సీమలో వీడని సీట్ల పీటముడి..
x

"సీమ"లో వీడని సీట్ల పీటముడి..

రాయలసీమలో తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమికి అనుకోని ఇబ్బంది వచ్చి పడింది. నేను పోటీ చేస్తానంటే.. నేను చేస్తానని భీష్మించడంతో సీట్ల పంపకాల్లు పీటమడి పడింది.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. వీటితో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ కూడా రానుంది. దీంతో ఏపీ పొత్తుల రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో సీట్ల పంపకాలపై టీడీపీ, జనసేన అధినేతల మధ్య సయోధ్య ఉన్న కింది స్థాయి నాయకులు నేనంటే నేను పోటీ చేస్తానని భీష్మించడంలో సీట్ల పంపకాల్లో పీటముడి పడింది. అందువల్లే ఈ జిల్లాలో సీట్ల పంపిణీ ప్రక్రియ మలిదశలో ప్రకటించాలని పార్టీల అధినేతలు నిర్ణయించినట్లు సమాచారం.
తిరుగుబాటు ఎమ్మెల్యేల డోలాయమానం..
అధికారంలో ఉండి కూడా అందులో ఇమడలేక, తిరుగుబాటు చేసి టీడీపీలో చేరిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో కూడా కొందరు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందా లేదా అనే డోలాయమానంలో పడినట్లు తెలుస్తోంది. "మా భవిష్యత్తు ఏంటో" అని మదనపడుతున్నారట.
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా వ్యవహరించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారట. సీట్ల కేటాయింపు స్థానిక నాయకుల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో అటువంటి ఏమైనా ప్రయత్నాలు చేయాలా అని ఆలోచిస్తున్నారని టాక్.
ఎవరంటే..
సర్వేలో పనితీరు బాగా లేదంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అభ్యర్థిత్వానికి వైఎస్ఆర్సిపీ పై అభ్యంతరం చెప్పడంతో ఆయన తిరుగుబాటు చేశారు. అదే కోవలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేలు గట్టెక్కారు
విజయవాడలో తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్ ఉమ్మడి పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ సిట్టింగులకు అవకాశం కల్పించిన చంద్రబాబు... వైయస్ఆర్సీపీ నుంచి తిరుగుబాటు చేసి వచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే సీటును ఖరారు చేశారు.
కింకర్తవ్యం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని, వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అవకాశం దక్కలేదు. ఆయన ఆశించిన సీటులో టీడీపీ నాయకుడు కాకర్ల సురేష్ కు అవకాశం కల్పించారు. అలాగే వెంకటగిరి టికెట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే, సీనియర్ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో.. అదృష్టం దోబూచులాడుతున్నట్లు భావిస్తున్నారు. ఇదే కోవలో సీటు దక్కని కారణంగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసు పరిస్థితి కూడా ఉంది.
సర్దుబాటు పీటముడి
సామాజిక వర్గ సమీకరణలు, అభిప్రాయాలు కుదరని నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో రెండు ప్రధాన నియోజకవర్గాలైన తిరుపతి, మదనపల్లి సీట్ల మంచి ఎవరిని పోటీ చేయించాలని విషయంపై తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య చర్చలు కొలిక్కిరానట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పాటు ఈ రెండు నియోజకవర్గాలను తమకు అప్పగించాలనేది జనసేన దిగువ శ్రేణి నాయకుల పట్టుదల. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా సినీ నటుడు కొణిదెల చిరంజీవి తిరుపతి నుంచి ఎన్నికయ్యారు.
మాకంటే మాకు.. టిడిపి - జనసైనికుల పట్టు
ప్రస్తుతం జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు తిరుపతిలో ఉండడంతో పాటు ఈ సీటు తమ పార్టీకి కేటాయించాలని పట్టుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత ఏం. సుగుణమ్మ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన ఆమె భర్త వెంకటరమణ, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రాజీనామా నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎం వెంకటరమణ ఓటమిపాలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఈ సీటు తమకే ఉండాలని వారు పట్టుబడుతున్నారు.
ఆధిపత్యం కోసం ఆరాటం
మదనపల్లి నుంచి జనసేన పార్టీ రాయలసీమ సమన్వయకర్తగా వున్న గంగారపు రాందాస్ చౌదరితోపాటు మరో నాయకుడు కూడా ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఉవ్విల్లురుతున్నారు. తెలుగుదేశం ఆరంభం నుంచి కూడా మదనపల్లి సీటు ఆ పార్టీకి కోటగా ఉంది. గతంలో ఇక్కడి 2004 ఎన్నికల్లో దోమలపాటి రమేష్ మొదటిసారి ఎన్నికయ్యారు.
2009 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఆస్థానాన్ని బిజెపికి కేటాయించింది. ఆరంభం నుంచి మదనపల్లి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రాటకొండ కుటుంబం కూడా టికెట్ రేసులో ఉంది. రాటకొండ శోభ, అంతకుముందు ఆమె బావ సాగర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించారు.
ప్రస్తుతం జనసేన కూడా మదనపల్లి అసెంబ్లీ స్థానాన్ని కోరుతుండడంతో .. ఇంకా ఏ నిర్ణయానికి రాకుండా వాయిదా వేయడం ఆ ప్రాంత నాయకుల్లో ఉత్కంఠకు తెరలేపింది. అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరులో కూడా టిడిపి జనసేన మధ్య సీటు సర్దుబాటు కొలిక్కి రాలేదు. ఈ సీటుపై కూడా జనసేన కన్ను వేసింది. కాగా ఇక్కడి నుంచి సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఎన్. వరదరాజు రెడ్డి తో పాటు డాక్టర్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా రంగంలో ఉన్నారు.
మలిదశ జాబితా పై ఆశలు
దీంతో మలి విదత చర్చల అనంతరం, ఒక నిర్ణయానికి వద్దామనే ఆలోచనతో ఆ సీట్ల విషయంలో ఆయా నియోజకవర్గాల నేతలను సమన్వయం చేసి తుది నిర్ణయం ప్రకటించాలని తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు భావిస్తున్నట్లు ఆయా పార్టీ వర్గాల సమాచారం. ఈనెల 29వ తేదీ విడుదలయ్యే మలి విడత జాబితా కోసం టిడిపి, జనసేన ఔత్సాహికులతో పాటు వైయస్సార్సీపి నుంచి తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు కూడా ఆశగా నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది.


Read More
Next Story