YS Sharmila

వైఎస్‌ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఈనెల 21 ఆదివారం బాధ్యతలు చేపడతారు. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీలోని ముఖ్యులందరూ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతున్నారు.


వైఎస్‌ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమితులైన తరువాత వెంటనే బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. అయితే కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం నేటి సాయంత్రం జరుగుతున్నందున ఆ కార్యక్రమాల్లో షర్మిల నిమగ్నమయ్యారు. వచ్చే ఆదివారం బాధ్యతలు స్వీకరించేందుకు కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌ నుంచి ఇప్పటికే ముఖ్యులందరికీ సమాచారం అందుతోంది. సమాచారాన్ని మెయిల్, వాట్సాప్‌ల ద్వారా అందరికీ పంపించారు.

విజయవాడలోనే బాధ్యతల స్వీకరణ

విజయవాడలోనే షర్మిల ఏపీసీసీ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. నగరంలోని ఏ కన్వెన్షన్ హాలులో కానీ, ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో కానీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం వుంటుంది. ఆరోజు జన సమీకరణ కూడా వుంటుందని పలువురు చెబుతున్నారు.

కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్, పార్లమెంట్‌ సభ్యులు మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు సిడి మాయప్ప, క్రిష్టఫర్‌ తిలక్‌లు ముఖ్య అతిథిదులుగా హాజరవుతున్నారు. కార్యక్రమంలో సీడబ్లు్యసీ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు, వర్కింగ్‌ అధ్యక్షులు, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయ కార్యదర్శి తెలిపారు. ఇంకా కో ఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు, ఏపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఏఐసీసీ సభ్యులు, జిల్లా కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, మండల శాఖల అధ్యక్షులు, ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్స్‌ సెల్స్‌ ఆర్గనైజేషన్‌ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
నేడు గోల్కొండలో నిశ్చితార్థం
షర్మిల కుమారుని వివాహం వచ్చే నెల 17న జరుగుతుంది. నేటి సాయంత్రం హైదరాబాద్‌ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరగనున్న ఈ నిశ్చితార్ధానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సహా కుటుంబసభ్యులంతా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసం నుంచి 6.15 గంటలకు బయలుదేరి వెళతారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదించి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
చాలాకాలంగా సోదరుడు జగన్‌తో దూరంగా ఉన్న వైఎస్‌ షర్మిల తన కుమారుడి పెళ్లి నిశ్చితార్ధం, పెళ్లికి స్వయంగా తాడేపల్లి వచ్చి ఆహ్వానించారు. ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా అందర్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలు హాజరౌతారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ హాజరయ్యే పక్షంలో వైఎస్‌ జగన్‌తో కలిసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
నిశ్చితార్ధ ఆహ్వానాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని వైఎస్‌ షర్మిల ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అందుకే సీఎం జగన్‌తో పాటు ఇంకా ఎవరెవరు హాజరౌతారనేది ఆసక్తి రేపుతోంది. పిబ్రవరి 17న పెళ్లి జోధ్‌పూర్‌లోనూ, ఫిబ్రవరి 24న రిసెప్షన్‌ హైదరాబాద్‌ శంషాబాద్‌ ఫోర్ట్‌ గ్రౌండ్‌లో ఉంటుంది. వైఎస్‌ మరణానంతరం ఆ కుటుంబంలో జరుగుతున్న తొలి శుభకార్యం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Next Story