకున్నాయి.

కోడి, పడవలు, ఎద్దుల పందేలు

సంక్రాంతి సంబరాల్లో కేవలం కోడి పందేలే కాకుండా పడవలు, ఎద్దుల పందేలు కూడా జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో పడవల పోటీలు జరిగాయి. చిత్తూరు జిల్లా రంగంపేటలో ఎద్దుల మెడలో పలకలు వేసి వాటిని సాధించే పోటీలు జరిగాయి. ఇక కోడి పందేలు ప్రతి మండలంలోనూ జరిగాయి. కృష్ణా జిల్లాలో జరిగిన కోడి పందేల్లో పాల్గొనేందుకు తెలంగాణలోని ఖమ్మ, నల్లగొండ జిల్లాల నుంచి ఎక్కవ మంది వచ్చారు.

పార్టీల బేధం లేకుండా...

పార్టీలతో సంబంధం లేకుండా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఎక్కువగా తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన వారు కనిపించారు. వైఎస్సార్ సీపీ వారు పోటీల్లో పాల్గొన్నా బయట పడలేదు. ముందుగానే మాట్లాడుకుని గొడవలు లేకుండా ఉంటేట్టయితే పాల్గొంటామని చెప్పి పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కోడి పందేల్లో పాల్గొనక పోయినా పందేలు ఆడేవారికి పరోక్షంగా మద్దతు ఇచ్చారు. దీంతో గత పదేళ్లలో ఎప్పుడూ జరగని విధంగా సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి.

Next Story