ఎన్నికల్లో ఓటమి చవి చూసినా జగన్‌ను షర్మిల వెంటాడుతూనే ఉన్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని పక్కన పెట్టి, జగన్‌ పాలన గురించే విమర్శలు సంధిస్తున్నారు.


ఇటీవల జరిగిన 2024 స్వారత్రిక ఎన్నికల్లో జగన్‌ పార్టీని ఓడించేందుకు కంకణం కట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల జగన్‌ ఓడినా కత్తి దూస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో జగన్‌ ఓడిపోయినా జగన్‌మోహన్‌రెడ్డిని వెంటాడుతూనే ఉన్నారు. రాష్ట్ర సమస్యలు, ప్రజల ఇబ్బందులు, వాటి పరిష్కారాలు, సంక్షేమ పథకాలు, వాటి అమలు వంటి అంశాలపై ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ప్రశ్నిస్తారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతారు. ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు ఎక్కు పెడుతారు. సహజంగా విపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా, ఆ పార్టీల నేతలైన ఇదే చేస్తారు. అందుకోసం విపక్షంలో ఉన్న పార్టీలన్నీ ఏక తాటిపైకి వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అందుకు భిన్నంగా వ్యహరిస్తున్నారనే టాక్‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శంచకుండా గత ఐదేళ్లల్లో పరిపాలన చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం అనుసరించిన విధానాలపైనే ఇంకా విమర్శలు ఎక్కు పెడుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల జరిగిన 2024 సార్వత్రికలకు ముందు షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బిడ్డ కావడంతో షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు బాధ్యతలు అప్పగించారు. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ 2024 ఎన్నికల్లో రంగంలోకి దిగింది. దాదాపు 159 స్థానల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఒక్క సీటులో కూడా గెలవలేక పోయిన కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికల కంటే ఈ సారి బాగానే ఓటింగ్‌ శాతాన్ని పెంచుకోగలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.7 శాతం వరకు ఓటర్ల మద్దతు పొందగలిగింది. కడప పార్లమెంట్‌లో అయితే షర్మిల పెద్ద ప్రభావాన్ని చూపగలిగారు. కడప పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన షర్మిల 141,039 ఓట్లను సంపాదించి అందరి అంచనాలను తారు మారు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ, జగన్‌లనే టార్గెట్‌గా చేసుకొని ఎన్నికల రంగంలోకి దిగిన షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలోని పలు చోట్ల గెలుపు ఓటమిలపై ప్రభావాన్ని చూపగలిగారు.
ఎన్నికల సమయంలో జగన్‌ను, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ పాలసీలను, పనితీరును తూర్పార బట్టిన షర్మిల నేటికీ అదే ధోరణితోనే ముందుకెళ్తున్నారు. తాజాగా జగన్‌ చేపట్టిన ఢిల్లీ ధర్నాపైన అదే స్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రత్యేక హాదాపైన, విభజన సమస్యలపైన కానీ, రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలపైన ఐదేళ్ల పదవీ కాలంలో జగన్‌ ఎందుకు ఢిల్లీలో ధర్నాలు చేయలేదని విమర్శలు ఎక్కు పెట్టారు. జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరల్లో పంటకు నష్టం జరిగిందని, ప్రాజెక్టులను పూర్తి చేయక పోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి ప్రాంతాల్లో వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఆమె బుధవారం పరిశీలించారు. ప్రత్యేక హోదా కావాలంటే అసెంబ్లీకి వెళ్లాలి కానీ, హైకోర్టుకు కాదని విమర్శలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తను చంపేశారని ఢిల్లీలో ధర్నా చేపట్టిన జగన్‌ రైతుల సంక్షేమానికి, స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు, కడప ఉక్కు పరిశ్రమ, పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేపట్ట లేదని నిలదీశారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత కొన్ని పథకాల పేర్లను మార్చింది. అందులో ఆరోగ్యశ్రీ ఒకటి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరుతో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పేరుతో ఉన్న పథకం పేరును ఎన్డీఆర్‌ ఆరోగ్య సేవ పథకంగా పేరు మార్చింది. అలాగే వైఎస్‌ఆర్‌ పేరుతో ఉన్న హెల్త్‌ యూనివర్శిటీ పేరును ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీగా పేరు మార్చింది.
వీటిపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల, వైఎస్‌ఆర్‌ బిడ్డ అయ్యుండి కూడా తన తండ్రి పేరుతో ఉన్న పథకాల పేర్ల మార్పుపై ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం కూడా చేయలేక పోయారనే విమర్శలు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మెదడు నుంచి ఈ పథకం పురుడు పోసుకుంది. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పేరుతో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు కూడా ఇదే పేర్లను కంటిన్యూ చేశారు. అలాంటి నేత వైఎస్‌ఆర్‌పేరుతో ఆరోగ్యశ్రీకి పేరు పెడితే.. ఆ పేరు మార్పుపై ఎందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
నాడు కాంగ్రెస్‌కు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వర్గాలు విభజన అనంతరం వైఎస్‌ఆర్‌సీపీతో సేల్‌ అవుతూ వచ్చాయి. నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌ వైపు తిప్పుకోవడమే ప్రధాన లక్ష్యంగా జగన్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారనే టాక్‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Next Story