కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్‌ ఆర్‌ కేసు విచారణ వేగవంతం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు హత్యామయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ను కూటమి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆలిండియా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆర్‌పీ సిసోడియ కమిటీ తేల్చడంతో సునీల్‌కుమార్‌ను సస్పెండ్‌ను కూటమి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసులో పీవీ సునీల్‌ కుమార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను విచారణ సమయంలో చిత్ర హింసలకు గురి చేశారని, దీనిలో పీవీ సునీల్‌ కుమార్‌ పాత్ర ఉందని గుంటూరు నగరపాలెం పోలీసు స్టేషన్‌లో రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో సునీల్‌ కుమార్‌ మీద కేసు తెరపైకొచ్చింది. ఇదే సమయంలో నాడు సీఐడీ చీఫ్‌గా ఉన్న సయమంలో సునీల్‌ కుమార్‌ ఆలిండియా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని సునీల్‌ కుమార్‌ మీద ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో వీటిని నిర్థారించేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా నేతృత్వంలో కమిటీని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిసోడియా కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. ముందస్తు అనుమతులు లేకుండానే సునీల్‌ కుమార్‌ విదేశాలకు వెళ్లారు. 2020 నుంచి 2024 మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతలు లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లారు. జార్జియాకు వెళ్లినప్పుడు మాత్రమే ప్రభుత్వం నుంచి పర్మిషన్‌ తీసుకున్నారని, తర్వాత స్వీడన్, యూకే, యూఏఈ వంటి పలు దేశాల పర్యటనలకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు సునీల్‌ కుమార్‌ తీసుకోలేదు.
ఇది ఆలిండియా సర్వీసు రూల్స్‌ను ఉల్లంఘించడమే. కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌కు విరుద్దంగా సునీల్‌ కుమార్‌ ప్రవర్తించారని సిసోడియా కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో సునీల్‌ కుమార్‌ మీద వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పీవీ సునీల్‌ కుమార్‌ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. మరో వైపు పీవీ సునీల్‌ కుమార్‌ను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కూటమి ప్రభుత్వం మీద ఇది వరకే ఆరోపణలు చేశారు. సునీల్‌ కుమార్‌ దళితుడు కాబట్టే ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు చేశారు. నిజాయితీతో, నిబద్దతతో పని చేసిన సునీల్‌కుమార్‌ను ఇబ్బందులకు గురి చేస్తూ, జైల్లో పెట్టాలని చూస్తున్నారని, వందల కోట్లు బ్యాంకులకు ఎగొట్టిన రఘురామకృష్ణరాజు దర్జాగా బయట తిరుగుతున్నారని, ఇదెక్కడ న్యాయమంటూ సంచలన విమర్శలు చేశారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చేసిన విమర్శలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి.
Next Story