జగన్ తో సెల్ఫీ.. జోకులు పేల్చుతున్న టీడీపీ
x
జగన్ తో సెల్ఫీ కోసం ఏడుస్తున్న పాప.. (ఫైల్)

జగన్ తో సెల్ఫీ.. జోకులు పేల్చుతున్న టీడీపీ

చిన్నారి దేవిక.. 72 గంటలుగా ఈ పాప వైసీపీ అధినేత జగన్ తో తీసుకున్న సెల్ఫీ పై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది.


చిన్నారి దేవిక.. 72 గంటలుగా ఈ పాప వైసీపీ అధినేత జగన్ తో తీసుకున్న సెల్ఫీ పై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఓపెన్ చేసినా అనుకూలంగానో ప్రతికూలంగానో ఈ చిన్నారి పేరే వినిపిస్తోంది. అందుకు కారణం ఆ చిన్నారి వైఎస్ జగన్‌ను చూడాలంటూ ఏడుస్తూ ఫొటో దిగడం.. ఆ ఫొటో, వీడియోలు వైరల్ కావడం.
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడలోని జిల్లా జైలుకు వెళ్లారు. వైసీపీ అభిమానులు అక్కడికి భారీగా చేరుకున్నారు. జనంలో ఉన్న ఓ పాప జగన్ తో ఫొటో దిగడానికి పట్టుబట్టింది. దీంతో జగన్ బయటకు వచ్చి ఆమెను ముద్దాడారు. అనంతరం ఆ చిన్నారి జగన్‌తో సెల్ఫీ తీసుకుంది.
ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. దీంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. ఒక్కోక్కరు ఒక్కో విధంగా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు.
టీడీపీ అనుకూల మీడియా...
'బాలనటి బ్రహ్మాండంగా నటించింది. తనకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంత చిన్న వయసులో అంత అద్భుతంగా నటిస్తుందను కోలేదు" అని ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన తొలి వ్యాఖ్యను ఇప్పుడు యావత్ టీడీపీ సోషల్ మీడియా సైనికులు పాలో అవుతున్నారు. 'ఒక కన్నాంబ.. ఒక కాంచన.. ఓ సుజాత, ఇంకో శారద ..చివరకికి మహానటి సావిత్రి కూడా సరిపోదు. ఈ బాలనటికి బంగారు నంది అవార్డు ఇవ్వాల్సిందే' అంటూ తెలుగుదేశం సోషల్ మీడియా ఎద్దేవా చేస్తోంది.
'ఈ చిన్నారి చేత ఆ ఐ-ప్యాక్ టీమ్ ఎన్ని రోజులు రిహార్సల్స్ చేయించారో' అంటూ ఓ టీడీపీ అనుకూల మీడియా రాసుకొచ్చింది. ఆ చిన్నారిలో ఎంత టాలెంట్ లేకపోతే అలా జీవించగలుగుతుంది. ఆ చిన్నారిది కచ్చితంగా ఆస్కార్ అవార్డు నటనమోననిపిస్తుంది' అని మరో వెబ్ సైట్ రాసింది.
మహానటి సావిత్రిని కూడా తలదన్నేలా చేసిన ఈ చిన్నారి దేవికా రెడ్డికి అమ్మఒడి స్కీంతో పనేంటంటూ.. ఈ పాపను చిన్నారి రెడ్డమ్మ అంటూ సెటైర్లు పేల్చారు మరికొందరు. అమ్మఒడి' కింద జగన్ ప్రభుత్వం ఏడాదికి 18 వేల రూపాయలు ఇచ్చింది. ఈ 18 వేల రూపాయలకు మరికొన్ని లక్షల రూపాయలు జత చేసి.. 'నిరుపేదలు' మాత్రమే చదువుకునే 'ఢిల్లీ పబ్లిక్ స్కూల్, 'రవీంద్రభారతి'లో చేర్పించారా అని మరికొందరు ప్రశ్నించారు.
నిజానికి ఈ పాప తండ్రికి విజవాడలోనే బంగారపు షాపు, బెజవాడలోనే ఓ పెట్రోల్ బంక్ ఉందని సమాచారం. ఇంత ఆస్తి ఉన్న ఈ చిన్నారి కుటుంబానికి తెల్లకార్డు ఉందట.
జగన్ తో సెల్ఫీ తీయించుకున్న చిన్నారి దేవికారెడ్డి, తనకు అమ్మబడి రాలేదన్న మహితారెడ్డి చదివేది బెజవాడ ఢిల్లీ పబ్లికి స్కూల్, రవీంద్రభారతి స్కూళ్లని, అక్కడ ఎల్.కే.జీ. ఫీజే సుమారు లక్ష రూపాయలు ఉంటుందని, 1 నుంచి 5 వ తరగతి వరకూ 1,02, 000 రూపాయలు. 6 నుంచి 10 వరకూ 1,11,000 రూపాయలు, 11 నుంచి 12 న తరగతి నరరూ 1,48,000 రూపాయలు ఉంటుందని, అటువంటి స్కూళ్లలో చదివే ఈ పాపలకు అసలు అమ్మఒడి పథకం ఎవరిచ్చారో వాళ్లకి సన్మానం చేయాలికదా అంటూ మరో టీడీపీ అభిమాని సెటైర్ వేశారు.
Vote for TDP-Develop AP
అనే సోషల్ మీడియా ఎకౌంట్ తెలిపిన వివరాల ప్రకారం...
నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అమ్మఒడి రాలేదు అని చెప్పిన పాప బయోడేటా పేరిట ఓ పోస్టు పెట్టారు. అందులో ఈ అమ్మాయి
మామ- ప్రవీణ్ కుమార్ రెడ్డి
సొంత నియోజకవర్గం- గురజాల పులిపాడు గ్రామం
స్వగృహం- విజయవాడ
వృత్తి- బంగారపు షాపు
చదివే స్కూలు- స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్
ఢిల్లి పబ్లిక్ స్కూల్ లో చదివే పిల్లలకి 15 వేలకి బుక్స్ కూడా రావు.అటువంటి ఈ పాపకి పాపం ఈ అమ్మఒడి డబ్బులు రాక స్కూలుకు కూడా వెళ్లలేకపోతోందంటూ వ్యంగంగా ఓ కామెంట్ రాశారు. ఇలాంటి వికృత రాజకీయ ఎత్తుగడ వల్ల జనంలో జగన్ ఇమేజ్ పోతుందని ఆ పోస్టు పెట్టిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
కత్తికోళ్లు, కంకరాళ్లు తర్వాత పసిపిల్లల్ని వాడారు.. ఇక మిగిలింది హిజ్రాలే అంటూ ఇంకో వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చిన్నారిని ఎత్తుకున్న వ్యక్తి.. ఎన్టీఆర్. ఏఎన్నార్, ఎస్వీరంగారావు కంటే మహానటుడని కూడా చురక వేశారు. జగన్ ఇమేజ్ ని డ్రోన్లతో పైకి లేపాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
ఇప్పటి వరకూ పిల్లలు దేవుడితో సమానమనే భావన ఉందని, దాన్ని చెడిపేయవద్దని కోరారు ఇంకో యూట్యూబర్. ఇలా వైసీపీ సోషల్ మీడియా సైన్యంపై టీడీపీ సైన్యం విరుచుకుపడుతోంది. నీ రాజకీయ ప్రయోజనం కోసం తల్లినీ చెల్లినీ వాడుకున్నావు. ఇప్పుడు చిన్నపిల్లలనూ బలిచేస్తావా? అంటూ కామెంట్లు, గ్రాఫిక్సులతో శివతాండవమాడుతున్నారు.
ఈ పాప మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దగ్గరి బంధువని, పులిపాడు గ్రామానికి చెందిన ఈ పాప తండ్రి పేరు లక్ష్మణ్ రెడ్డి అని తెలుస్తోంది. ఆయన బెజవాడ ఎంజీ రోడ్ లో బీఎన్ ఆర్ గోల్డ్ షాప్ అధిపతి.
వైసీపీ వాళ్ల మీడియా ఏమంటుందంటే...
'పచ్చ బ్యాచ్‌ సైకోలు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతీసారి ఆశ్చర్యపరస్తూ వస్తున్నారు. తాజాగా.. మరోసారి విష పడగ విప్పారు. జగన్‌పై అభిమానంతో ఓ చిన్నారి చేసిన పనిని విపరీతంగా ట్రోల్‌ చేశారు. అయితే ఈసారి నెటిజన్ల నుంచి ఛీత్కారాలు వచ్చాయి. దీంతో ఐటీడీపీ జీతగాళ్లు మరింత దిగజారి ప్రవర్తించారు. ఆ చిన్నారి విషయంలో అసత్య ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు' అని వైసీపీ అనుకూల మీడియా రాసుకొచ్చింది.
వైసీపీ వర్గాలు చెబుతున్న కథనం ప్రకారం...
దేవికా రెడ్డి రవీంద్రభారతిలో ఎనిమిదో తరగతి చదువుతోంది. విజయవాడ పర్యటనలో వైఎస్‌ జగన్‌ను కలిసింది. ఆ సమయంలో ఆయన ఆ పాపను దగ్గరికి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత భావోద్వేగంతో ఆ చిన్నారి మీడియా ముందు మాట్లాడింది. జగన్‌ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడి రావట్లేదని ఉన్నమాటే చెప్పింది.
వైసీపీ వాళ్లు తమకు అనుకూలంగా #Childabuser అనే పేరిట టీడీపీ సైన్యంపై విరుచుకుపడ్డారు. గతంలో చిన్నపిల్లలతో రాజకీయం చేసింది ఎవరంటూ.. టీడీపీకి సంబంధించిన వీడియోలను పోస్ట్‌ చేశారు. గతంలో ప్రభుత్వ స్కూల్‌లో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన మేఘన అనే ఓ విద్యార్థిని విపరీతంగా ట్రోల్‌ చేశారని గుర్తు చేశారు.
జగన్‌ పాలనలో సాయం పొందిన వాళ్లను, ఆయనపై అభిమానం ప్రదర్శించిన వాళ్లనూ ఏ ఒక్కరినీ వదలకుండా విపరీతంగా ట్రోల్‌ చేయడం చూశాం. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలోనూ అదే చేస్తున్నారని తిప్పికొట్టారు.
చిన్నారి దేవిక ఢిల్లీ పబ్లిక్ స్కూలు విద్యార్థిని కాదని, ఆమె తల్లి వైఎస్సార్సీపీ నాయకురాలు కాదని వైసీపీ చెబుతోంది. దేవిక తండ్రి అద్దె ఇంట్లో ఉంటూనే ఓ షాప్‌లో పని చేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నారే గాని లోకేష్‌ టీం(Nara Lokesh Team) చెబుతున్నట్టు ఇళ్లు, బంగ్లాలు లేవని వైసీపీ సోషల్ మీడియా చెబుతోంది.
ఇంత జరుగుతున్నా.. ఆ పాప తల్లిదండ్రులు మాత్రం ఇంకా నోరు మెదపలేదు. ఆ పాప అమ్మఒడి గురించి ఎందుకు మాట్లాడిందో గాని ఇప్పుడదంతా జగన్ కి ఎన్నికల ప్రచారం నిర్వహించే ఐ-ప్యాక్ టీమ్ మీదికి మళ్లింది.
Read More
Next Story