ఆంధ్ర ప్రజలకు విపత్తుల సంస్థ మరో హెచ్చరిక
x

ఆంధ్ర ప్రజలకు విపత్తుల సంస్థ మరో హెచ్చరిక

ఆంధ్రలో రేపు, ఎల్లుండి పలు మండలాల్లో తీవ్ర స్థాయి నుంచి ఒక మోస్తు స్థాయిలో వడగాలులు వీయనున్నాయని విపత్తుల సంస్థ హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.


ఆంధ్రలో ఎండలు మండుతున్నాయి. ఒకవైపు రాజకీయాల వేడి మరోవైపు భానుడి వేడితో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విపత్తుల సంస్థ ప్రజలకు తాజాగా మరో హెచ్చరిక చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు మండలాల్లో తీవ్ర స్థాయిలో వడగాలులు వీసే అవకాశం ఉందని, కావున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్తే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని గుర్తు చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 54 మండలాల్లో తీవ్ర వడగాలులు వీసే అవకాశాలు ఉన్నాయని, అదే విధంగా 154 మండలాల్లో మోస్తరు వడగాలులు వీయొచ్చని తమ సంస్థ అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

రేపు వడగాలులు వీచే మండలాలు

రేపు అంటే గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 54 మండలాల్లో తీవ్రస్థాయి వడగాలులు వీయనున్నాయని విపత్తుల సంస్థ అంచనా వేసింది. ఆ మండలాలు.. శ్రీకాకుళం 13 , విజయనగరం 23 , పార్వతీపురం మన్యం 12 , అల్లూరి సీతారామరాజు 2 అనకాపల్లి 3, విశాఖ పద్మనాభం మండలం. అదే విధంగా ఒక మోస్తరు వడగాలులు వీచే మండలాలు.. శ్రీకాకుళం15 , విజయనగరం 4, ఏలూరు 14, కృష్ణా 9, ఎన్టీఆర్ 5, గుంటూరు 14, పల్నాడు 5, పార్వతీ పురం మన్యం 3, అల్లూరి సీతారామరాజు 12, విశాఖపట్నం 3,

అనకాపల్లి 15, కాకినాడ 17, కోనసీమ 9, తూర్పుగోదావరి 19, పశ్చిమగోదావరి 4, బాపట్ల 1, ప్రకాశం 1, తిరుపతి 3, నెల్లూరు మనుబోలు మండలం ఉన్నాయి.

ఎల్లుండి తీవ్ర వడగాలులు వీచే మండలాలు

అదే విధంగా ఎల్లుండి కూడా వడగాలుల తీవ్రత అధికంగానే ఉండనుందని, 36 మండలాల్లో తీవ్రంగా వడగాలులు వీస్తే 157 మండలాల్లో ఒక మోస్తరు వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని కూర్మనాథ్ వివరించారు.

అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎండలు మరింత అధికం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని, కాబట్టి అందుకు తగిన చర్యలను ప్రజలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు. వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని, వారు ఎండ తీవ్రతను తట్టుకోలేరని, కాబట్టి వారు బయటకు రాకుండా ఉండటమే శ్రేయస్కరమని చెప్పారు. కుర్రాళ్ళు, యుక్త వయసు వారు కూడా వీలైనంత వరకు నీడపట్టునే ఉండాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు బయటకు వచ్చే అవకాశాలను వీలైనంత తగ్గించుకోవాలని, తప్పిన పరిస్థితుల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా బయటకు వెళ్లిన వారు ప్రతి 15-30 నిమిషాలకు ఏదో ఒక ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిదని, అలాగని కూల్ డ్రింక్స్ తాగొద్దని ఆయన వివరించారు. కూల్ డ్రింక్స్ వల్ల మరింత ప్రమాదం జరుగుతుందని, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ వంటి పానీయాలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధికంగా 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుందని, అత్యల్పంగా 44.1 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉందని తెలిపారు.

Read More
Next Story