గుడ్ మార్నింగ్ ధర్మవరం పై మోదీ పరివార్..!
x
Source: Twitter

గుడ్ మార్నింగ్ "ధర్మవరం" పై మోదీ పరి"వార్"..!

బీసీల కోటలో ఆధిపత్యానికి చెక్ పెట్టే లక్ష్యంగా మోదీ పరివార్ రంగంలోకి దిగింది. ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయ వేడి రగిలింది.



(ఎస్. ఎస్. వి. భాస్కరరావ్)

తిరుపతి: చేనేతకు ప్రసిద్ధి. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం టిడిపికి కంచుకోట. ఇటువంటి ప్రదేశంలో గుడ్ మార్నింగ్.... ధర్మవరం..! ఈ నినాదం బాగా పాపులర్. ఇక్కడ ప్రారంభం నుంచి రెడ్డి, కమ్మ సామాజిక వర్గానిదే పెత్తనం. మొదటిసారి బీసీ సామాజిక వర్గ నేత కథన రంగంలోకి దిగారు. అది కూడా మోదీ పరివార్‌గా.. ఇప్పుడు జరగబోయేది అసలైన యుద్ధం అని భావిస్తున్నారు.

40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీగా చెప్పుకునే టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు చతురత ప్రదర్శించారు. కోనసీమ అమలాపురం, పిఠాపురం సీన్ ధర్మవరంలో స్పష్టంగా రిపీట్ అయింది. అంతేకాదు.. ధర్మవరం రక్త చరిత్రలో, రాజకీయాల్లో ఆదర్శానికి నిలువెత్తు సాక్ష్యమైన హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే కూడా చెరగని సంతకం చేశారు. ప్రస్తుత వాస్తవిక రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే..

చేనేతలకు అడ్డా..

ధర్మవరం శాసనసభ స్థానం బీసీలకు అడ్డా. ఈ నియోజకవర్గంలో 2,40,323 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో చేనేత కార్మికులు, మగ్గాలు నేసే వృత్తిలో ప్రావీణ్యులైన వారికి నెలవు. వీరి చేతిలో అల్లుకున్న దారాలతో రూపుదిద్దుకొనే చీరలు, వస్త్రాలకు జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ వర్గానికి చెందిన చేనేత రంగంపై 70 శాతం మంది ప్రజలు ధర్మవరంలో ఉన్నారు. చేనేత కుటుంబాల్లో ఓటర్లు 30 నుంచి 40 శాతం, బిసి, ఎస్‌టి, ఎస్‌సి ఓటర్లు 20 నుంచి 35 శాతం, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 25 నుంచి 35 నుంచి 30, రెడ్డి సామాజిక వర్గం 20 శాతం మంది ఓటర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

ధర్మవరం నియోజకవర్గానికి 1951 నుంచి జరిగిన 15 ఎన్నికల్లో.. టిడిపి ఏడు సార్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు, వైఎస్ఆర్సిపి అభ్యర్థి గత ఎన్నికల్లో ఒకసారి విజయం సాధించారు. ఇవన్నీ పరిశీలిస్తే బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రారంభం నుంచి టిడిపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డి, కమ్మ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.


ఆదర్శ నేత సంతకం


తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో గరుడమ్మ గారి నాగిరెడ్డి జీవితం ధర్మవరం చరిత్రపై చెరగని సంతకం చేసింది. నీతి విలువలకు కట్టుబడి తన రాజకీయ జీవితాన్ని సాగించిన జి నాగిరెడ్డి జీవిత చరమాంకంలో కూడా సాధారణ జీవితంలో కఠోర కష్టాలు అనుభవించారు. 1983 మంచి 1989 వరకు వరుసగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఆస్తులు కూడా కోల్పోయిన స్థితిలో ఆయన కష్టాలు అనుభవిస్తూనే ఆదర్శంగా జీవించారు. అలాంటి గడ్డపై...


గుడ్ మార్నింగ్ ధర్మవరం


ఈ నినాదంతో ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మళ్లీ 2024 ఎన్నికలకు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిరోజు ఉదయం ఆయన పార్టీ శ్రేణులతో పాటు ఆయా ప్రాంతాల్లోని సచివాలయ సిబ్బందిని వెంట తీసుకొని వీధుల్లో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం ద్వారా ప్రత్యేకత చాటుకున్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం పరిష్కరించడం ద్వారా ఆయన ప్రజలకు చేరువయ్యారు. అదే సమయంలో పగలు గమనించే పరిశీలించే స్థలాలను అనుచరుల ద్వారా ఆక్రమించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చెరువును కూడా ఆక్రమించి, చదును చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే..


ఫ్యాన్ కింద చల్లగా..


మూడు పార్టీల కూటమి లో కుదరని సీట్ల సర్దుబాటు వ్యవహారం లో రాష్ట్రంలో ఎక్కడ నడవని రాజకీయం పిఠాపురం తర్వాత ధర్మవరంలో చోటుచేసుకుంది. కొన్ని రోజులు వెనక్కి వెళితే... ధర్మవరం అసెంబ్లీ సీటును పొత్తుల నేపథ్యంలో తనకు కేటాయించాలని టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గొనుగుంట్ల సూర్యనారాయణ ( వరదాపురం సూరి) ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే రంగంలో దిగి వ్యవహారాలు చక్కదిద్దుకున్న మాజీ మంత్రి పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ టికెట్ నాదే అనే ధీమాతో ప్రశాంతంగా ఉన్నారు.


వీరిద్దరిలో ఎవరికి టికెట్ దక్కిన విజయం నన్నే వరిస్తుందని ధీమాతో సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రశాంతంగా ఉన్నారు. గిల్లి జోలపాడమంటే ఎలా ఉంటుందో టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడును దగ్గరగా పరిశీలించే వారు సరదాగా అంటుంటారు. ధర్మవరంలో అదే జరిగింది. గొనుగుంట్ల సూర్యనారాయణను ఒకపక్క ప్రోత్సహిస్తూనే.. ధర్మవరంపై పరిటాల శ్రీరామ్‌కు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ప్రచారం కూడా లేకపోలేదు. వీరిద్దరి మధ్య పోరు కొలిక్కిరాని స్థితిలో ఈ సీటును బిజెపికి కేటాయించడంపై వైయస్ఆర్సీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రశాంతంగా పేద తీరుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని ఉలిక్కిపడేలా చేసిందని భావిస్తున్నారు. ఎందుకు అంటే..


రంగంలోకి మోదీ పరివార్


మోదీ పరివార్ అంటే సైన్యం కాదు. ఒక వ్యక్తి. అతను రంగంలోకి వచ్చారంటే పరివార్ అంతా రంగంలోకి వచ్చినట్లే భావిస్తారు. రాష్ట్రంలో బిజెపి, టిడిపి, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జాతీయ కార్యదర్శి సత్య కుమార్ యాదవ్‌ను ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి దించారు. పొత్తుల ఎత్తుల్లో ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని బిజెపి చేజిక్కించుకుంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న సత్య కుమార్ యాదవ్.. రెండు రోజుల క్రితం జనంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన నేపథ్యం ఇదే..

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్య కుమార్ యాదవ్ చిత్తూరు జిల్లా మదనపల్లిలో పాలిటెక్నిక్ చదువుకునే రోజుల్లో ఏబీవీపీ వైపు ఆకర్షితులయ్యారు. కాలేజీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మదనపల్లెలో బిజెపి నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డికి సన్నిహితుడుగా మెలిగారు. అంచలంచెలుగా పార్టీలో ఎదిగిన సత్య కుమార్ బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఎం వెంకయ్య నాయుడు దరికి చేరారు. ఆ తర్వాత ఆయన పార్టీకి అంకితమై, చేసిన సేవతో గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునే స్థాయికి ఎదిగారు. 2018 నుంచి మూడోసారి ఆయన బిజెపి జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఎంఏ పొలిటికల్ సైన్స్ లో చదివిన సత్య కుమార్ బిజెపిలో కీలకమైన నేతగా ఎదిగారు. బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా, అండమాన్, నికోబార్ ఇన్చార్జిగా ఇస్తున్నారు.

బిజెపి అధికారంలోకి రావడానికి సత్య కుమార్ వ్యూహమే కీలకమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వ్యూహం రచించడమే కాదు. అమలు చేయడంలో సత్యకుమార్ చాలా చురుగ్గా ఉంటారని, చెబుతారు. వ్యూహరచన, అమలులో సత్య కుమార్ తీరు చాలా సూక్ష్మంగా ఉంటుందని, అందుకే ఆయనను ప్రధాని మోదీ పరివార్‌గా భావిస్తారని పార్టీ వర్గాలను నుంచి వినిపిస్తోంది.

ఈయన ఎంట్రీ తో వైఎస్ఆర్సిపి లో కలవరం చెలరేగినట్లు చెబుతున్నారు.


లెక్క తేలుస్తా...


బిజెపి నుంచి కూటమి అభ్యర్థిగా అభ్యర్థిగా నిర్ణయం అయిన తర్వాత మొదటిసారి భారీ స్వాగతం మధ్య 24 గంటల క్రితం సత్య కుమార్ ధర్మవరంలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి ప్రసంగంలోనే ఘాటైన హెచ్చరికలు చేశారు." ధర్మవరంలో ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క ఇక జరగబోయేది మరో లెక్క అని" సత్య కుమార్ స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. " ఇన్నేళ్లు సాగిన రాక్షస పాలనకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ధర్మవరం పొలిమేర వరకు తరిమి కొడతా" సత్యకుమార్ శపథం చేశారు.


ఎమ్మెల్యే కోటలు కూల్చడానికి ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. గుడ్ మార్నింగ్ పేరుతో ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుసు అన్నారు. చేనేతలకు అన్ని విధాల అండగా నిలుస్తానని ఆయన భరోసా ఇచ్చారు. " ఇక్కడ పోటీ చేస్తాంది సత్యకుమార్ కాదు. ఆయనలో నన్ను చూడండి" అని మాజీ మంత్రి పరిటాల కుమారుడు పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. పరిటాల కుటుంబం అంటే ధర్మవరంలో గుర్తింపు అభిమానం ఉందని చెబుతారు. ఎందుకంటే..


రక్త చరిత్ర కు సమాధి


సుమారు 25 ఏళ్ల క్రితం మాట. ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి తీరు వల్ల ధర్మవరంలో సంఘటనలు పెరిగాయని చెబుతారు. ఓ బాధితుడు అప్పటి మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ను ఆశ్రయించారు. అప్పటికే టిడిపికి బలమైన క్యాడర్ అభిమానులు ఉన్న ధర్మవరంలోకి పరిటాల రవీంద్ర ఎంట్రీ ఇచ్చి, అసాంఘిక అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని కట్టడి చేశారని చెబుతారు. ఈ వ్యవహారం పరిటాల రవీంద్రను ఆయన కుటుంబాన్ని పేదలు అభిమానించడానికి ప్రధాన కారణం అనేది ఆ ప్రాంతంలో వినిపించే మాట.


పరిటాల రవీంద్ర తర్వాత మరణం తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గోనెగండ్ల సూర్యనారాయణ నెలల వ్యవధిలోని బిజెపిలో చేరారు. దీంతో పరిటాల రవీంద్ర కుమారుడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జిగా టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు నియమించారు. మాజీ ఎమ్మెల్యే గొనుగుండ్ల సూర్య నారాయణ, పరిటాల శ్రీరామ్ తో దోబూచులాడిన అభ్యర్థిత్వం బిజెపి నేత సత్య కుమార్ యాదవ్ ను వరించింది.


చమక్కు..

అభ్యర్థిత్వం ఖరారు, సీట్ల సర్దుబాటు వ్యవహారం లో పిఠాపురం నియోజకవర్గం, అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన తీరుకు భావసారుప్యం ఉంది. పిఠాపురం కూటమిలో జనసేన- టిడిపి మధ్య వివాదం ఏర్పడింది. అదే పరిస్థితి ధర్మవరంలో కూడా రిపీట్ అయింది. పిఠాపురంలో వీర మహిళ ఇంచార్జ్ వైఎస్ఆర్సిపి లోకి జంప్ అయ్యారు.


ధర్మవరంలో బిజెపి సీట్ దక్కించుకుంది. ఇక్కడ పరిటాల శ్రీరామ్ మిత్ర ధర్మానికి విలువ ఇస్తూ అండగా నిలబడ్డారు. టికెట్ ఆశించి భంగపడి టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన వరదాపురం సూరి మరో నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. నామినేషన్లు దాఖలు రోజు నాటికి మార్పులు, చమక్కులు చోటుచేసుకుంటాయి అనేది చూడాలి.




Read More
Next Story