కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌కు అడ్డాగా మార్చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో దేశ భద్రతకు తీవ్ర ముప్పు తలెత్తే ప్రమాదం ఉంది.


పీడీఎస్‌ బియ్యంతో ఉన్న షిప్‌ సీజ్‌ చేయండి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అధికారులను ఆదేశించారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా నెట్‌ వర్క్‌ను బ్రేక్‌డౌన్‌ చేస్తామన్నారు. కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా తనిఖీల అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌కు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు, మత్తు పదార్ధాలు అక్రమ రవాణా దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? అని ప్రశ్నించారు. ఈ అక్రమ మార్గాల్లో కసబ్‌ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా? అని అధికారులను నిలదీశారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్రం, దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ప్రతిసారీ ప్రజా ప్రతినిధులు వచ్చి ఆపాలా? అని నిలదీశారు. కాకినాడ చుట్టు పక్కల చాలా జాతీయ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సంస్థలు, కంపెనీల రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఉగ్రవాదులను రెడ్‌ కార్పెట్‌ వేసి పిలిచినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్‌ బియ్యం మాఫియా వెనుక ఉన్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనకున్న శక్తులపై కేసులు నమోదు చేయండి అని అధికారులను ఆదేశించారు.

దీని వెనుక ఎంత పెద్ద వారు ఉన్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేద ప్రజలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని కొంత మంది అక్రమార్కులు స్మగ్లింగ్‌ చేస్తూ కోట్లు కూడబెడుతున్నారు. రేషన్‌ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. మొత్తం నెట్‌ వర్క్‌ను బ్రేక్‌ డౌన్‌ చేస్తాం. రేషన్‌ బియ్యం పేదప్రజలకు మాత్రమే అందాలి. ప్రైవేట్‌ పోర్టు అయితే ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారేమో. కూటమి పాలనలో అటువంటివి కుదరవు అని హెచ్చరించారు. నేను వస్తున్నాను అంటే ఎస్పీ సెలవు మీద వెళ్లిపోయారని అసహనం వ్యక్తం చేశారు. రేషన్‌ బియ్యం ఒక్కటే ఇక్కడ స్మగ్లింగ్‌ జరుగుతుందో, ఇంకేదైనా జరుగుతున్నాయో ఎవరికి తెలుసు? ఇక్కడ నుంచి ఎంత గంజాయి బయటకు వెళ్తుందో ఎవరికి తెలుసు? అక్రమార్కులపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సారించాలి. షిప్‌ సీజ్‌ చేసి, దీని వెనుక ఉన్నదెవరు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Next Story