
'కడప' లో.. తేలని సీట్ల పంచాయతీ
ఇంకొన్ని రోజుల్లో.. ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్నది. కడప వైఎస్ఆర్ సీపీ లోనే కాదు.. కూటమిలో కూడా సీట్ల పంచాయతీ తెగేలా కనిపించడం లేదు.
ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్ - తిరుపతి
కడప సొంత గడ్డపై మళ్లీ పట్టు సాధించాలనేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన. నాయకుల నుంచి అలకలు, నిరసనలు తక్కువేం లేవు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరదాల చాటున పర్యటన కూడా నాయకులను నిరసన వ్యక్తం చేయడానికి దారి తీసినట్లు సమాచారం. విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో కుస్తీ పడుతోంది. రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించిన చోట కూడా బలమైన వర్గం బాహాటంగానే నిరసన గళం వినిపిస్తోంది.
కడప జిల్లాలోని పదికి పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులే గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిని మార్చే అవకాశం ఉందంటూ విస్తృతంగా ఊహాగానాలు వినిపించినా, గత నెలలో విజయవాడలో నిర్వహించిన పార్టీ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్పులకు తెరదించారని భావించారు. కానీ కడప జిల్లాలో.. పరిస్థితి పరిశీలిస్తే.. రాజంపేట శాసనసభ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డిని తప్పించి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అవకాశం కల్పించారు. కడపలో అంజాద్ బాషా, కమలాపురంలో పి రవీంద్రనాథ్ రెడ్డి, రైల్వే కోడూరు కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డినీ అనివార్యంగా కొనసాగిస్తున్నట్లు అక్కడి పరిస్థితి చెబుతోంది.
మార్పు తప్పదా?
జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో నుంచి వైఎస్ఆర్ కుటుంబంలో ఒకరిని పోటీ చేయించాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ప్రొద్దుటూరులో చేనేత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఆమె ఉన్నత స్థాయిలో పని చేస్తున్నట్లు తెలిసింది. ఇక్కడి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మళ్లీ తానే ఎమ్మెల్యే అనే ధీమాగా ఉన్నారు. మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణ రెడ్డి.. బీజేపీ నుంచి తనపై పోటీ చేసే అవకాశం ఉందంటూ, అలా జరిగితే తమది ఫ్రెండ్లీ మ్యాచ్ మాత్రమే అని చలోక్తి విసిరారు. రాయచోటిలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి మధ్య ప్రచారం జోరు అందుకుంది.
వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల అసంతృప్తి
జడ్పీ చైర్మన్ పదవి విషయంలో బద్వేలి, మైదుకూరు నియోజకవర్గాల నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు బయటపడింది. జిల్లాలో సోమవారం ఒక రోజు పర్యటనకు వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చి కూడా.. కలవకుండా వెళ్ళిపోయారని ఆగ్రహంతో ఉన్నారు. వారిని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లేందుకు పార్టీ నాయకులు సంసిద్ధమైనట్లు తెలిసింది. ఆ బద్వేలులో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ జ్యోతిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా ఓ వర్గం నేతలు ఫిర్యాదు చేశారని తెలిసింది.
టీడీపీలో నిరసన సెగలు..
ప్రధానంగా కడప నియోజకవర్గంలో ఎంపీ స్థానానికి ఆర్ శ్రీనివాసులు రెడ్డి, ఆమె సతీమణి మాధవి రెడ్డికి కడప అసెంబ్లీ సీటు ఇవ్వడంపై మరో వర్గం మండిపడుతోంది. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో.. " అధిష్టానమే మంట పెడుతోంది" అని పార్టీ సీనియర్ నాయకుడు అమీర్ బాబు, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు లక్ష్మీ రెడ్డి సారధ్యంలోని నాయకులందరూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమలాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జి. వీరశివారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి టికెట్ రేసులో ఉన్నారు.
పొత్తులో ఈ సీట్లు ఎవరికి..
టీడీపీ- జనసేన - బీజేపీ పొత్తు నేపథ్యంలో సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికలో ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్. వరదరాజులు రెడ్డి, ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గం నుంచి రైల్వే కోడూరు చెందిన మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగల్ రాయులు, మరొకరు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే ఈ రెండు సీట్లు.. పొత్తులో భాగంగా ప్రొద్దుటూరు బిజెపి కేటాయిస్తే ఇక్కడ మాజీ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజంపేటలో జనసేనకు కేటాయించాలనే ప్రతిపాదన కూడా ఉంది. జమ్మలమడుగు టీడీపీ సీటు తన కుమారుడు భూపేష్ రెడ్డికి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కోరుతున్నట్లు సమాచారం. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు.
రెండు సెగ్మెంట్లలో కొత్త ముఖాలు..
కడప జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్లలో ప్రతి ఎన్నికకు కొత్త ముఖాలు తెరపైకి తీసుకుని వస్తుంటారు. ఈ ఎన్నికకు కూడా రెండు కొత్త ముఖాలు రాజకీయతెర ప్రవేశం చేయనున్నట్లు సమాచారం. రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలు కస్తూరి విశ్వనాథ నాయుడు నుంచి తప్పించి, వైఎస్ఆర్‌సీపీపై తిరుగుబాటు చేసి వచ్చిన ముక్కా రూపానంద రెడ్డికి టీడీపీ బాధ్యతలు అప్పగించింది. గత రెండు ఎన్నికల్లో ఓటమి చవి చూసిన మాల సామాజిక వర్గానికి చెందిన పంతగాని నరసింహ ప్రసాద్ స్థానంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నగరిపాటి రేవతి అనే ఎన్ఆర్ఐ ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటకు చెందిన షాప్ మాజీ డైరెక్టర్ దుద్యాల జయచంద్ర సతీమణి దుద్యాల అనిత దీప్తి కూడా ప్రచారంలో ఉన్నారు.
"మా సర్వేలు లెక్కలు మాకు వున్నాయి" కలిసి పని చేయండి అని రైల్వే కోడూరు టీడీపీ ఇన్‌చార్జ్ రూపానందరెడ్డితో పాటు, మాజీ ఇంచార్జ్ కస్తూరి విశ్వనాథ్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయల్ని విజయవాడ పిలిపించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కడప జిల్లాలోనే మరో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం బద్వేలులో గత రెండు ఎన్నికల్లో ఒక్కొక్కరిని మార్చేసిన పార్టీ నాయకులు ఈసారి కొత్తగా మాదిగ సామాజిక వర్గానికే చెందిన రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారి బొజ్జా రోసన్న ను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి రాష్ట్ర స్థాయి తరహాలో ప్రతి జిల్లాలో కూడా పొత్తులు కుదిరితే కానీ సీట్ల పంచాయతీ తెగేలా కనిపించడం లేదు. బీజేపీ పోటీ చేసే స్థానాలు తెలిస్తే అంతా సర్దుకుంటుందని టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.