ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్టులు ఆ పార్టీలో గందరగోళానికి గురి చేస్తున్నాయి. కడపలో అరెస్టుల సంఖ్య ఎక్కువుగా ఉంది.


కడప జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వర్రా రవీందర్‌రెడ్డిని అదపులోకి తీసుకున్న పోలీసులు పలువురికి నోటీసులు జారీ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి మీద సెర్చ్‌ వారెంట్‌ జారీ చేశారు. ఆ మేరకు కడప జిల్లా లింగాల మండలం అంబకపల్లిలోని రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు సెర్చ్‌ వారెంట్‌ నోటీసులను అంటించారు. ఏ క్షణంలో అయినా రాఘవరెడ్డి ఇంట్లో సోదాలు చేయడానికి కూడా పోలీసులు అనుమతులు తీసుకున్నారు. రాఘవరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గత వారం రోజులుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. దీని కోసం ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. పులివెందుల, లింగాలతో పాటు సొంత గ్రామమైన అంబకపల్లిలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

మరో వైపు వర్రా రవీందర్‌రెడ్డి పోలీసులకిచ్చిన వాంగ్మూలం ఆధారంగా పలువురు వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు నోటీసులు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా కడప జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వివేకానందరెడ్డికి 41–ఏ నోటీసులు జారీ చేశారు. పులివెందులలోని వివేకానందరెడ్డి ఇంటికి ఆ నోటీసులను అంటించారు.
Next Story