దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వం కోసం షర్మిల, జగన్‌ల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. పోటా పోటీగా జయంతి వేడుకలను జరిపేందుకు పోటీ పడుతున్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఆయన కుమారుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుమార్తె, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పోటీ పడుతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ జన్మదిన వేడుకలను నిర్వహించనుండగా, కాంగ్రెస్‌ పార్టీ తరపున వైఎస్‌ఆర్‌ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించేందుకు సన్నద్దమయ్యారు.

ఇద్దరూ వైఎస్‌ఆర్‌ బిడ్డలే అయినా, ఇప్పుడు ఆయన వారసత్వం కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్‌ఆర్‌ మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకొని, తానే వైఎస్‌ఆర్‌ వారసుడిని అని జగన్‌ ప్రజల్లోకి వెళ్లారు. మొదట అదే బాటలో నడిచి, అన్న జగన్‌ పార్టీ కోసం శ్రమించి అధికారంలోకి తేవడంలో కీలక భూమిక పోషించిన షర్మిల, అనంతరం జరిగిన పరిణామాల్లో తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడకు వెళ్లిపోయారు. 2024 ఎన్నికలకు ముందు ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేయడం, తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోవడం, అన్న ప్రభుత్వంపైనే కత్తి కట్టడం, పాలన తీరుపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోయడం, కడప నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగడం, తర్వాత ఓడి పోవడం అన్నీ చకచక జరిగి పోయాయి. ఈ నేపథ్యంలో అటు జగన్, ఇటు షర్మిల తండ్రి వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో వైఎస్‌ఆర్‌ రాజకీయ వారసులు ఎవరనేది మరో మారు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ నెల 8వ తేదీన వైఎస్‌ఆర్‌ 75వ జయంతి. ఈయన 1949 జూలై 8న జన్మించారు. వైఎస్‌ఆర్‌ తొలుత రెడ్డి కాంగ్రెస్‌ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసినా తర్వాత ఇందిరా కాంగ్రెస్‌లోనే తన ప్రయాణం కొనసాగించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా అనేక హోదాల్లో పని చేసిన రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఎప్పుడు వీడింది లేదు. తన మరణం వరకు కాంగ్రెస్‌ పార్టీని తన తల్లిగానే భావించే వారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోటు ఎదుర్కొని నిలబడి, వాటిని అధికమించి, చివరకు ముఖ్యమంత్రి స్థాయి వరకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అదే కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తానే వైఎస్‌ వారసురాలిగా ప్రకటించుకోగా, కుమారుడు కాబట్టి తానే నిజమైన వారసుడిగా జగన్‌ ప్రకటించుకున్నారు.
వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు షర్మిల ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. విజయవాడకు సమీపంలోని సీకే కన్వెషన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కాంగ్రెస్‌ పార్టీ పెద్దలను ఇప్పటికే ఆహ్వానించారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర కేబినెట్‌ మంత్రులను షర్మిల ఆహ్వానించారు.
తానే వైఎస్‌ఆర్‌కు నిజమైన రాజకీయ వారసురాలు అనే సందేశం మరో సారి ప్రజల్లోకి వెళ్లేలా వైఎస్‌ జయంతి వేడుకలను నిర్వహించేందుకు షర్మిల సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ అంటే వైఎస్‌ఆర్, వైఎస్‌ఆర్‌ అంటే కాంగ్రెస్‌ అనే సంకేతం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తెలిసే విధంగా వేడుకలను నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకే ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలను ఆహ్వానించినట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు కూడా టాక్‌ నడుస్తోంది. ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఈ వేడుకలను ఉపయోగించుకోవాలని, రాష్ట్ర విభజనతో కోల్పోయిన ఓట్‌ బ్యాంక్‌ను తమ వైపు ఆకరించుకోవాలని, ఈ వేడుకల సభ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మంచి సందేశం పంపాలనే ఆలోచనల్లో ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు ఉన్నారు.
మరో వైపు అన్నీ తానై జగన్‌ తన పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. పార్టీ శ్రేణులందరూ వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆ పార్టీ ఆధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని, మొక్కలు నాటడం, కర్తదానం చేయడం, పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చేపట్టేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దీంతో పాటుగా ప్రతి ఊరిలో వైఎస్‌ఆర్‌ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని సన్నాహాలు ప్రారంభించారు.
Next Story