అన్న జగన్‌ను లేఖలతో బంధిస్తున్న షర్మిల
x

అన్న జగన్‌ను లేఖలతో బంధిస్తున్న షర్మిల

జగన్‌ను ఎదుర్కొనేందుకు షర్మిల ఏ అవకాశాన్ని కూడా వదులు కోవడం లేదు. జగన్‌ను ప్రజా కోర్టులో నిలబట్టడమే లక్ష్యంగా షర్మిల లేఖాస్త్రాలు వరుసగా సంధిస్తున్నారు.


ఇప్పటి వరకు సభలు, సమావేశాలు, ప్రెస్‌ మీట్లతో అన్న సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్న వైఎస్‌ షర్మిల ఇప్పుడు వరుస బహిరంగ లేఖలతో జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఫల్యాలను ఎత్తి చూపుతూ రోజుకో బహిరంగ లేఖను విడుదల చేస్తూ సీఎం జగన్‌ను ప్రజా కోర్టు బోనులో నిలబెడుతున్నారు. నిన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలు, వారికి రాజ్యాంగ వల్ల సిద్ధించిన హక్కుల ప్రకారం అమలు చేయాల్సిన పథకాలు, గతంలో ఉన్న పథకాలను అమలు చేయకుండా సీఎం జగన్‌ వాటిని రద్దు చేయడం వంటి అంశాలతో ప్రశ్నలు సంధించి, సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేసిన షర్మిల, తాజాగా మరో అంశాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగాల భర్తీ, పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధి కోసం నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు పోతున్న వలసలు తదిత అంశాలను కేంద్ర బిందుగా మరో 9 అంశాలతో కూడిన ప్రశ్నలను సంధించారు. నవ సందేహాల పేరుతో సీఎం జగన్‌పైన షర్మిల మరో బహిరంగ లేఖాస్త్రాన్ని సందించారు. ఉద్యోగాల విషయంలో జగన్‌ మోసం చేశారని, నవ సందేహాలకు సమాధానం చెప్పాలని జగన్‌ను డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2.30లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్‌ చెప్పారు. ఇప్పుడు ఏమైందని నిలదీశారు. ప్రతి ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలండర్‌ ప్రకటì ంచారని, ఎందుకు జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న 25 పార్లెమెంట్‌ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించి 25 ఎంపిలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల ముందు జనగ్‌ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేశారని నిలదీశారు. గ్రూపు2 కింద ఒక్క ఉద్యోగాన్ని కూడా ఎందుకు భర్తీ చేయలేదని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి కేవలం 6వేల పోస్టులతో డీఎస్సీ ఎందుకు విడుదల చేశారని నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయక పోవడం వల్లే నిరుద్యోగులు పెరిగారని, దీంతో ఉపాధి కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని, దీనికి కారణం ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు జాబు రావాలంటే మీ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని దీనిని అంగీకరిస్తారా అని సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. ఈ నవ సందేహాలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చర్చనీయాంశంగా మారిన బహిరంగ లేఖలు
అయితే అన్న జగన్‌పై చెల్లి షర్మిల సంధిస్తున్న ప్రశ్నలు అన్ని వర్గాల్లోను చర్చనీయాంశంగా మారాయి. ఉన్న సమస్యలపై సహేతుకంగా ప్రశ్నలు లేవనెత్తుతూ, సీఎం జగన్‌ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తూనే ఆయా వర్గాల ప్రజల మద్ధతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు ఏ అంశంపై లేఖాస్త్రం సంధిస్తారో అనే కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్‌ను ప్రజల్లో పలుచన చేయడానికే షర్మిల బహిరంగ లేఖలకు తెరతీసిందని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో విమర్శలు వినిపిస్తుండగా, ప్రజల సమస్యలు, ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం, వైఫల్యాలపై విమర్శలు చేయడం జగన్‌ను పలుచన చేయడం ఎలా అవుతుందనే వాదన ప్రతిపక్ష పార్టీల వర్గాల్లో వినిపిస్తోంది.
Read More
Next Story