కడప పార్లమెంట్ స్థానం నుంచి నేను ఎందుకు పోటీ చేయకూడదో మీరు చెప్పండి. ఎందుకు పోటీ చేయాలో కూడా చెప్పండి. స్థానిక నాయకుల సమావవేశంలో షర్మిల
కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పార్లమెంట్ సభ్యురాలుగా పోటీలోకి దిగనున్నారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కడప కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో షర్మిల సమావేశం ఏర్పాటు చేసి మాట్లడారు. ఈ సందర్భంగా ఆమె తాను ఎందుకు పోటీ చేయాలో, ఎందుకు పోటీ చేయకూడదో ఒక్క మాటలో చెప్పాలని వారిని కోరారు. నాయకులు పలు అంశాలపై మాట్లాడారు.
కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సిన అవసరాన్ని నియోజకవర్గ నాయకులు చెప్పడం కొంతవరకు ఉపయోగపడిందనే భావనకు షర్మిల వచ్చారు. వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిపై వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా వుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వైఎస్ఆర్ సీపీలోని పలువురు నాయకులు వ్యక్తం చేశారు. అయినా జగన్ మాత్రం నాకు తమ్ముడైన అవినాష్ కు ఇవ్వకుండా ఉంటే ఎలాగనే వాదనను తెరపైకి తెచ్చారు.
అవినాష్ ను ఓడించడం ద్వారా రాజకీయాలు శాశ్వతం కాదని కుటుంబ సంబంధాలు శాశ్వతమనే విషయాన్ని తెలియజెప్పాలనే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలను కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే నియోజకవర్గంలోని నాయకుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుందనే అభిప్రాయంతో ప్రత్యేక సమావేశం షర్మిల ఏర్పాటు చేశారు.
కడప నాయకుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో అడుగులు ముందుకు వేయనున్నారు. అయితే వారి నుంచి అనుభవాలను పరిగణలోకి తీసుకున్న షర్మిల అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనతో పాటు పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించే క్రమంలో కడప పార్లమెంట్ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నట్లు ప్రకటించాలని ఉన్నట్లు సమాచారం.
కడప పార్లమెంట్ స్థానం నుంచి షర్మిల అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో ఒకసారి గెలిచారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దూరం కావడం, కొత్త పార్టీ పెట్టడం వల్ల అసెంబ్లీకి పులివెందుల నుంచి పోటీ చేశారు. పులివెందులలో కానీ, కడప పార్లమెంట్లో కానీ, అసలు కడప జిల్లా నుంచి మొత్తంగా వైఎస్ కుటుంబానికి మంచి పట్టు ఉంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్ షర్మిలకు మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా కుటుంబానికి షర్మిల దూరమయ్యారు. జగన్ తో పాటు వదిన భారతిని వద్దకు కూడా ఇంతవరకు వెళ్లలేదు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తరువాత నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ఎప్పటికప్పుడు కలుస్తూ వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు.
కడప పార్లమెంట్ ను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోగలిగితే సీఎం వైఎస్ జగన్ తో పాటు అవినాష్ రెడ్డికి కూడా చెక్ పెట్టిన వారం అవుతామనే ఆలోచనలో షర్మిల ఉన్నారు. కడప ఎంపీగా వున్న అవినాష్ రెడ్డి కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు పార్లమెంట్లో ప్రశించడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా ఎవరైనా పోటీ చేసేందుకు సిద్ధంగా వుండాలని పార్టీ క్యాడర్ కు పిలుపు నిచ్చారు.